New Rules: జూన్ నుంచి కొత్త మార్పులు, ఈ వివరాలు తెలీకపోతే మీ జేబు గుల్ల!
కొత్త నెల ప్రారంభం నుంచి దేశంలో కొన్ని విషయాలు మారాయి,
Rules Changing From 1 June 2023: జూన్ నెల ప్రారంభం అయింది. ఎప్పటిలాగే, కొత్త నెల ప్రారంభం నుంచి దేశంలో కొన్ని విషయాలు మారాయి, అవి సామాన్యుల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి.
జూన్ 1 నుంచి మారిన విషయాలు:
1. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
చమురు కంపెనీలు ప్రతి నెలా LPG, CNG, PNG ధరలను మారుస్తాయి. అదే తరహాలో ఈ నెల ప్రారంభం నుంచి రేట్లు మార్చాయి. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ (Commercial LPG Cylinder) రేటును భారీగా తగ్గించాయి. దిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటును రూ. 83.5 తగ్గించాయి. ఇప్పుడు కొత్త ధర రూ.1773 కి చేరింది. గత నెలలో ఈ రేటు రూ. 1856.50 గా ఉంది. అంతకుముందు నెలల్లో, అంటే మే, ఏప్రిల్ నెలల్లో కూడా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరల్లో చమురు సంస్థలు కోత పెట్టాయి. అయితే, సామాన్యుడి ఇంట్లో వంటకు ప్రతిరోజూ అవసరమయ్యే డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ (Domestic LPG Cylinder) రేటును మాత్రం తగ్గించలేదు. చివరిసారిగా, మార్చి నెలలో రేటు పెంచాయి, ఆ తర్వాత తగ్గించడం మరిచిపోయాయి. ప్రస్తుతం, 14.2 కేజీల దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ ధర దిల్లీలో రూ. 1103, ముంబైలో రూ. 1102.5, బెంగళూరులో రూ. 1105.5, హైదరాబాద్‌లో రూ. 1155గా ఉంది.
2. '100 రోజులు - 100 చెల్లింపులు' కార్యక్రమం ప్రారంభం
బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ చేసి, ఏ కారణం వల్లో వాటిని తిరిగి వెనక్కు తీసుకోని (unclaimed deposits) వ్యక్తులు లేదా కుటుంబాలకు ఆ డబ్బును తిరిగి అప్పగించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ ప్రోగ్రామ్ పేరు '100 రోజులు - 100 చెల్లింపులు' ('100 Days 100 Pays' ). దీని ద్వారా, ప్రతి బ్యాంకులోని టాప్-100 అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ హోల్డర్లను లేదా వాళ్ల కుటుంబాలను గుర్తించి, 100 రోజుల్లో ఆ డబ్బును తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు అన్ని బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశాలు అందాయి. దీని ద్వారా, ఇన్‌యాక్టివ్, అన్‌క్లెయిమ్‌డ్ మొత్తాన్ని తగ్గించేందుకు ఆర్‌బీఐ ప్రయత్నిస్తోంది.
3. ఎలక్ట్రిక్ బైకులు మరింత ప్రియం
మీరు, ఈ నెలలో (జూన్) ఎలక్ట్రిక్ టూ వీలర్ (electric two wheeler) కొనాలని ప్లాన్ చేసినట్లయితే, ఇది మీకు చేదు వార్త. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు నేటి నుంచి (జూన్ 1, 2023) పెరిగాయి. ఎలక్ట్రిక్ బండ్ల మీద ఇస్తున్న సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ ప్రకారం, కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ మే నెల 21న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ వాహనాలపై గతంలో కిలోవాట్‌కు రూ. 15,000 సబ్సిడీ ఉండగా, ఇప్పుడు దానిని రూ. 10,000కు తగ్గించారు. ఈ నేపథ్యంలో, 2023 జూన్ 1వ తేదీ నుంచి, ఎలక్ట్రిక్ టూ వీలర్ల కొనుగోలు ఖర్చు రూ. 25,000 నుంచి రూ. 30,000 వరకు పెరిగింది.
4. ఎగుమతి చేసే కఫ్ సిరప్‌కు పరీక్ష
జూన్ 1 నుంచి భారతదేశ ఫార్మా కంపెనీలు ఎగుమతి చేసే అన్ని రకాల దగ్గు సిరప్‌లను తప్పనిసరిగా పరీక్షించనున్నట్లు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ప్రకటించింది. ఔషధ ఎగుమతి కంపెనీలు ముందుగా ప్రభుత్వ ల్యాబ్‌లో ఆ దగ్గు మందును పరీక్షించి, నివేదికను చూపించాల్సి ఉంటుంది. రిపోర్ట్ సంతృప్తికరంగా ఉంటేనే కఫ్ సిరప్‌ను ఎగుమతి చేయడానికి ఆ కంపెనీకి DCGI నుంచి అనుమతి లభిస్తుంది.
మరో ఆసక్తికర కథనం: జూన్‌లో బ్యాంక్‌లకు 12 రోజులు సెలవులు, ఇదిగో హాలిడేస్ లిస్ట్