US Banks: మూడు బ్యాంకుల దెబ్బకే ఇలా.. సేమ్ సీన్‌లో మరో 186 బ్యాంకులు
వడ్డీ రేట్లు పెరగడం, బీమా చేయని డిపాజిట్లు అధికంగా ఉండడం ఇందుకు ప్రధాన కారణాలని ఆ నివేదిక పేర్కొంది.
US Banks: అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (Silicon Valley Bank), సిగ్నేచర్ బ్యాంక్ (Signature Bank) & సింగపూర్‌లో క్రెడిట్ సూయిస్ బ్యాంక్ (Credit Suisse Bank) పతనం దెబ్బకు ప్రపంచ స్టాక్ మార్కెట్ల మైండ్ బ్లాంక్ అయింది. హైడ్‌లైన్ సూచీలు నేలను కరుచుకున్నాయి, ఇన్వెస్టర్ల బీపీలు పెరిగాయి. కేవలం 3 బ్యాంకుల దెబ్బకే ఇంతలా భయపడితే... మరి సేమ్ అలాంటి పరిస్థితిలోనే మరో 186 బ్యాంకులు ఉన్నాయట. ఈ లెక్క కూడా ఒక్క అమెరికాది మాత్రమే.
కుప్పకూలే స్థితిలో 186 బ్యాంకులు
మొత్తం 186 అమెరికన్ బ్యాంకులు పతనానికి చేరువలో ఉన్నాయని, మూతబడే పరిస్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉందని కొత్త అధ్యయనంలో తెలిసింది. వడ్డీ రేట్లు పెరగడం, బీమా చేయని డిపాజిట్లు అధికంగా ఉండడం ఇందుకు ప్రధాన కారణాలని ఆ నివేదిక పేర్కొంది.
సోషల్ సైన్స్ రీసెర్చ్ నెట్‌వర్క్ (The Social Science Research Network) ఈ రీసెర్చ్ చేసింది. ఈ బ్యాంకుల్లో ఇన్సూరెన్స్ లేని డిపాజిట్‌దార్లలో కేవలం సగం మంది వాళ్ల డబ్బు వెనక్కు తీసుకున్నా, బ్యాంకులు కుప్పకూలతాయని ఆ సంస్థ హెచ్చరించింది.
"ఇన్సూరెన్స్ చేయని డిపాజిటర్లలో సగం మంది మాత్రమే విత్‌డ్రా కోసం వచ్చినా, దాదాపు 190 బ్యాంకుల్లో, ఇన్సూరెన్స్ ఉన్న డిపాజిటర్లకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. $300 బిలియన్ల బీమా చేసిన డిపాజిట్లు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి" - సోషల్ సైన్స్ రీసెర్చ్ నెట్‌వర్క్
బీమా లేని డిపాజిట్ విత్‌డ్రాల వల్ల చిన్న అగ్గి పుట్టినా, అతి చాలా బ్యాంకులను కార్చిచ్చులా చుట్టుముడుతుందని, డిపాజిట్లు వెనక్కు తీసుకోవడానికి ఖాతాదార్లు పోటెత్తుతారని స్టడీ సూచించింది.
వడ్డీ రేట్ల పెంపే సంక్షోభానికి కారణం
అధ్యయనంలో భాగమైన బ్యాంకుల ప్రధాన రిస్క్ ఏంటంటే... డిపాజిట్లలో ఎక్కువ భాగాన్ని ప్రభుత్వ బాండ్‌లు, తనఖా ఆధారిత సెక్యూరిటీల్లోకి బ్యాంక్‌లు మళ్లించాయి. ఇవి వడ్డీ రేట్లతో ముడిపడి ఉంటాయి. ఫెడరల్ రిజర్వ్ ఇటీవల వడ్డీ రేట్లను పెంచడంతో ఆ ఆస్తుల విలువ పడిపోయింది.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB) కూడా సరిగ్గా ఇదే రీజన్ వల్ల కుప్పకూలింది. ఈ బ్యాంక్ తన డిపాజిట్లలో ఎక్కువ భాగాన్ని దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడిగా పెట్టింది, పెరుగుతున్న వడ్డీ రేట్లకు బలైపోయింది. ప్రస్తుత వడ్డీ రేటు కంటే తక్కువ వడ్డీ రేట్ల వద్ద ప్రభుత్వ బాండ్‌లను సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కొనుగోలు చేసింది. ప్రస్తుత వడ్డీ రేట్లతో పోలిస్తే ఆ బాండ్లు ఇప్పుడు అంత విలువైనవి కావు. కస్టమర్లు విత్‌డ్రాల కోసం వచ్చేసరికి, చెల్లించాల్సిన డబ్బు కోసం ఆ బాండ్లలో కొన్నింటిని దాదాపు 2 బిలియన్ డాలర్ల నష్టానికి విక్రయించింది. ఈ నష్టాలు బ్యాంక్ కస్టమర్లలో భయాన్ని రేకెత్తించాయి. ఈ బ్యాంక్ ఖాతాదార్లలో ఎక్కువ భాగం టెక్ స్టార్ట్-అప్ కంపెనీలు. బ్యాంకులో డబ్బును ఉంచి రిస్క్ తీసుకోలేక, ఆ సంస్థలు తమ డబ్బును ఉపసంహరించుకున్నాయి.
SVB మరీ అంత చెత్త బ్యాంక్ కాదని, దాదాపు 10% బ్యాంకులు SVB కంటే తక్కువ నిధులతో రన్ అవుతున్నాయని నివేదిక పేర్కొంది. కాకపోతే, SVBలో ఉన్న డిపాజిట్లలో ఎక్కువ భాగానికి బీమా లేదు. అందువల్లే మూసివేత పరిస్థితిని ఎదుర్కొంది.
ఇప్పుడు, గట్టెక్కే అవకాశం లేకపోతే ఈ 186 బ్యాంకులకు కూడా కుప్పకూలే ప్రమాదం ఎక్కువగా ఉందని సోషల్ సైన్స్ రీసెర్చ్ నెట్‌వర్క్ నివేదిక హెచ్చరించింది.