క్లాస్ కార్ల నుంచి మాస్ మార్కెట్ వరకు: 2026లో Honda లాంచ్ ప్లాన్ ఇదే
2026 కోసం హోండా భారీ ప్లాన్ వేసింది. ప్రిల్యూడ్, ZR V హైబ్రిడ్ CBU లాంచ్‌లు, సిటీ, ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌లు రాబోతున్నాయి. ధరలు, ఫీచర్లు, టైమ్‌లైన్ పూర్తి వివరాలు ఈ కథనంలో.

Upcoming Honda Cars India 2026: ఇండియా మార్కెట్‌లో గత కొంతకాలంగా పరిమిత మోడల్స్‌తోనే కొనసాగుతున్న హోండా, 2026లో మాత్రం తన వ్యూహాన్ని చాలా క్లియర్‌గా మార్చబోతోంది. ప్రీమియం బ్రాండ్ ఇమేజ్‌ను బలోపేతం చేయడంతో పాటు, ఇప్పటికే ఉన్న మోడల్స్‌ను అప్‌డేట్ చేస్తూ మార్కెట్‌లో గట్టి పోటీనిచ్చే దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగానే 2026లో హోండా నాలుగు కీలక లాంచ్‌లకు సిద్ధమవుతోంది.
ఈ ఏడాది ప్రారంభంలోనే హోండా, కొన్ని ప్రీమియం మోడల్స్‌ను ఇండియాకు దిగుమతి చేయనున్నట్టు ప్రకటించింది. వీటిని ప్రధానంగా “బ్రాండ్ బిల్డర్స్”గా ఉపయోగించాలన్నది కంపెనీ ఆలోచన. అదే సమయంలో, Honda Elevate, Honda City వంటి పాపులర్ మోడల్స్‌కు ఫేస్‌లిఫ్ట్‌లు కూడా తీసుకురానుంది.
2026 Honda Prelude – స్పోర్టీ GT కూపే
2026 తొలి భాగంలో హోండా ప్రిల్యూడ్ ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది పూర్తిగా CBU (కంప్లీట్ బిల్ట్ యూనిట్)గా పరిమిత సంఖ్యలో దిగుమతి అవుతుంది. ప్రిల్యూడ్‌కు సంబంధించిన E20 ఇంధన అనుకూలత, టైర్ స్పెసిఫికేషన్లను హోండా ఇప్పటికే ఫైనల్ చేస్తున్నట్టు సమాచారం.
ఈ రెండు తలుపుల స్పోర్ట్స్ కూపేలో 2.0 లీటర్, 4 సిలిండర్ అట్కిన్‌సన్ సైకిల్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో కలిసి పని చేస్తూ మొత్తం 200 hp శక్తి, 315 Nm టార్క్‌ను అందిస్తుంది. సంప్రదాయ గేర్‌బాక్స్ లేకుండా, ఎలక్ట్రిక్ మోటార్లే నేరుగా వీల్స్‌ను నడుపుతాయి. హోండా S+ షిఫ్ట్ సిస్టమ్ ద్వారా గేర్ మార్పుల అనుభూతిని ఆస్వాదించవచ్చు. కొన్ని చాసిస్ భాగాలు సివిక్ టైప్ R నుంచి తీసుకున్నప్పటికీ, ఇది రేసింగ్ కారు కంటే ఎక్కువగా GT కార్‌గా రూపొందించారు. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.80 లక్షలు ఉండే అవకాశం ఉంది.
Honda Elevate Facelift – స్వల్ప మార్పులతో కొత్త లుక్
2026 రెండో భాగంలో హోండా ఎలివేట్‌కు మిడ్ సైకిల్ ఫేస్‌లిఫ్ట్ రానుంది. మిడ్‌సైజ్ SUV సెగ్మెంట్‌లో పోటీ తీవ్రంగా ఉండటంతో, ఎలివేట్‌ను తాజాగా ఉంచడమే ఈ ఫేస్‌లిఫ్ట్ లక్ష్యం. ముందు, వెనుక డిజైన్‌లో స్వల్ప మార్పులు, లోపల రిఫ్రెష్ చేసిన ఇంటీరియర్, కొన్ని కొత్త ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది. ఇంజిన్ పరంగా మాత్రం 1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ కొనసాగనుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.11 లక్షల నుంచి రూ.17 లక్షల మధ్య ఉండే సూచనలు ఉన్నాయి.
Honda City Facelift – సివిక్ స్టైల్ టచ్?
ఐదో తరం హోండా సిటీకి 2026లో రెండో ఫేస్‌లిఫ్ట్ రానుంది. 2028లో వచ్చే పూర్తిగా కొత్త జనరేషన్ మోడల్‌కు ముందు వస్తున్న ఒక మధ్యంతర అప్‌డేట్‌గా దీనిని భావించవచ్చు. టెస్టింగ్‌లో ఇంకా కనిపించకపోయినా, బయటి డిజైన్ సివిక్‌ను పోలి ఉండేలా, కొన్ని సాఫ్ట్ అప్‌డేట్స్ ఉంటాయని అంచనా. కేబిన్‌లో కొత్త ట్రిమ్, అప్హోల్స్టరీ రావచ్చు. ఇంజిన్ ఆప్షన్లలో 1.5 లీటర్ పెట్రోల్, e:HEV హైబ్రిడ్ యథాతథంగా కొనసాగుతాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.12 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.
Honda ZR V Hybrid – ప్రీమియం క్రాస్‌ఓవర్
2026 చివరి త్రైమాసికంలో హోండా ZR V హైబ్రిడ్ ఇండియాకు రానుంది. ఇది కూడా CBUగా దిగుమతి అవుతుంది. హోండా లైనప్‌లో ఇది CR V కంటే కింద స్థానం దక్కించుకుంటుంది. ఎలివేట్‌తో పోలిస్తే ఇది 256 మిల్లీమీటర్లు ఎక్కువ పొడవుగా ఉండటం గమనార్హం. లోపల 9 అంగుళాల టచ్‌స్క్రీన్, 10.2 అంగుళాల డిజిటల్ క్లస్టర్, పుష్ బటన్ గేర్ సెలెక్టర్ ప్రత్యేక ఆకర్షణ. 2.0 లీటర్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్, AWDతో ఇది 184 hp శక్తిని అందించనుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.50 నుంచి రూ.60 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.
మొత్తంగా చూస్తే, 2026 హోండాకు ఇండియా మార్కెట్‌లో కీలక మలుపుగా మారనుంది. ప్రీమియం బ్రాండ్ ఇమేజ్, అప్‌డేటెడ్ మాస్ మోడల్స్ కలయికతో హోండా మళ్లీ పోటీలో నిలబడాలని చూస్తోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















