Union Budget 2024: ఎన్డీయే 3.0 ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యం - ఏపీ, బీహార్‌కు బడ్జెట్‌లో వరాల జల్లు
Budget 2024: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఈసారి బడ్జెట్‌లో ఏపీ, బీహార్ రాష్ట్రాలకు వరాల జల్లు కురిపించారు. ఏపీ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు, బీహార్‌లో పలు ప్రాజెక్టుల కోసం రూ.26 వేల కోట్లు కేటాయించారు.
Union Budget Allocations To AP And Bihar: ఎన్డీయే 3.0 కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యంగా ఉన్న ఏపీ, బీహార్‌లకు కేంద్ర బడ్జెట్‌లో (Union Budget 2024) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) వరాల జల్లు కురిపించారు. ఏపీలో రాజధాని అమరావతికి (Amaravathi) ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే, నితీశ్ కుమార్ నేతృత్వంలోని బీహార్‌కు పలు అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రకటించారు. అయితే, బీహార్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలన్న డిమాండ్‌ను మాత్రం కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బీహార్‌లో వివిద ప్రాజెక్టుల కోసం రూ.26 వేల కోట్లు కేటాయించారు. అక్కడ ఎయిర్ పోర్టులు, విమానాశ్రయాలు, వైద్య కళాశాలలు, క్రీడా మౌలిక సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. అలాగే, జార్ఘండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల అభివృద్ధికి కూడా ప్రణాళిక రూపొందిస్తామన్నారు.
అమరావతికి రూ.15 వేల కోట్లు
కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఏపీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఈసారి బడ్జెట్‌లో వరాల జల్లు కురిపించారు. విభజన తర్వాత ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రానికి ఆర్థిక సాయం ప్రకటించి చేయూత అందించారు. రాజధాని అమరావతి (Amaravathi) అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి పూర్తిగా సాయం చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, రైతులకు పోలవరం జీవనాడి అని.. భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైనదని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వెంటనే జరిగేలా చూస్తామన్నారు.
ఆ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ
ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు నిర్మలమ్మ తెలిపారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయిస్తామన్నారు. అలాగే, విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి సహకారం అందిస్తామని అన్నారు. హైదరాబాద్ - బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి కూడా ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం చేస్తామన్నారు. అలాగే, రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని వెల్లడించారు.
బీహార్‌కు ప్రత్యేక నిధులు
- బీహార్‌లో కొత్త విమానాశ్రయాలు, వైద్య కళాశాలలు, క్రీడా మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు ఆర్థిక సాయం. పీర్ పాయింట్ వద్ద 2,400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో సహా విద్యుత్ ప్రాజెక్టులు చేపడతారు.
- గయాలో ఇండస్ట్రియల్ నోడ్ అభివృద్ధి, పాట్నా - పూర్ణియా ఎక్స్ ప్రెస్ వే, బక్సర్ - భాగల్పూర్ హైవే, బోద్‌గయా - రాజ్‌గిర్ - వైశాలి - దర్బంగా, బక్సర్‌లో గంగానదిపై రూ.26 వేల కోట్లతో వంతెనల అభివృద్ధికి సాయం చేస్తామని నిర్మలమ్మ ప్రకటించారు.
- ఆక్సిలరేటెడ్ ఇరిగేషన్ ఫండ్ ద్వారా బీహార్‌లో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తామన్నారు. అలాగే, టెంపుల్ కారిడార్లు, నలంద యూనివర్శిటీ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు.