Adani-Hindenburg Case: అదానీ గ్రూప్-హిండెన్ గ్రూప్ కేసు విచారణ - కీలకాంశాలపై సుప్రీంకోర్టు ఆరా
భారతీయ పెట్టుబడిదార్లకు రక్షణ ఎలా కల్పించాలని మార్కెట్ రెగ్యులేటర్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
Adani-Hindenburg Case: అదానీ గ్రూప్ మీద హిండెన్‌బర్గ్ నివేదిక ఇచ్చిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో అదానీ గ్రూప్ స్టాక్స్ (Adani Group Stocks) సహా మొత్తం స్టాక్ మార్కెట్‌లో లక్షల కోట్లు రూపాయల సంపద ఆవిరి కావడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. భారత మదుపర్ల సొమ్మును రక్షించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.
అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) రిలీజ్ చేసిన నివేదికపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ఒక విచారణ కమిటీని వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం విచారణ జరిపింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ (Chief Justice D Y Chandrachud) నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఎదుట ఈ కేసులో విచారణ జరిగింది. న్యాయవాదులు విశాల్ తివారీ, ఎంఎల్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ల మీద న్యాయమూర్తులు విచారణ జరిపారు.
అదానీ గ్రూప్ వివాదంపై పని చేస్తున్నాం: సెబీ
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, మార్కెట్ రెగ్యులేటర్ "ఈ విషయం పైన పని చేస్తోందని" సుప్రీంకోర్టుకు తెలిపారు.
పెట్టుబడిదార్లకు రక్షణ ఎలా కల్పించాలి?
అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత పెట్టుబడిదారులు "లక్షల కోట్లు" నష్టపోయిన నేపథ్యంలో, భారతీయ పెట్టుబడిదార్లకు రక్షణ ఎలా కల్పించాలని మార్కెట్ రెగ్యులేటర్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అదానీ గ్రూప్‌పై US షార్ట్ సెల్లర్ నివేదిక తర్వాత పెట్టుబడిదారులు నష్టపోయారని చెప్పిన అత్యున్నత న్యాయస్థానం, పెట్టుబడిదార్లను రక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ప్రస్తుతం ఉన్న ఈక్విటీ ఇన్వెస్టింగ్ విధానాన్ని పటిష్టం చేయడానికి ఏమి చేయాలనే అంశంపై సూచనలతో సోమవారం జరిగే విచారణకు తిరిగి రావాలని సొలిసిటర్ జనరల్‌కు సుప్రీంకోర్టు సూచించింది.
సెబీకి సుప్రీంకోర్టు చేసిన సూచనలేంటి?
"లోపాలు ఏంటో మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. వాటిని సరిచేయడానికి ఏం చర్యలు చేపట్టవచ్చో మాకు చెప్పండి" అని కోర్టు సెబీకి తెలిపింది. "స్టాక్ మార్కెట్ అధిక విలువ కలిగిన (high value investors) పెట్టుబడిదార్లు మాత్రమే పెట్టుబడి పెట్టే ప్రదేశం కాదు. మారుతున్న పన్ను విధానాలతో చాలా మంది పెట్టుబడులు పెడతారు. మీరు ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక నిపుణులతో కూడా మాట్లాడవచ్చు" అని సెబీకి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.
ప్రస్తుత నియంత్రణను ఎలా పటిష్టం చేస్తారని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ సెబీని ప్రశ్నించారు.
రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో బ్యాంకింగ్, పెట్టుబడులకు చెందిన నిపుణులతో కూడిన ఒక విచారణ కమిటీ నియామకం కోసం కలిగి ఆలోచించవచ్చా?, దీని మీద మేం తీవ్రంగా ఆలోచిస్తున్నాం, ఈ విషయం మీద సొలిసిటర్ జనరల్ సూచనలు చేయవచ్చు” అని CJI చంద్రచూడ్ అన్నారు.
US షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్, అదానీ గ్రూప్ మీద ఆరోపణలు చేస్తూ 2023 జనవరి 24న ఒక నివేదిక విడుదల చేసిన తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. చాలా గ్లోబల్ రేటింగ్ కంపెనీలు కూడా హిండెన్‌బర్గ్ నివేదికను సీరియస్‌గా తీసుకుని, అదానీ కంపెనీలు, సెక్యూరిటీల రేటింగ్స్ తగ్గించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, కేవలం 9 ట్రేడింగ్ రోజుల్లోనే దాదాపు 110 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయాయి. మొత్తం స్టాక్ మార్కెట్ మీద ఈ ప్రభావం పడి, స్టాక్ మార్కెట్‌లోని మదుపుదార్లంతా లక్షల కోట్ల రూపాయలు కోల్పోయారు.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక తప్పుల తడకని, దురుద్దేశ పూర్వకంగానే ఇచ్చినట్టు నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం, అమెరికాకు చెందిన అత్యంత శక్తిమంతమైన న్యాయసంస్థ వాచ్‌టెల్‌ను అదానీ గ్రూప్ సంప్రదించినట్లు సమాచారం. ఈ మేరకు ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్టు చేసింది.