Cine Workers: షూటింగ్స్‌కు లైన్ క్లియర్ - సినీ కార్మికుల వేతనాల పెంపునకు ఓకే... కండిషన్స్ ఇవే!
Tollywood: ఫిలిం చాంబర్, ఫెడరేషన్ నాయకుల మధ్య వివాదం ఎట్టకేలకు ముగిసింది. కార్మిక శాఖ సమక్షంలో చర్చలు సఫలం కాగా... సినీ కార్మికుల వేతనాల పెంపునకు నిర్మాతలు ఓకే చెప్పారు.

Tollywood Producers Agreed To Hike Wages Of Cine Workers: దాదాపు 18 రోజుల నిరీక్షణకు తెరపడింది. ఇండస్ట్రీలో షూటింగ్స్‌కు లైన్ క్లియర్ అయ్యింది. టాలీవుడ్ ఫిలిం ఫెడరేషన్ యూనియన్స్, ఫిలిం చాంబర్ మధ్య చర్చలు ఎట్టకేలకు సఫలమయ్యాయి. సుదీర్ఘ చర్చల తర్వాత సినీ కార్మికుల వేతనాల పెంపునకు అంగీకారం కుదిరింది. ఈ మేరకు నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులు ప్రెస్ మీట్‌లో వివరాలు వెల్లడించారు.
4 కండిషన్లతో వేతనాల పెంపు
ఫెడరేషన్ నాయకులు, ఫిలిం చాంబర్ సభ్యుల మధ్య గత కొంతకాలంగా వేతనాల పెంపు అంశంపై వివాదం కొనసాగుతూనే ఉంది. పలుమార్లు చర్చలు జరిగినా ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కార్మిక శాఖతో పాటు అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో కార్మిక శాఖ సమక్షంలో యూనియన్ నాయకులు, నిర్మాతలు చర్చలు జరిపారు. 4 కండిషన్లతో వేతనాల పెంపునకు ఓకే చెప్పారు.
- సినీ కార్మికులకు 22.5 శాతం వేతనాల పెంపునకు ప్రొడ్యూసర్స్ అంగీకారం తెలిపారు.
- రూ.2 వేల లోపు వేతనాలు ఉన్న వారికి ఫస్ట్ ఇయర్ 15 శాతం, రెండో ఏడాది 2.5 శాతం, మూడో ఏడాది 5 శాతం వేతనాలు పెంచనున్నారు.
- రూ.2 వేల నుంచి రూ.5 వేల వేతనం ఉన్న వారికి తొలి ఏడాది 7.5 శాతం, రెండో ఏడాది 5 శాతం, మూడో ఏడాది 5 శాతం పెంచనున్నారు. ఈ మేరకు కార్మికులు, ప్రొడ్యూసర్స్ మధ్య ఒప్పందం కుదిరినట్లు కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ గంగాధర్ తెలిపారు.
సీఎంకు దిల్ రాజు కృతజ్ఞతలు
గత 18 రోజుల నుంచి షూటింగ్స్ ఆగాయని... ఫెడరేషన్, నిర్మాతల మధ్య ఉన్న సమస్యలకు సీఎం రేవంత్ రెడ్డి చొరవతో పరిష్కారం లభించిందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ఈ చర్చల ద్వారా నిర్మాతల ఇబ్బందులను ఫెడరేషన్ వాళ్లు, ఫెడరేషన్ సమస్యలను నిర్మాతలు అర్థం చేసుకున్నారని చెప్పారు. ఇక షూటింగ్స్ ఆగవని... సమ్మెకు తెర పడినట్లేనని స్పష్టం చేశారు.
శుక్రవారం నుంచి సినీ కార్మికులు షూటింగ్స్‌కు హాజరవుతారని ఫెడరేషన్ నాయకులు తెలిపారు. పర్సంటేజీ విషయంలో బాధగా ఉన్నా సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం తప్పట్లేదని అన్నారు. సినీ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తోన్న సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read: ఇప్పటి హీరోలు ఇండివిడ్యువాలిటీ కోరుకుంటున్నారు..మెగాస్టార్ లా ఆలోచిస్తే ఫ్యాన్ వార్స్ ఉండవేమో!
అసలేం జరిగిందంటే?
తమకు 30 శాతం వేతనాలు పెంచాలని కోరుతూ సినీ కార్మికులు ఈ నెల 4 నుంచి సమ్మెకు దిగారు. ఈ అంశంపై పలు ధపాలుగా చర్చలు జరిగినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఇండస్ట్రీ పెద్దలు దీనిపై మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలకృష్ణలను కూడా కలిశారు. చిరంజీవి నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులతో కలిసి వేర్వేరుగా చర్చలు జరిపారు. చివరకు సీఎం చొరవతో కార్మిక శాఖ వద్ద ఫెడరేషన్ నాయకులు, ప్రొడ్యూసర్స్ మధ్య చర్చలు జరగ్గా కొన్ని షరతులతో వేతనాల పెంపునకు ఓకే చెప్పడంతో వివాదం ముగిసింది. అటు, మెగాస్టార్ చిరంజీవి సమస్య పరిష్కారానికి కృషి చేసినందుకు సీఎం రేవంత్‌కు ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఇరు వర్గాలకు సమన్యాయం చేశారని అన్నారు.





















