Adani Stocks: అదానీ షేర్లపై హిండెన్‌బర్గ్ రిపోర్ట్స్ ఎఫెక్ట్.. రూ.1.29 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
Adani Group: ఉదయం మార్కెట్లు ప్రారంభం తర్వాత మెుదటి గంటలోనే అదానీ లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు కలిగి ఉన్న ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ1.29 లక్షల కోట్లు ఆవిరైంది.
Adani Stocks: 2023 జనవరిలో హిండెన్ బర్గ్ భారత బిలియనీర్ గౌతమ్ అదానీ కంపెనీల్లో భారీ అక్రమాలు జరిగాయని నివేదికను విడుదల చేసి పెద్ద సంచలనానికి తెరలేపింది. అయితే తర్వాత ఆ వ్యవహారంలో సెబీ నుంచి క్లీన్ చిట్ రావటంతో సుప్రీం కోర్టు దాకా వెళ్లిన వ్యవహారం కుదుటపడింది. ఆ సమయంలో అదానీ గ్రూప్ దేశంలోనే అతిపెద్ద ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.20,000 కోట్లను సమీకరించింది. అయితే ఆరోపణల నేపథ్యంలో ఆ మెుత్తాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేయాలని గౌతమ్ అదానీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
అయితే ఇది జరిగిన దాదాపు 18 నెలల తర్వాత బిలియనీర్ గౌతమ్ అదానీ స్టాక్స్ నేడు ఇంట్రాడేలో మళ్లీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభం తర్వాత మెుదటి గంటలోనే అదానీ లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు కలిగి ఉన్న ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ1.29 లక్షల కోట్లు ఆవిరైంది. ఈ క్రమంలో అన్ని అదానీ స్టాక్స్ ఫ్రీ ఫాల్ చూశాయి. దీంతో అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు 2 శాతం నుంచి అత్యధికంగా 17 శాతం వరకు పతనాన్ని నమోదు చేశాయి. అదానీ ఫ్లాట్ షిప్ కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈలో టాప్ లూజర్లలో అగ్ర స్థానంలో నిలిచాయి. అదానీకి వ్యతిరేకంగా హిండెన్‌బర్గ్ తాజా వాదనలు, మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చీఫ్‌పై కూడా ఆరోపణలు చేయడం భయాందోళనలకు కారణమని చెప్పవచ్చు.
నేడు మార్కెట్లో అదానీ స్టాక్స్ పతన పరంపరను గమనిస్తే.. అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ 5.44%, అదానీ పోర్ట్స్ షేర్ 5%, అదానీ గ్రీన్ స్టాక్ 10.95%, అదానీ పవర్ 6.97% పతనాన్ని ఇంట్రాడేలో చూశాయి. పైగా ఈ నాలుగు కంపెనీలు మార్కెట్ వాటా పరంగా అదానీ గ్రూప్ లో అత్యంత విలువైనవి. ఇదే క్రమంలో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 17.06%, అదానీ టోటల్ గ్యాస్ 13.4% క్షీణతను నేడు చూశాయి. ఇక అదానీ విల్మార్ దాదాపు 6.5% పతనాన్ని చూసింది. అలాగే అదానీకి చెందిన సిమెంట్ స్టాక్స్, మీడియా స్టాక్స్ కూడా స్వల్ప నష్టాలను చూశాయి.
కంపెనీల మార్కెట్ క్యాప్ గమనిస్తే.. అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ.19,726.9 కోట్ల మేర క్షీణించగా, అదానీ పవర్ అత్యధికంగా రూ.29,329.7 కోట్లకు మార్కెట్ పడిపోయింది. అలాగే అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ మార్కెట్ విలువ రూ.22,627.29 కోట్లకు పడిపోయింది. ఇలా వివిధ కంపెనీల్లో నెలకొన్న పతనం తర్వాత మెుత్తం గ్రూప్ కంపెనీల విలువ తగ్గిన తర్వాత రూ.16 లక్షల కోట్ల వద్దకు చేరుకుంది.