Air India: మీ కంట్రోల్‌లో విమానం టిక్కెట్ రేట్లు - కొత్త ఫెసిలిటీ ప్రారంభించిన ఎయిర్ ఇండియా
Lock Ticket Fare Service: విమాన టిక్కెట్ రేట్లు స్థిరంగా ఉండవు. రద్దీని, డిమాండ్‌ను, సర్వీసుల అందుబాటును బట్టి మారుతుంటాయి. ప్రయాణ సమయం చాలా దగ్గరలో ఉన్నప్పుడు టిక్కెట్ ధర భారీగా పెరగొచ్చు.
Air India Lock Fare Service: టాటా గ్రూప్‌లోని విమానయా కంపెనీ 'ఎయిర్ ఇండియా', తన ప్రయాణికుల కోసం ప్రత్యేక సర్వీస్ ప్రారంభించింది. కొత్త ఫెసిలిటీని ఉపయోగించుకునే ప్రయాణికులు, విమానం టిక్కెట్ ధరలను కంట్రోల్ చేయగలరు. ఎయిర్ ఇండియా ప్రారంభించిన కొత్త సేవ పేరు 'ఫేర్ లాక్ సర్వీస్'. ఈ సర్వీస్ సాయంతో ప్రయాణీకులు 10 రోజుల పాటు ఎయిర్‌లైన్ టిక్కెట్ ఛార్జీని లాక్ చేయగలరు. దీని కోసం, ముందుస్తుగా కొంత ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
సాధారణంగా, విమాన టిక్కెట్ రేట్లు స్థిరంగా ఉండవు. రద్దీని, డిమాండ్‌ను, ప్రయాణ సమయాన్ని, సర్వీసుల అందుబాటును బట్టి మారుతుంటాయి. ప్రయాణ సమయం చాలా దగ్గరలో ఉన్నప్పుడు టిక్కెట్ ధర భారీగా పెరగొచ్చు. విమాన టిక్కెట్ రేట్లు ఇలా పెరిగిపోకుండా నియంత్రణలో ఉంచేందుకు 'ఫేర్ లాక్ సర్వీస్' ఉపయోగపడుతుంది. ప్రయాణీకులకు దీనివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది.
Plan now, pay later!
— Air India (@airindia) June 5, 2024
With Air India's Fare Lock, enjoy the convenience of securing your fare for a minimal fee starting at ₹500*/USD 10* and confirming your booking within 48 hours. Available for flights scheduled at least 10 days from the booking date.#FlyAI #AirIndia… pic.twitter.com/PNJtxuKdb1
ఫేర్ లాక్ ఫెసిలిటీతో టిక్కెట్ ఎలా బుక్ చేయాలి?
ఫేర్ లాక్ ఫెసిలిటీని ఉపయోగించుకునే ప్రయాణీకులు, ముందుగా కొంత ఫీజ్ చెల్లించాలి. ఇది తిరిగి రాని మొత్తం (Non-refundable). ఆ తర్వాత... ఎయిర్ ఇండియా వెబ్‌సైట్‌లో గానీ, మొబైల్ యాప్‌లో గానీ మేనేజ్ బుకింగ్స్ ఆప్షన్‌లోకి వెళ్లి విమానం టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. ఫేర్ లాక్ ఫెసిలిటీ కింద ఫీజ్ కట్టిన 48 గంటల లోపు టిక్కెట్ బుక్ చేసుకోవాలి, ఈ విషయం మర్చిపోవద్దు. టిక్కెట్ బుక్ చేసిన 10 రోజుల వరకు ఇక ఆ టిక్కెట్ రేటు మారదు. మీ ప్రయాణానికి 10 రోజుల ముందు ఈ పద్ధతిలో టిక్కెట్ బుక్ చేసుకుంటే, డిమాండ్‌తో సంబంధం లేకుండా అదే ఛార్జీతో మీరు ఎయిర్ జర్నీ చేయవచ్చు.
ఫేర్ లాక్ కోసం ఎంత ఛార్జీ చెల్లించాలి?
ఫేర్ లాక్ సర్వీస్‌ను ఉపయోగించుకుని దేశీయ (Domestic Flights) & అంతర్జాతీయ విమానాల్లో (International Flights) టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. డొమెస్టిక్ ఫ్లైట్‌లో టిక్కెట్ బుక్ చేసుకునేందుకు ఫేర్ లాక్ ఫెసిలిటీని ఉపయోగించుకోవాలని భావిస్తే, దానికోసం 500 రూపాయలు చెల్లించాలి. స్వల్ప దూర అంతర్జాతీయ విమాన టిక్కెట్ బుకింగ్ కోసం, ఫేర్ లాక్ ఫెసిలిటీ 850 రూపాయలు లేదా 10 డాలర్లు చెల్లించాలి. సుదూర అంతర్జాతీయ విమానాల విషయంలో 1500 రూపాయలు లేదా 18 డాలర్లు చెల్లించాలి. ఫేర్ లాక్ ఛార్జీ చెల్లించిన తర్వాత, ఒకవేళ ఏ కారణం వల్లనైనా విమానం టిక్కెట్ బుక్ చేసుకోకపోతే, విమాన సంస్థ ఫేర్ లాక్ ఛార్జీ మొత్తాన్ని తిరిగి చెల్లించదు.
మరో ఆసక్తికర కథనం: ఐటీ రిటర్న్‌లో ఈ పేపర్లు లేకపోతే HRA మినహాయింపు రిజెక్ట్ కావచ్చు!