Elon Musk Twitter: ఆఫీసు అద్దె కట్టలేక గిన్నెలు, తపేళాలు అమ్ముకుంటున్న ఎలాన్ మస్క్
సదరు బిల్డింగ్ ఓనర్లు ట్విట్టర్ సిబ్బందిని బయటకు గెంటేయకముందే, ఎంతో కొంత సర్దుబాటు చేయాలని ఎలాన్ మస్క్ ఆలోచిస్తున్నారు.
![Elon Musk Twitter: ఆఫీసు అద్దె కట్టలేక గిన్నెలు, తపేళాలు అమ్ముకుంటున్న ఎలాన్ మస్క్ Billionaire Elon Musk unable to pay rent auctions off Twitter bird, coffee machines check more details Elon Musk Twitter: ఆఫీసు అద్దె కట్టలేక గిన్నెలు, తపేళాలు అమ్ముకుంటున్న ఎలాన్ మస్క్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/19/e331c03f20ca4c9e11b34d4f05a583ea1674103295497545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Elon Musk Twitter: ట్విటర్ కొంటానని ఏ ముహూర్తాన ప్రకటించాడో గానీ.. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఐశ్వర్యవంతుడు అయిన ఎలాన్ మస్క్‌కు (Elon Musk) అప్పటి నుంచి కష్టాలు ఎక్కువయ్యాయి. ఓవైపు ట్విట్టర్ ఆదాయం పడిపోవడం, మరోవైపు టెస్లా (Tesla Inc) షేర్లు క్షీణించడం, ఇంకా రకరకాల ఇబ్బందులు ఈ బిలియనీర్‌ను అష్టదిగ్బంధం చేశాయి.
అద్దె కూడా కట్టలేని దుస్థితి
శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ప్రధాన కార్యాలయంతో (San Francisco Twitter headquarters) పాటు చాలా ప్రాంతాల్లోని ఆఫీసులకు కనీసం అద్దె కట్టలేని పరిస్థికి మస్క్ దిగజారారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సదరు బిల్డింగ్ ఓనర్లు ట్విట్టర్ సిబ్బందిని బయటకు గెంటేయకముందే, ఎంతో కొంత సర్దుబాటు చేయాలని ఎలాన్ మస్క్ ఆలోచిస్తున్నారు. ఇందుకోసం, శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయంలో ఉన్న వస్తువులను వేలానికి పెట్టాలని ఆదేశించారు. మస్క్ ఆదేశానుసారం... ఆఫీసులోని కొన్ని వస్తువులను ట్విట్టర్ అమ్మకానికి పెట్టింది. ఈ ఆన్‌లైన్ ఆక్షన్ పేజ్‌కి “Online Auction Sale Featuring Surplus Corporate Office Assets of Twitter!” అని టైటిల్ ఇచ్చింది.
హెడ్ క్వార్టర్స్‌లోని వస్తువులు వేలం
నాలుగు అడుగుల ఎత్తున్న నీలి రంగు ట్విటర్ పిట్ట ప్రతిమ, '@' ఆకారంలో ఉన్న ఒక ప్రతిమతో పాటు కాఫీ మెషీన్లు, డిజైనర్ కుర్చీలు, ఐమ్యాక్‌లు, వంట గది సామాన్లు, N95 మాస్కుల డబ్బాలు వంటి 631 రకాల వస్తువులను వేలానికి పెట్టారు. వీటిని కొనాలనుకునే వాళ్లు ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో పాల్గొనాలి. బిడ్డింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది, మొత్తం 27 గంటల పాటు కొనసాగుతుంది. ఆన్‌లైన్ వేలాన్ని హెరిటేజ్ గ్లోబల్ పార్ట్‌నర్స్ కంపెనీ నిర్వహిస్తోంది.
ఈ 631 రకాల వస్తువుల్లో, నియాన్ లైట్ వెర్షన్‌తో ఉన్న ట్విట్టర్ లోగోకు భారీ స్పందన వస్తోంది. దీని కోసం ఇప్పటి వరకు 64 బిడ్‌లు వచ్చాయి. ఇది, ప్రస్తుతం 20,500 డాలర్లు లేదా రూ. 16.70 లక్షల ధర పలుకుతోంది. సాధారణ వెర్షన్ ట్విటర్ ప్రతిమకు 55 బిడ్లు రాగా 16 వేల డాలర్లు ప్రస్తుతం అత్యధిక బిడ్‌గా నిలిచింది. '@' ఆకారంలో ఉన్న ప్రతిమకు 4 వేల డాలర్ల బిడ్ వేశారు.
అయితే.. ట్విటర్ ఆర్థిక పరిస్థితి బాగోలేక ఈ వస్తువులు అమ్ముతున్నారనడం నిజం కాదని వేలాన్ని నిర్వహిస్తున్న హెరిటేజ్ గ్లోబల్ పార్ట్‌నర్స్ వెల్లడించింది. మరి ఎందుకు వేలానికి పెట్టారన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు.
శాన్ ఫ్రాన్సిస్కోలోని హెడ్ క్వార్టర్ అద్దెను ట్విటర్ చెల్లించకపోవడంతో, ఆ బిల్డింగ్ యాజమాన్య కంపెనీ (హార్ట్‌ఫోర్డ్) ఇప్పటికే కోర్టులో కేసు పెట్టింది. ఎలాన్ మస్క్ ట్విట్టర్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అద్దె చెల్లించడం లేదని పేర్కొంది.
పడిపోయిన ఆదాయం
ఆదాయం విషయంలో ట్విట్టర్ చాలా ఇబ్బందులు పడుతోంది. ఆ కంపెనీని దారిలో పెట్టాలన్న పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు మస్క్. కానీ... క్రమంగా ట్విటర్ రెవెన్యూ తగ్గిపోతూనే ఉంది. ఇప్పుడు మరో 40% మేర పడిపోయినట్టు తేలింది. ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు ఎలాన్ మస్క్ 13 బిలియన్ డాలర్ల మేర అప్పు చేశారు. దానికి వడ్డీ మాత్రం కట్టడం లేదు. ఈ నెలాఖరులోగా వడ్డీని కట్టాల్సి ఉంది. ఈ వడ్డీ కట్టేందుకు మస్క్ టెస్లా షేర్‌లు అమ్మనున్నట్టు సమాచారం.
ఇనాక్టివ్‌గా ఉన్న యూజర్ నేమ్స్‌ని కూడా ట్విట్టర్ విక్రయించనున్నట్టు సమాచారం. ఆన్‌లైన్ వేలం ద్వారా యూజర్ నేమ్స్‌ని అమ్మేందుకు మస్క్ ప్లాన్ చేస్తున్నారంటూ కొన్ని నివేదికలు చెబుతున్నాయి. రెవెన్యూ పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటారని అంటున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)