Tata Nano EV: 250 km రేంజ్ ఇచ్చే టాటా నానో EV లాంచింగ్ ఎప్పుడు, ధర ఎంత?
Tata Nano Electric Car: ప్రస్తుతం, టాటా నానో ఎలక్ట్రిక్ కారు లాంచింగ్ తేదీ, రేంజ్, ధర, ప్రత్యేకతల గురించి సోషల్ మీడియాలో చాలా పుకార్లు తిరుగుతున్నాయి.

Tata Nano EV Range, Price, Specifications: మన దేశంలో టాటా మోటార్స్ కార్లకు ప్రత్యేక క్రేజ్ ఉంది, ఓ అభిమాన వర్గం ఉంది. దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా, అత్యంత సామాన్య ప్రజల సొంత కారు కలను తీర్చేందుకు గతంలో టాటా నానోను లాంచ్ చేశారు. టాటా నానో పేరు విననివాళ్లు మన దేశంలో ఉండకపోవచ్చు. ప్రస్తుతం, టాటా నానో ఉత్పత్తి లేనప్పటికీ, పాత నానో మోడల్స్ ఇప్పటికీ రోడ్లపై కనిపిస్తున్నాయి.
రతన్ టాటా ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటైన టాటా నానో కారును, ఆయన జ్ఞాపకార్ధం మళ్లీ లాంచ్ చేయవచ్చన్న పుకార్లు ఇటీవలి కాలంలో చాలా వినిపించాయి. టాటా మోటార్స్, నానో కారును ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదల చేయవచ్చని చాలా మంది చెప్పుకుంటున్నారు. ఇది వాస్తవ రూపం దాలిస్తే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని భావిస్తున్నారు. అయితే, టాటా మోటార్స్ ఆ వదంతులను అధికారికంగా ధృవీకరించలేదు & ఎటువంటి లాంచ్ తేదీని ప్రకటించలేదు.
టాటా నానో EV ప్రత్యేకతలు (Tata Nano EV Specifications)
టాటా నానో EV గురించి టాటా మోటార్స్ ధృవీకరించనప్పటికీ, రిపోర్ట్స్‌ను బట్టి చూస్తే, టాటా నానో ఎలక్ట్రిక్ 7-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో లేదా ఆపిల్ కార్‌ప్లేను సపోర్ట్ చేస్తుంది. ఇష్టమైన పాటలు వింటూ కారులో షికారు చేయడానికి ఈ EVలో 6-స్పీకర్ల సౌండ్ సిస్టమ్ కూడా ఉండవచ్చు, ఇది బ్లూటూత్ & ఇంటర్నెట్ కనెక్టివిటీతో పని చేస్తుంది.
టాటా నానో EV భద్రత (Safety Features In Tata Nano EV)
టాటా నానో అంటేనే చిన్న వెహికల్. కాబట్టి, దీనిలో ప్రయాణించే వాళ్ల భద్రత గురించి ఆందోళనలు, ప్రశ్నలు ఉంటాయి. రిపోర్ట్స్‌ను బట్టి, టాటా నానోలో భద్రతపరంగా అధునాతన ఫీచర్లు ఉంటాయి. ABS, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్/ ఎలక్ట్రిక్ విండోస్, యాంటీ-రోల్ బార్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లను ఇందులో చూడవచ్చు. ఇంకా.. రిమోట్ ఫంక్షనాలిటీ & డెమో మోడ్‌ను కూడా ఇందులో చేర్చే అవకాశం ఉంది. వెహికల్ రేంజ్ & ఇతర ముఖ్యమైన సమాచారాన్ని చూపించే మల్టీ-ఇన్‌ఫర్మేషన్ డిస్‌ప్లేను కూడా టాటా నానో EVలో అందించవచ్చు.
టాటా నానో EV పరిధి & ధర (Tata Nano EV Range & Price)
రిపోర్ట్స్ ప్రకారం, టాటా నానో ఎలక్ట్రిక్ వెహికల్‌ను పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు 250 కి.మీ. దూరం కవర్ చేయగలదని భావిస్తున్నారు. దీనివల్ల, నగరాలు లేదా పట్టణాల పరిధిలో తిరగడానికి, దగ్గరి దూరాలకు ప్రయాణించడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. ధర విషయానికి వస్తే.. టాటా నానో ఎలక్ట్రిక్ ధర రూ. 5 నుంచి 6 లక్షల మధ్య ఉండవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. బడ్జెట్-ఫ్రెండ్లీ రేంజ్ కారణంగా ఈ ఎలక్ట్రిక్ కార్ కోసం మధ్య తరగతి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు, తక్కువ కాలంలోనే ఈ కారు బాగా ప్రాచుర్యం పొందవచ్చు.
టాటా నానో EV లాంచ్ డేట్ (Tata Nano EV Launch Date)
టాటా నానో ఎలక్ట్రిక్ లాంచ్ గురించి టాటా మోటార్స్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, అతి త్వరలోనే ఈ వెహికల్ లాంచ్ అవుతుందని సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి, రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. నిజంగానే టాటా నానో ఎలక్ట్రిక్ లాంచ్ అయితే, అది భారతీయ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో పెను మార్పు తీసుకువచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అందరూ కంపెనీ నుంచి అధికారిక నిర్ధరణ కోసం ఎదురు చూస్తున్నారు.





















