Adani Enterprises FPO: సర్‌ప్రైజ్! అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో $ 400 మిలియన్లు పెట్టుబడికి అబుదాబి కంపెనీ రెడీ!
Adani Enterprises FPO: అదానీ ఎంటర్ ప్రైజెస్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO)లో పాల్గొంటామని అబుదాబి కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ కంపెనీ (IHC) తెలిపింది.
Adani Enterprises FPO:
అదానీ ఎంటర్ ప్రైజెస్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO)లో పాల్గొంటామని అబుదాబి కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ కంపెనీ (IHC) తెలిపింది. ఎఫ్ఈవోలో 400 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడి పెడతామని ప్రకటించింది. తమ సబ్సిడరీ కంపెనీ గ్రీన్ ట్రాన్స్‌మిషన్ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్ ఆర్‌ఎస్‌సీ లిమిటెడ్ ద్వారా దీనిని చేపడతామని వెల్లడించింది.
'అదానీ ఎంటర్ ప్రైజెస్ ఫండమెంటల్స్‌పై మాకు విశ్వాసం ఉంది. అదానీ గ్రూప్‌పై ఆసక్తి కలగడానికి ఇదే కారణం. దీర్ఘకాల దృక్పథంతో గమనిస్తే కంపెనీ వృద్ధికి ఎంతో ఆస్కారం ఉంది. ఇది మా వాటాదారుల విలువను పెంచుతుంది' అని ఐహెచ్‌సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సయ్యద్ బసర్ షుయెబ్ అన్నారు.
2.5 బిలియన్ డాలర్ల విలువైన అదానీ ఎఫ్‌పీవోలో ఐహెచ్‌సీ పెట్టుబడి 16 శాతంగా ఉంది. 'మేం పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ ఆదాయ నివేదిక, యాజమాన్యం, వ్యాపారం తీరు వంటి విస్తృతమైన సమాచారాన్ని మేం శోధించాం. ఈ ఎఫ్‌పీవోను ఒక చారిత్రక రిఫరెన్స్‌ను తీసుకున్నాం' అని సయ్యద్ వెల్లడించారు.
అమెరికా షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ కంపెనీల షేర్లు పతనమవుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల డబ్బు ఆవిరవుతున్న తరుణంలో ఐహెచ్‌సీ పెట్టుబడులు పెడతామంటూ ముందుకు రావడం అందరినీ ఆశ్చర్యగానికి గురి చేసింది. సోమవారానికి ఎఫ్‌ఈవోను కేవలం 3 శాతం మందే సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. మొత్తం ఇష్యూ పరిమాణం 4,55,06,791 షేర్లు కాగా ఇప్పటి వరకు 13,98,516 షేర్లకే బిడ్లు వచ్చాయి.
రూ.5 లక్షల కోట్లు కోల్పోయిన అదానీ స్టాక్స్
ఈ 3 రోజుల్లో, అదానీ గ్రూప్ స్టాక్స్ (Adani Group stocks) తమ మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రూ. 5 లక్షల కోట్లను లేదా మొత్తం విలువలో నాలుగింట ఒక వంతును కోల్పోయాయి. ఇవాళ.. అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy), అదానీ ట్రాన్స్‌మిషన్ (Adani Transmission) కొత్త 52 వారాల కనిష్ట స్థాయిలను తాకాయి, 20% వరకు తగ్గాయి. ఎక్కువ అదానీ స్టాక్స్‌లో షార్ట్ సెల్లర్స్ చెలరేగిపోతున్నారు.
అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) బయట పెట్టిన నివేదికలో 32,000 పదాలు ఉన్నాయి. ఈ రిపోర్ట్ బయటకు వచ్చిన కేవలం మూడు వరుస ట్రేడింగ్ రోజుల్లోనే (బుధవారం, శుక్రవారం, సోమవారం) దలాల్ స్ట్రీట్ దారుణంగా నష్టపోయింది. ఇన్వెస్టర్లను రూ. 13.8 లక్షల కోట్ల మేర కోల్పోయారు. బ్యాంకు స్టాక్స్ (bank stocks) చాలా ఘోరంగా దెబ్బతిన్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.