Bajaj Finance: రెండు రోజుల్లో రూ.53,000 కోట్లు పోగొట్టిన బజాజ్ ట్విన్స్, మొసళ్ల పండుగ ఇంకా ఉందా?
2022 మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్) బజాజ్ ఫైనాన్స్ అప్‌డేట్ చేసిన గణాంకాలు స్టాక్‌ను నిలువునా ముంచాయి.
Bajaj Finance: బజాజ్ ఫైనాన్స్ షేర్ల పతనంతో ఆ కంపెనీ ఇన్వెస్టర్లకు ఇప్పుడు దిక్కు తోచడం లేదు. నిన్నటి (గురువారం) సెషన్‌లో 7.2% నష్టపోయిన షేర్లు, ఇవాళ కూడా ఆ నెగెటివ్ ట్రెండ్‌ను కొనసాగించాయి. ఇవాళ్టి (శుక్రవారం, జనవరి 06, 2023) ట్రేడ్‌లో మరో 2.6% నష్టపోయి, రూ. 5,941 వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. గత రెండు రోజుల్లోనే ఈ చేయబడిన స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 33,500 కోట్లు తగ్గింది. అంటే, రెండు రోజుల్లోనే ఈ స్టాక్ ఇన్వెస్టర్లు రూ. 33,500 కోట్ల నష్టపోయారు.
వాస్తవానికి బజాజ్ ఫైనాన్స్ ఒక మార్కెట్ డార్లింగ్ & మల్టీబ్యాగర్ స్టాక్. స్థిరమైన రాబడిని కోరుకునే దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఇష్టసఖి ఇది. ఇప్పుడు పరిస్థితి తలకిందులు కావడంతో, దాని 52 వారాల గరిష్ట స్థాయి నుంచి దాదాపు 26% తగ్గింది. అంతేకాదు, ఈ షేర్లను వదిలించుకోవాలి అనుకునే వాళ్ల సంఖ్య కూడా మార్కెట్‌లో పెరిగింది. ఇవాళ ఈ కౌంటర్‌లో ట్రేడింగ్ వాల్యూమ్స్ 1.16 రెట్లు పెరిగాయి.
కొంప ముంచిన గణాంకాలు
2022 మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్) బజాజ్ ఫైనాన్స్ అప్‌డేట్ చేసిన గణాంకాలు స్టాక్‌ను నిలువునా ముంచాయి. కంపెనీ ప్రకటించిన 'అసెట్ అండర్ మేనేజ్‌మెంట్' (AUM) లెక్క, మార్కెట్ అంచనాల కంటే తక్కువగా ఉంది. కస్టమర్ చేరికలు ఆరోగ్యవంతంగానే ఉన్నా, ఇది కూడా మార్కెట్ అంచనాల కంటే తక్కువగా రావడం స్టాక్‌లో బలహీనతకు కారణమైంది.
అలెర్ట్ అయిన బ్రోకరేజ్‌లు
ఈ అప్‌డేట్ తర్వాత, వివిధ బ్రోకరేజ్ కంపెనీలు అలెర్ట్ అయ్యాయి. సమీప కాలంలో ఈ స్టాక్ పట్ల జాగ్రత్తగా ఉండాలని పెట్టుబడిదారులకు సూచించాయి.
గ్లోబల్ బ్రోకరేజ్ CLSA ఈ స్టాక్ విలువ "అన్యాయపూరితమైన ఖరీదైనది" అని అభివర్ణించింది. అంటే, వాస్తవ ధర కన్నా అన్యాయంగా పెరిగింది అని అర్ధం. CLSA ఇచ్చిన టార్గెట్ ధర రూ. 6,000.
జెఫరీస్ రూ. 8,160 టార్గెట్‌తో స్టాక్ మీద హోల్డ్ రేటింగ్‌ను కలిగి ఉంది. కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ కూడా రూ. 5,800 లక్ష్యంతో స్టాక్‌పై సెల్ రేటింగ్ కలిగి ఉంది.
బజాజ్ ఫైనాన్స్ షేర్లను రూ. 5,600-5,700 స్థాయిల దగ్గర కొనుగోలు చేయవచ్చని, రూ. 6,300 అప్‌సైడ్ టార్గెట్, రూ. 5,300 వద్ద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చని ఆనంద్ రాఠీ సిఫార్సు చేసింది.
దీని జంట పక్షి అయిన బజాజ్ ఫిన్‌సర్వ్ (Bajaj Finserv) షేర్లు కూడా నిన్న (గురువారం) 7.2% నష్టపోయాయి. ఈ రోజు (శుక్రవారం) 3% విలువను కోల్పోయాయి. దీని విషయంలో.. రూ. 1,550 అప్‌సైడ్ టార్గెట్‌తో, రూ. 1,360-1,380 స్థాయుల దగ్గర కొనుగోలు చేయవచ్చని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. స్టాప్ లాస్‌గా రూ. 1,280 స్థాయిని సూచించారు.
గత రెండు రోజుల్లో, బజాజ్ ట్విన్స్ మార్కెట్ క్యాప్ దాదాపు రూ. 53,000 కోట్లు ఆవిరైంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.