Air India Acquisition: ఎయిర్ ఇండియాకు లాభాలు సులువేం కాదు! టాటా సన్స్ ముందు కఠిన సవాళ్లు
ఎయిర్ ఇండియాను రూ.18వేల కోట్లతో టాటాసన్స్ దానిని దక్కించుకుంది. అతి త్వరలోనే విలీనం పూర్తవుతుంది. మున్ముందు టాటాసన్స్‌కు కీలక సవాళ్లు ఎదురవ్వనున్నాయి.
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా బిడ్డింగ్ ప్రక్రియ ముగిసింది. రూ.18వేల కోట్లతో టాటాసన్స్ దానిని దక్కించుకుంది. అతి త్వరలోనే విలీనం పూర్తవుతుంది. బిడ్‌ను విజయవంతంగా వేసినా.. మున్ముందు టాటాసన్స్‌కు కీలక సవాళ్లు ఎదురవ్వనున్నాయి. నష్టాలను పూడ్చడం, విమానాలను మరమ్మతులు చేయించడం, పని సంస్కృతిని మార్చడం వంటివెన్నో చేయాల్సి ఉంది.
Also Read: రూ.1,000 లోపే స్మార్ట్ వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్లు.. అమెజాన్ సేల్‌లో అదిరే ఆఫర్లు
టాటాలే మొదలుపెట్టారు
1932లో జేఆర్‌డీ టాటా ఈ విమానయాన సంస్థను స్థాపించారు. దానికి టాటా ఎయిర్‌లైన్స్ అని పేరు పెట్టారు. 1946లో దీనిని ఎయిర్ ఇండియాగా మార్చారు. 1948లో ఐరోపాను విమానాలు నడపడంతో ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ మొదలైంది. అంతర్జాతీయ సర్వీసుల్లో ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉంది. ఇక టాటాలకు 26 శాతం ఉండగా మిగిలింది ప్రజలకు ఉండేది. 1953లో ఈ సంస్థను జాతీయం చేశారు. ప్రభుత్వమే వందశాతం వాటా దక్కించుకుంది.
Also Read: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేటులో మార్పులు చేసిన రెండు బ్యాంకులు.. వివరాలు ఇవే!
క్రమంగా నష్టాల్లోకి
కాలంతో పాటు ఎయిర్ ఇండియా మారకపోవడంతో క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. తట్టుకోలేని స్థాయికి రుణాలు చేరుకోవడంతో ప్రభుత్వం అమ్మకానికి సిద్ధమైంది. మంత్రుల కమిటీ వేసింది. 2020లో అమ్మకం ప్రక్రియ మొదలైంది. కొవిడ్ 19తో కాస్త ఆలస్యమైనా 2021, ఏప్రిల్‌లో ప్రభుత్వం బిడ్డర్లను ఆహ్వానించింది. మొత్తంగా ఎయిర్ ఇండియాకు రూ.60,074 కోట్ల అప్పు ఉండగా కొనుగోలు చేసినవారు రూ.23,286 భరించాల్సి ఉంటుంది. లాభనష్టాలను పక్కనపెడితే టాటాలు తాము స్థాపించిన సంస్థను తిరిగి దక్కించుకోవాలనే తపన పడ్డట్టు కనిపిస్తోంది. ఇది వారికెన్నో సవాళ్లు తెచ్చిపెట్టనుంది.
Also Read: టాటా చేతికి ఎయిర్ ఇండియా.. స్పైస్ జెట్‌తో పోటీ పడి దక్కించుకున్న టాటా సన్స్
జాగ్వార్‌తో నష్టాలే!
గతంతో టాటాలు జాగ్వార్ ల్యాండ్‌రోవర్‌ను దక్కించుకున్నారు. ఇండస్ట్రీ డైనమిక్స్ మారడం, నిరంతరం మార్పులు వస్తుండటంతో ప్రస్తుతం ఆ సంస్థ లాభదాయకత తక్కువగా ఉంది. బ్రెగ్జిట్, భౌగోళిక రాజకీయ పరిణామాలు, పోటీదారులు వల్ల నష్టాలు వస్తున్నాయి. టెట్లీ విషయంలోనూ ఇలాగే జరుగుతోంది! అందుకే ఇప్పుడు ఎయిర్ ఇండియాను లాభాల్లోకి తీసుకొచ్చేందుకు టాటాసన్స్ శక్తివంచన లేకుండా శ్రమించాల్సి ఉంది.
పెరగనున్న నెట్‌వర్క్
ఇప్పటికే సింగపూర్ ఎయిర్‌లైన్స్, విస్తారా కలయికతో టాటాకు జాయింట్ వెంచర్ ఉంది. ఇప్పుడు ఎయిర్ ఇండియా తోడవ్వడంతో నెట్‌వర్క్ పెరగనుంది. ఆ జాయింట్ వెంచర్ రూ.3,200 కోట్ల నష్టాల్లో ఉంది. మార్కెట్ లీడర్ ఇండిగోకు దేశీయ మార్కెట్లో 57 శాతం వాటా ఉండగా ఎయిర్ ఇండియా చేరికతో టాటా విమాన సంస్థకు 25శాతం కన్నా తక్కువే ఉంది. ఇండిగో 257 విమానాలతో పోలిస్తే టాటాలకు ఇప్పుడు 227 ఎయిర్‌క్రాఫ్ట్‌ల సామర్థ్యం ఉంది. విస్తారాకు న్యారోబాడీ ఎయిర్‌బస్ ఏ320 ఉండగా ఎయిర్ ఇండియాకు లాంగ్‌రేజ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఉంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
ఖర్చెక్కువ..!
ఇక విమానాల మరమ్మతులకు టాటాసన్స్ కనీసం 2-5 మిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని ఎయిర్ ఇండియా మాజీ సీఎఫ్‌వో వెంకట్ అంచనా వేశారు. మరీ ముఖ్యంగా ఎయిర్ ఇండియా పని సంస్కృతిని మార్చడం అత్యంత సవాలని పేర్కొన్నారు. తక్కువగా సానుకూలత, ఎక్కువగా ప్రతికూలత ఉందని అంటున్నారు. ఎక్కువ డబ్బు ఖర్చు చేయడమే కాకుండా నిపుణులను నియమించుకోవాల్సి అవసరం ఉందన్నారు. వయసు మీదపడ్డ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేయడం వల్ల ఒరిగేదేం లేదని విస్తారా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కూడా అన్నట్టు తెలిసింది. పైగా కొవిడ్-19తో ఎదురవుతున్న నష్టాలను నొక్కి చెబుతున్నారు.