Elon Musk Tweet: మస్క్ మామ కొంప ముంచిన 'తప్పుడు ట్వీట్', చేతలు అదుపులో ఉండవుగా మరి!
ఈ కేసును శాన్ ఫ్రాన్సిస్కోలో కాకుండా, ఇప్పుడు టెస్లా ప్రధాన కార్యాలయం ఉన్న టెక్సాస్‌కు మార్చాలని మస్క్ వేసిన మోషన్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.
Elon Musk Tweet: ప్రపంచంలోనే ఖరీదైన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లాకు (Tesla Inc), ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలాన్ మస్క్‌కు (Tesla CEO Elon Musk) మరో దఫా కష్టాలు మొదలయ్యాయి. అమెరికన్ కోర్టులో ఎలాన్ మస్క్‌పై కేసు విచారణ నిన్నటి (మంగళవారం, 17 జనవరి 2023) నుంచి ప్రారంభమైంది. టెస్లా కంపెనీ గురించి నాలుగేళ్ల క్రితం ఒక ట్వీట్ చేసిన ఎలాన్ మస్క్ మీద నమోదైన కేసులో న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. ఈ కేసును శాన్ ఫ్రాన్సిస్కోలో కాకుండా, ఇప్పుడు టెస్లా ప్రధాన కార్యాలయం ఉన్న టెక్సాస్‌కు మార్చాలని మస్క్ వేసిన మోషన్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.
ఎలాన్ మస్క్ మీద వచ్చిన ఆరోపణలు ఏంటి?
టెస్లా ఇంక్‌ను ప్రైవేటీకరిస్తామంటూ 2018లో ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. అంటే, ఆ కంపెనీని అమెరికన్ స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ చేసి, పబ్లిక్ లిమిటెడ్ నుంచి ప్రైవేట్ లిమిటెడ్‌గా మారుస్తామన్నది ఆ ట్వీట్ అర్ధం.
ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చడం అంటే?
ఒక కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయితే, అప్పటి నుంచి ఆ సంస్థను పబ్లిక్ లిమిటెడ్‌గా పరిగణిస్తారు. అంటే, ఆ కంపెనీ వాటాల్లో కొంత మొత్తం షేర్ల రూపంలో పబ్లిక్ (ప్రజలు) చేతుల్లో ఉంటుంది. ఆ కంపెనీని తిరిగి ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చాలంటే, స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ చేయాలి. ఇందుకోసం, పబ్లిక్ చేతుల్లో ఉన్న వాటాలను కంపెనీ తిరిగి కొనేయాలి. పబ్లిక్ చేతుల్లో ఆ కంపెనీ షేర్లు లేకపోతేనే డీలిస్టింగ్‌కు వీలవుతుంది. సాధారణంగా డీలిస్ట్‌కు వెళ్లే కంపెనీ, మార్కెట్ ధర కంటే ఎక్కువ ధర ఆఫర్ చేసి పబ్లిక్ నుంచి షేర్లను తిరిగి కొంటుంది. దీంతో, ఆ షేర్లకు డిమాండ్, ధర రెండూ పెరుగుతాయి. ప్రైవేటీకరిస్తామంటూ ఎలాన్ మస్క్ ట్వీట్ చేసిన తర్వాత జరిగింది ఇదే. ఆ ట్వీట్ తర్వాత, యుఎస్ స్టాక్ మార్కెట్లో టెస్లా షేర్లలో విపరీతమైన జంప్ కనిపించింది. మొత్తం యుఎస్ స్టాక్ మార్కెట్‌లో కూడా బలమైన ర్యాలీ వచ్చింది.
మస్క్ ట్వీట్‌లో ఏం ఉంది?
టెస్లాను ప్రైవేట్ కంపెనీగా చేయబోతున్నట్లు 2018లో ట్వీట్ చేసిన ఎలాన్ మస్క్, ఒక్కో టెస్లా షేర్‌ను 420 డాలర్లకు కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. మార్కెట్ ఫ్లోటింగ్‌లో ఉన్న షేర్లను కొనడానికి సౌదీ సావరిన్ వెల్త్ ఫండ్ నుంచి మస్క్ డబ్బు పొందబోతున్నట్లు, ఆ ఫండ్ అధికారులతో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి.
ఎలాన్ మస్క్ ప్రకటించిన 420 డాలర్ల విలువ, ఆ సమయంలో టెస్లా షేర్ మార్కెట్ ధర (344 డాలర్లు) కంటే 18 శాతం ఎక్కువ. ఈ వార్త తర్వాత టెస్లా షేర్లలో కనిపించిన విపరీతమైన బూమ్ కనిపించింది. ట్వీట్ చేసిన రోజు టెస్లా షేర్లు 387.46 డాలర్ల గరిష్ట స్థాయికి చేరాయి. కానీ 420 డాలర్లను ఎప్పుడూ టచ్ చేయలేదు. ఒక నెల తర్వాత, ట్వీట్ రోజు ఉన్న 344 డాలర్ల విలువ కంటే తక్కువకు, 263.24 డాలర్లకు చేరాయి. ఈ ధర ఊగిసలాటలో షేర్‌హోల్డర్లు భారీగా నష్టపోయారు.
ఈ తతంగం మీద, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఎలాన్ మస్క్ మీద న్యాయస్థానంలో కేసు వేసింది. కంపెనీ ఛైర్మన్ పదవిని విడిచిపెట్టాలని, కంపెనీ, మస్క్ తలో 20 మిలియన్ డాలర్లు జరిమానా కట్టాలని కమిషన్ ఆదేశించింది. దీని మీద ఇరువర్గాలకు ఒక ఒప్పందం కుదురింది. కంపెనీ ఛైర్మన్ పదవిని మస్క్ విడిచి పెట్టారు. కానీ, CEO పదవిలో మాత్రం కొనసాగుతున్నారు. 20 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించడానికి కూడా అంగీకరించారు.
మస్క్ ఉద్దేశపూర్వకంగా 'తప్పుడు' ట్వీట్ చేశారని, ఫండ్ రైజింగ్ కోసం సౌదీ సావరిన్ వెల్త్ ఫండ్‌తో చర్చలు జరపలేదని మంగళవారం ప్రారంభమైన విచారణలో కోర్టు ఆక్షేపించింది. ఈ కేసులోనే విచారణ కొనసాగుతోంది.