Financial Markets 2023: 2023లో మీ పెట్టుబడుల పరిస్థితేంటి, మీ డబ్బు ఎలా మారొచ్చు?
ద్రవ్యోల్బణం దాదాపుగా గరిష్ట స్థాయికి చేరినందున, వడ్డీ రేట్లు ఏడాది పొడవునా స్థిరంగా ఉండొచ్చు.
Financial Markets 2023: పెట్టుబడుల విషయంలో ఈ సంవత్సరం ఎలా గడిచిందని చాలా మంది బేరీజు వేసుకునే సమయంలో, తెలివైన పెట్టుబడిదారులు మాత్రం, రాబోయే సంవత్సరం ఎలా ఉంటుందని అంచనాలు కడతారు. సాధారణ పెట్టుబడిదారుకి, ప్రొఫెషనల్‌కు ఉన్న తేడా ఇది.
2023 సంవత్సరంలో మీ డబ్బు 2022 కంటే ఎక్కువ లేదా తక్కువ కావచ్చు. మిమ్మల్ని బలంగా ముందుకు తోసే వెనుక గాలులు (టెయిల్ విండ్స్) లేదా, మీ వృద్ధిని నిరోధించే ఎదురు గాలులు (హెడ్ విండ్స్) ఉండే అవకాశం ఉంది.
మీ డబ్బును పెంచే అనుకూల బలాలు
ముందుగా శుభవార్త గురించి మాట్లాడుకుందాం. 2023లో మీ సంపదను మీరు సులభంగా రక్షించుకోవచ్చు. ద్రవ్యోల్బణం దాదాపుగా గరిష్ట స్థాయికి చేరినందున, వడ్డీ రేట్లు ఏడాది పొడవునా స్థిరంగా ఉండొచ్చు. 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాల్లో వినియోగదారు ధరల ద్రవ్యోల్బణం (consumer price inflation) 5% పైన ఉండొచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కోరుకున్న స్థాయి (desired level) అయిన 4% కంటే ఇది ఎక్కువ, సహన స్థాయి (tolerance level) 6% కంటే తక్కువ.
ద్రవ్యోల్బణం రేటు తగ్గుముఖం పట్టినప్పటికీ 2023లో వడ్డీ రేట్లలో అనూహ్య కోతలు మాత్రం ఉండవు. 2023లో సంపద కాపాడుకోవాలని చూస్తున్న వారికి... ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లు, గవర్నమెంట్ బాండ్లలో పెట్టే పెట్టుబడులు రక్షణ + రాబడిని ఇస్తాయి.
ఆర్థిక వ్యవస్థ మీద ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తగ్గుముఖం పట్టినా, కార్పొరేట్ కంపెనీ తక్షణం లాభాల్లోకి వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి, షేర్ల ధరలు 2023లో ఒక రేంజ్‌లోనే కొనసాగే అవకాశం ఉంది. దేశంలో సాధారణ రుతుపవనాలను నిపుణులు అంచనా వేస్తున్నారు. ముడి చమురు ధర కూడా బ్యారెల్‌కు $100 మార్కుకు అటు, ఇటు కదులుతూ స్థిరంగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి.
మీ సంపదను హరించే వ్యతిరేక శక్తులు
'అనిశ్చితి' (uncertainty) అన్న పదం వల్లే ఏ పెట్టుబడిలోనైనా క్షీణత ప్రారంభమవుతుంది. ఐరోపాలో సుదీర్ఘ యుద్ధం కారణంగా అంతర్జాతీయ కమొడిటీ ధరలు పెరిగాయి. చైనాలో ఆంక్షల వల్ల సరఫరా గొలుసుల్లో అంతరాయాలు పెరిగి, ప్రపంచవ్యాప్తంగా కమొడిటీల పంపిణీని దెబ్బతీస్తుంది. అయితే... 'చైనా + 1' వ్యూహం వల్ల భారతదేశ పరిశ్రమలు ప్రయోజనం పొందుతాయి.
2023 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్, భారతదేశ సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ అవుతుంది. ఓటర్లను ఆకర్షించేందుకు 2023 బడ్జెట్‌లో సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రకటిస్తుంది. దీని అర్ధం, 2023లో ద్రవ్యోల్బణం ఎక్కడా తగ్గదు. ఈక్విటీ మార్కెట్లలో షేర్ ధరలు ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మిగిలిన ప్రపంచం అంతగా రాణించకపోవడంతో, 2023లో భారత మార్కెట్లు పెద్ద ర్యాలీని చూసే అవకాశం లేదు.
2023లో మీ వ్యూహం ఎలా ఉండాలి?
2023లో మీ డబ్బు మీద చాలా అంశాలు ప్రభావం చూపుతాయి. పెట్టుబడి పెట్టడం అనేది 'ఆల్-ఆర్-నోన్' గేమ్ కాదు. 2022లో ఫ్యాన్సీ ఫ్లైట్ చాలామంది విషయంలో క్రాష్ అయింది. లిస్టింగ్ తర్వాత స్టాక్ మార్కెట్‌కు డార్లింగ్‌గా మారాల్సిన కన్స్యూమర్ టెక్నాలజీ కంపెనీలు, తమ విలువలో సగానికి పైగా నష్టపోయాయి. బిట్‌కాయిన్స్, క్రిప్టో కరెన్సీలు చాలా దారుణంగా ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో... మీ సంపద మొత్తాన్నీ ఒకే గూట్లో ఉంచవద్దు. ప్రతి నెలా మీ మిగులు డబ్బును అన్ని ఆస్తి తరగతులకు విభజించాలి. మీరు పెట్టుబడికి కొత్త అయితే, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ లేదా ఇండెక్స్ ఫండ్స్ ప్రారంభించవచ్చు. మీకు అనుభవం ఉంటే, రిస్క్‌ను తగ్గించుకోవడానికి మీ పోర్ట్‌ఫోలియోను బ్యాలెన్స్ చేయాలి. దిగ్గజ పెట్టుబడిదారు వారెన్ బఫెట్ ఒక మార్గదర్శి అని మీరు భావిస్తే, ఆయన మార్గంలోనే 'నెమ్మదిగా సంపద పెంచుకోవడం' (Getting rich slow) ఒక మంచి మంత్రం అవుతుంది.