Telangana Budget 2022-23: పింఛన్‌దారులు, నేతన్నలకు శుభవార్త చెప్పిన హరీష్, ఈ ఏడాదే ఆ నిర్ణయం అమలు
తెలంగాణ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు ఆర్థికమంత్రి హరీష్ రావు తెలిపారు. నేతన్నలకు, పింఛన్‌దారులకు ఇచ్చిన హామీలను ఈ ఏడాది నుంచ అమలు చేయబోతున్నట్టు పేర్కొన్నారు.
రాష్ట్రంలో వైద్య సేవలు మరింత విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో టిమ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం నలుదిక్కులా సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గచ్చిబౌలి, ఎల్బీనగర్, అల్వాల్, ఎర్రగడ్డలో ఈ హాస్పిటల్స్ నిర్మించనున్నారు. ప్రతి హాస్పిటల్‌కు వెయ్యి పడకల చొప్పున నాలుగు వేల పడకలతో వీటిని తీసుకొస్తారు. ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకోనున్నారు.
నిమ్స్‌కు మహర్దశ
నిమ్స్‌లో మరో రెండు వేల పడకలను పెంచబోతున్నారు. వరంగల్‌లో హెల్త్ సిటీని నిర్మించనున్నారు. మొదట కాళోజీ నారాయణ రావు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వరంగల్‌లో అధునాతనమైన వసతులతో కొత్తగా రెండు వేల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారని... అక్కడ 24 అంతస్తుల్లో నిర్మించబోయే ఆసుపత్రి కోసం 11 వందల కోట్లు వెచ్చించనుంది ప్రభుత్వం. ఇందులో 35 సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఉంటాయి.
జిల్లాకో మెడికల్ కాలేజీ
రాబోయే రెండేళ్లలో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది కొత్తగా ఎనిమిది వైద్య కళాశాలలను, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ప్రభుత్వ ఏర్పాటు చేస్తుంది. 2023లో మిగతా ఎనిమిది మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, వరంగల్, నారాయణపేట, గద్వాల, యాదాద్రిలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తుంది. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం ఈ బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయిస్తూ ప్రతిపాదనలు చేసింది.
ఇప్పటికే ఉన్న బస్తీ దవాఖానాలకు అదనంగా మరో అరవై ఏర్పాటు చేయనుంది.
పెరిగిన డైట్ ఛార్జీలు
టీబీ, క్యాన్సర్ రోగులకు మంచి ఆహారం ఇచ్చేందుకు డైట్ ఛార్జీలు పెంచింది ప్రభుత్వం. బెడ్‌కు 112 రూపాయలకు పెంచింది. సాధారణ రోగులకు ఇచ్చే డైట్ ఛార్జీలు బెడ్ ఒక్కిటింకి 40 రూపాయల నుంచి 80 రూపాయలకు పెంచాలని నిర్ణయించింది. దీని కోసం ప్రభుత్వం ఏటా 43.5 కోట్లు ఖర్చు పెట్టనుంది.
సహాయకులకు భోజనాలు
హైదరాబాద్‌లోని 18 మేజర్ ప్రభుత్వ హాస్పిటల్స్‌లో రోగితో ఉండే సహాయకులకు కూడా సబ్సిడీ భోజనం పెట్టాలని నిర్ణయించింది. దీని కోసం 38.66 కోట్లు ఖర్చు పెట్టనుంది.
తగ్గుతున్న వయోపరిమితి
వృద్ధాప్య పింఛన్ల విషయంలో తీపి కబురు చెప్పింది ప్రభుత్వం. వయపరిమితిని 57 ఏళ్లకు తగ్గింపును త్వరలోనే అమలు చేస్తామని పేర్కొంది. ఆసరా పింఛన్ల కోసం 2022-23 వార్షిక బడ్జెట్‌లో 11728 కోట్ల రూపాయలు ప్రతిపాదించింది ప్రభుత్వం.
కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌కు వార్షిక బడ్జెట్‌లో 2750 కోట్లు కేటాయించింది. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం 12000 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం.
ఎస్టీలకు భారీగా నిధులు
గిరిజన, ఆదివాసి గ్రామ పంచాయతీలకు సొంత భవనాల నిర్మాణం కోసం ఒక్కొక్క పంచాయతీకి ఇరవై ఆయిదు లక్షల చొప్పున మొత్తం ఆరువందల కోట్లు ప్రభుత్వం ఇస్తుంది. గిరిజన ఆదివాసి ప్రాంతాలను విద్యుదీకరించేందుకు, వ్యవసాయం భూములకు త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యాన్ని కల్పించేందుకు 215 కోట్లతో పనులు చేపట్టింది. వీటిని రెండు మూడు నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వం. అన్నింటికీ ఈ బడ్జెట్‌లో ఎస్టీల సంక్షేమానికి 12565కోట్ల రూపాయలు ప్రతిపాదించింది ప్రభుత్వం
నేతన్నకు బీమా
రైతు బీమా మాదిరిగానే నేతన్నలకు కూడా ఐదు లక్షల రూపాయల బీమా పథకాన్ని ఈ సంవత్సరం నుంచే ప్రభుత్వం ప్రారంభించనుంది.
బీసీ సంక్షేమం కోసం వార్షిక బడ్జెట్‌లో 5698 కోట్లు రూపాయలు ప్రతిపాదించి ప్రభుత్వం.