విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా రెడీ అవుతున్నాయ్ - ఈ ఏడాదిలోనే లాంచింగ్ ప్లాన్
వియత్నాం ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ 'విన్‌ఫాస్ట్', ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది రెండో అర్ధభాగంలో లాంచింగ్ ప్లాన్‌లో ఉంది.

Vinfast Electric Scooter India: ఇప్పటి వరకు, విన్‌ఫాస్ట్ అంటే ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లు అనే మనకు తెలుసు. కానీ, ఇకపై ఆ ఇమేజ్ పూర్తిగా మారబోతోంది. వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ ఇండియా, టూ వీలర్ మార్కెట్‌లోకి కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇండియా అవసరాలకు తగ్గట్టుగా రూపొందించిన ఎలక్ట్రిక్ స్కూటర్లను 2026 రెండో అర్ధభాగంలో లాంచ్ చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.
మన అవసరాలు, రోడ్లకు సరిపోయే స్కూటర్లు
విన్‌ఫాస్ట్ ఆసియా CEO ఫామ్ సాన్ చౌ తాజాగా ఇచ్చిన సమాచారం ప్రకారం, ఇండియాలో లాంచ్ చేయనున్న స్కూటర్లు గ్లోబల్ మోడళ్లకు కాపీలు కావు. ఇండియా రోడ్లు, రోజువారీ ప్రయాణ దూరాలు, ఛార్జింగ్ మౌలిక వసతులు, ధరపై ఉన్న సెన్సిటివిటీ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు. అంటే ఇది పూర్తిగా ఇండియా ఫోకస్‌డ్ ప్రొడక్ట్ అన్న మాట.
ఈ టూ వీలర్ ప్రాజెక్ట్ కోసం విన్‌ఫాస్ట్ తన తమిళనాడు ప్లాంట్‌లో ప్రత్యేక ఉత్పత్తి లైన్ ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం, ఎలక్ట్రిక్ కార్ల తయారీ కోసం అక్కడ 1.5 లక్షల యూనిట్ల వార్షిక సామర్థ్యాన్ని పెంచుతున్నారు. అయితే స్కూటర్ విభాగంలో మాత్రం కంపెనీ ఆలోచన మరింత పెద్దది. దీర్ఘకాల లక్ష్యంగా ఏకంగా 10 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం దిశగా విన్‌ఫాస్ట్ చూస్తోంది.
మన బడ్జెట్‌లోనే స్కూటర్ ధర!
ధరల విషయంలోనూ కంపెనీ చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తోంది. ఇప్పటికే ఇండియన్ సప్లయర్లతో చర్చలు మొదలుపెట్టింది. ముఖ్యంగా బ్యాటరీలు సహా కీలక భాగాలను లోకల్‌గా తయారు చేయడం ద్వారా ఖర్చులు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో, స్కూటర్ల ధరలు సామాన్య వినియోగదారులకు అందుబాటులో, అంటే మన బడ్జెట్‌లోనే ఉండే అవకాశం ఉంది.
ఇదే సమయంలో... PLI, PM E-DRIVE వంటి కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల అర్హతను కూడా విన్‌ఫాస్ట్ పరిశీలిస్తోంది. పెట్టుబడుల పరిమాణం, ఉత్పత్తి టైమ్‌లైన్‌ను బట్టి ఈ ఇన్సెంటివ్‌లు ఉపయోగించుకోవాలని కంపెనీ యోచిస్తోంది.
గత ఏడాది కాలంగా ఇండియా మార్కెట్‌పై చేసిన విస్తృత అధ్యయనం ఫలితంగానే ఈ స్కూటర్లు రూపుదిద్దుకుంటున్నాయి. రోజూ ఆఫీస్‌కు వెళ్లే వారు, డెలివరీ అవసరాలు, ఫ్యామిలీ వినియోగం - ఇలా అన్నింటికీ సరిపోయేలా వాల్యూమ్ ఫోకస్‌డ్, అఫోర్డబుల్ (అందుబాటు ధర) ఎలక్ట్రిక్ స్కూటర్లు తీసుకురావడమే ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఒకవైపు ఓలా, ఏథర్, టీవీఎస్, బజాజ్ లాంటి బ్రాండ్లు ఇప్పటికే మార్కెట్‌ను హీటెక్కిస్తున్నాయి. ఇప్పుడు విన్‌ఫాస్ట్ కూడా రంగంలోకి దిగితే, ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో పోటీ మరింత టఫ్‌గా మారడం ఖాయం. వినియోగదారులకు ఇది మంచి అవకాశమే. మరి విన్‌ఫాస్ట్ స్కూటర్లు ఎంత రేంజ్ ఇస్తాయో, ఎంత ధరతో వస్తాయో చూడాలి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















