Tata Steel Layoffs: 2500 మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైన టాటా స్టీల్, తొలగింపు తప్పదన్న సీఈఓ
Job Cuts : యూకేలోని టాటా స్టీల్ ఉత్పత్తి ప్లాంట్‌లో పని చేస్తున్న సుమారు 2500 మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ నిర్ణయించింది. ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా కంపెనీ ఉద్యోగులను తీసేస్తోంది.
Tata Steel Layoffs: ఇటీవల కాలంలో ప్రముఖ కంపెనీలన్నీ ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మన దేశానికి చెందిన దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్ కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులను తీసేసేందుకు పూనుకుంది. టాటా స్టీల్ కంపెనీ పలు దేశాల్లో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. యూకేలోని వేల్స్ లో ఉన్న తమ స్టీల్ ఉత్పత్తి ప్లాంట్‌లో పని చేస్తున్న సుమారు 2500 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది.
ఉద్యోగుల తొలగింపు అనివార్యం
టాటా స్టీల్ యూకే ఆపరేషన్‌లో 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కంపెనీలో దాదాపు 2500 మంది ఉద్యోగుల తొలగింపును నివారించలేమని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) టీవీ నరేంద్రన్ చెప్పారు. ఉద్యోగాలు పోతాయనే భయంతో వర్కర్స్ యూనియన్‌లు కంపెనీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నాయి. భారతదేశానికి చెందిన టాటా స్టీల్ సౌత్ వేల్స్‌లోని పోర్ట్ టాల్బోట్‌లో సంవత్సరానికి మూడు మిలియన్ టన్నుల సామర్థ్యంతో యూకేలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌ను కలిగి ఉంది. కంపెనీ అక్కడ తన కార్యకలాపాలన్నింటిలో దాదాపు 8000 మంది ఉద్యోగులను కలిగి ఉంది.
కర్బన ఉద్గారాలను తగ్గించాలని యోచన
కంపెనీ కార్బన్-రిడక్షన్ ప్లాన్‌లో భాగంగా కంపెనీ బ్లాస్ట్ ఫర్నేస్ (BF) మార్గం నుండి తక్కువ ఉద్గారాల ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ (EAF) ప్రక్రియకు మారుతోంది. బ్లాస్ట్ ఫర్నేస్ జీవిత చక్రం ముగింపు దశకు చేరుకుంది. వీటి వినియోగంతో ఉత్పాదకత పెరగడంతో పాటు కర్బన ఉద్గారాల విడుదల కూడా తగ్గుతుందని కంపెనీ సీఈఓ నరేంద్రన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కోతలు తప్పవని స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ కి మారడం వల్ల ప్రతి సంవత్సరం 5 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ (Co2)ను తగ్గించడంలో కూడా సహాయపడుతుందన్నారు.
భారీగా పెట్టుబడులు
టాటా స్టీల్, బ్రిటిష్ ప్రభుత్వం యూకేలోని పోర్ట్ టాల్బోట్‌లోని ఉక్కు తయారీ కేంద్రం వద్ద కార్బన్ ఉద్గార తగ్గింపు ప్రణాళికలను అమలు చేయడానికి ఒప్పందం కుదిరింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇందుకోసం 1.25 బిలియన్ పౌండ్లు ఉమ్మడి పెట్టుబడిని అంగీకరించాయి. ఇందులో 500 మిలియన్ పౌండ్లు బ్రిటిష్ ప్రభుత్వం అందించింది.
కంపెనీ సీఈవో నరేంద్రన్ మాట్లాడుతూ.. మార్చిలో కోక్ ఓవెన్‌లు ఇప్పటికే మూసివేశాం. ఒక బ్లాస్ట్ ఫర్నేస్ ఆపరేషన్ పరంగా ఇబ్బంది పడుతున్నందున జూన్‌లో మూతపడనుంది. మరొక బ్లాస్ట్ ఫర్నేస్ ఆర్థిక నష్ట కారణాల వల్ల సెప్టెంబర్‌లో మూతపడనుంది. వచ్చే మూడేళ్లలో బ్రిటన్‌లోని ప్లాంట్లలో డీకార్బనైజేషన్ జర్నీని పూర్తి చేయాలని టాటా స్టీల్ లక్ష్యంగా పెట్టుకుందని సీఈఓ చెప్పారు.
యూకే లో స్టీల్ స్క్రాప్ అధికం
యూకేలో స్టీల్ స్క్రాప్ అత్యధికంగా ఉత్పత్తి అవుతుందని కంపెనీ పేర్కొంది. ఈ స్క్రాప్ నుంచి నాణ్యమైన స్టీల్ ను ఉత్పత్తి చేసి, యూకే వినియోగదారులకు అందించాలన్న తామే యోచనలో ఉన్నట్టు కంపెనీ పేర్కొంది. దీంతో, ఇమును, బొగ్గు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని తెలిపింది.