Zomato Co-Founder Resigned: కొత్త ఏడాది ప్రారంభంలోనే జొమాటోకు షాక్, కో-ఫౌండర్ రాజీనామా
జొమాటో లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు & చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గుంజన్ పటిదార్, కంపెనీకి రాజీనామా చేశారు.
Zomato Co-Founder Resigned: దేశంలో అతి పెద్ద ఆన్‌లైన్ ఫుడ్ డెలివెరీ కంపెనీ జొమాటో లిమిటెడ్‌కు కొత్త సంవత్సరం ప్రారంభంలోనే షాక్ తగిలింది. రెండు నెలల్లోనే మరో సహ వ్యవస్థాపకుడు కంపెనీకి గుడ్ బై చెప్పారు.
జొమాటో లిమిటెడ్ (Zomato Ltd) సహ వ్యవస్థాపకుడు & చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గుంజన్ పటిదార్ (Zomato Co-Founder Gunjan Patidar Resigned), కంపెనీకి రాజీనామా చేశారు. కంపెనీలో తాను నిర్వహిస్తున్న అన్ని బాధ్యతల నుంచి తప్పుకున్నారు. సోమవారం (02 జనవరి 2023), తన రాజీనామాను ఆయన సమర్పించారు. తన ఎక్సేంజ్ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని జొమాటో వెల్లడించింది.
Zomatoకి అద్భుత సహకారం
జొమాటో తొలి నాటి కొద్ది మంది ఉద్యోగుల్లో గుంజన్ పటిదార్ ఒకరు. కంపెనీ కోసం కోర్ టెక్నాలజీ వ్యవస్థలను (Core Technology Systems) ఆయన నిర్మించారు. గత 10 సంవత్సరాల్లో బలమైన సాంకేతిక నాయకత్వ బృందాన్ని పెంచుకున్నట్లు జొమాటో వెల్లడించింది. జొమాటో నిర్మాణంలో గుంజన్ పాటిదార్ సహకారం అమూల్యమైనదని పేర్కొంది.
గత ఏడాది మోహిత్ గుప్తా రాజీనామా
2022 నవంబర్ నెలలో, కంపెనీకి చెందిన మరో సహ వ్యవస్థాపకుడు మోహిత్ గుప్తా (Mohit Gupta, Co-founder) తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నాలుగున్నరేళ్ల క్రితం Zomatoలో చేరిన గుప్తా, ఫుడ్ డెలివరీ బిజినెస్ CEO పదవి నుంచి సహ వ్యవస్థాపకుడిగా 2020లో ఎలివేట్ అయ్యారు.
వీళ్లే కాదు, గత ఏడాది జొమాటో నుంచి చాలా ఉన్నత స్థాయి వలసలు కనిపించాయి. కొత్త వ్యాపారాల హెడ్‌గా ఉన్న రాహుల్ గంజు (Rahul Ganju), మాజీ వైస్ ప్రెసిడెంట్ & ఇంటర్‌సిటీ హెడ్ సిద్ధార్థ్ ఝవార్ (Siddharth Jhawar, Former Vice President and Head of Intercity), సహ వ్యవస్థాపకుడు గౌరవ్ గుప్తా (Gaurav Gupta, Co-founder) కూడా కంపెనీ బాధ్యతలను వదులుకుని బయటకు వచ్చారు.
2022 సెప్టెంబర్ త్రైమాసికంలో పెరిగిన ఆదాయం
2022 సెప్టెంబర్ త్రైమాసికంలో (2022 జులై-సెప్టెంబర్ కాలం లేదా Q3FY23) Zomato నికర నష్టం రూ. 250.8 కోట్లకు తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలో (Q3FY22) ఈ నష్టం రూ. 434.9 కోట్లుగా ఉంది. Q3FY23లో ఆదాయం 62.20 శాతం వృద్ధితో రూ. 1,661.3 కోట్లకు చేరుకుంది. 2022 సెప్టెంబర్ త్రైమాసికంలో, కంపెనీ ఫుడ్ డెలివరీ వ్యాపారం అమ్మకాలు 22 శాతం పెరిగి రూ. 6,631 కోట్లకు చేరాయి, అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 5,410 కోట్లుగా ఉన్నాయి.
సోమవారం BSEలో జోమాటో షేరు 1.52 శాతం పెరిగి రూ.60.26 వద్ద ముగిసింది. గత ఆరు నెలల్లో 11% పైగా పెరిగింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.