DA Hike: దసరాకు ముందే ఫెస్టివ్ బోనస్ ప్రకటించిన మోదీ సర్కార్, DA 4% పెంపు
జులై నుంచి సెప్టెంబర్ వరకు ఉన్న బకాయిలను అక్టోబర్ నెల జీతం/పెన్షన్‌తో కలిపి కేంద్ర ఉద్యోగులు/పెన్షనర్లకు సెంట్రల్ గవర్నమెంట్ చెల్లించవచ్చు.
Cabinet approves hike in DA: దసరా, దీపావళి పండుగలకు ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మోదీ ప్రభుత్వం పెద్ద కానుక ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో... కరవు భత్యాన్ని (Dearness Allowance -DA) 4% పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డియర్‌నెస్ అలవెన్స్‌లో 4 శాతం పెంపుతో, మొత్తం DA ప్రస్తుతమున్న 42 శాతం నుంచి 46 శాతానికి చేరింది.
తాజా DA పెంపు జులై 1, 2023 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో... జులై నుంచి సెప్టెంబర్ వరకు ఉన్న బకాయిలను అక్టోబర్ నెల జీతం/పెన్షన్‌తో కలిపి కేంద్ర ఉద్యోగులు/పెన్షనర్లకు సెంట్రల్ గవర్నమెంట్ చెల్లించవచ్చు. కాబట్టి, డీఏ హైక్‌తో కేంద్ర ఉద్యోగులు/పెన్షనర్లకు అక్టోబర్ నెల డబ్బులు భారీ మొత్తంలో చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ డబ్బు పండుగ ఖర్చులకు ఉపయోగపడుతుంది.
గత ఏడాది సెప్టెంబర్‌లో, దీపావళికి కొన్ని వారాల ముందు సెంట్రల్ కేబినెట్ DAను 4 శాతం పెంచింది.
ఈ ఏడాది మార్చిలో, కేంద్ర మంత్రివర్గం కరవు భత్యం, డియర్‌నెస్ రిలీఫ్‌ను 4 శాతం పెంచి 42 శాతానికి చేర్చింది. ఆ పెంపు జనవరి 01, 2023 నుంచి అమలులోకి వచ్చింది.
DAను ఏటా రెండుసార్లు - జనవరి నెల నుంచి ఒకసారి, జులై నెల నుంచి రెండోసారి పెంచుతారు. ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ప్రభుత్వం అందించే జీవన వ్యయ సర్దుబాటు భత్యంగా డియర్‌నెస్ అలవెన్స్‌ను చూడవచ్చు. డీఏ పెంపునకు ఒక ప్రామాణిక పద్ధతి ఉంది. ప్రతి నెలా లేబర్ బ్యూరో విడుదల చేసే "కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్" [Consumer Price Index for Industrial Workers - CPI(IW)] ఆధారంగా డీఏను లెక్కిస్తారు. కార్మిక శాఖకు చెందిన అనుబంధ విభాగమే ఈ లేబర్ బ్యూరో.
మన దేశంలో నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 15 నుంచి ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 24న దసరా, నవంబర్ 12న దీపావళి పండుగలు ఉన్నాయి. ఈ పండుగల సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు/పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచాలని మోదీ సర్కారు నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 47 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది.
కేంద్ర ప్రభుత్వ రైల్వే ఉద్యోగులకు బోనస్ ఇవ్వడానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం
డియర్‌నెస్ అలవెన్స్ పెంపుతో కేంద్ర ఉద్యోగులు/పెన్షనర్లపై ద్రవ్యోల్బణం ప్రభావం తగ్గుతుంది. ఇటీవలి కాలంలో ఆహార ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. 2023 ఆగస్టులో 6.83 శాతంగా ఉన్న రిటైల్ ఇన్‌ఫ్లేషన్ సెప్టెంబర్‌లో 5.02 శాతానికి పడిపోయినా, అంతకుముందు జులై నెలలో 7.44 శాతానికి చేరుకుంది. ఆగస్టులో 9.94 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 6.56 శాతానికి తగ్గింది. కానీ ఇప్పటికీ గోధుమలు, బియ్యం, పప్పులు, పంచదార ధరలు సామాన్య ప్రజలను ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి. పెరిగిన ధరల కారణంగా వంటగది బడ్జెట్ భారంగా మారింది. ఈ పరిస్థితిలో, డియర్‌నెస్ అలవెన్స్ పెంపుతో ధరల భారం కాస్త తగ్గుతుంది.
మరో ఆసక్తికర కథనం: పండుగ సీజన్‌లో తియ్యటి వార్త, పంచదార రేట్లు పెరగకుండా కేంద్రం కీలక నిర్ణయం
Join Us on Telegram: https://t.me/abpdesamofficial