రెండు దశాబ్దాల ప్రయాణానికి ముగింపు - మరికొన్నాళ్లలో Innova Crysta ఎండ్ గేమ్!
టయోటా ఇన్నోవా క్రిస్టా డీజిల్ మోడల్ 2027లో నిలిపివేయనున్నారు. కఠినమైన CAFE 3 నిబంధనలు, హైబ్రిడ్ వ్యూహమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా మారాయి.

Toyota Innova Crysta Discontinued: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో డీజిల్ MPVలకు రాజుగా నిలిచిన టయోటా ఇన్నోవా క్రిస్టా ప్రయాణానికి కౌంట్‌డౌన్ మొదలైంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇండియన్ ఫ్యామిలీ కార్ సెగ్మెంట్‌ను ప్రభావితం చేసిన ఈ మోడల్‌ను 2027 మార్చి నాటికి నిలిపివేయాలని టయోటా నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఇన్నోవా క్రిస్టా యుగానికి ముగింపు పలికినట్లే అవుతుంది.
ప్రస్తుతం అమ్మకాల్లో ఉన్న ఇన్నోవా క్రిస్టా... 2.4 లీటర్ల డీజిల్ ఇంజిన్, మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తోంది. వాస్తవానికి ఈ మోడల్‌ను 2025 కల్లా నిలిపివేయాలని టయోటా మొదట భావించింది. కానీ ఇన్నోవా హైక్రాస్‌కు సెమీకండక్టర్ పరిమితులు, క్రిస్టాపై కొనసాగిన బలమైన డిమాండ్ కారణంగా ఉత్పత్తిని మరికొంత కాలం కొనసాగించింది.
టయోటా అధికారిక స్పందన
ఈ అంశంపై స్పందించిన టయోటా కిర్లోస్కర్ ప్రతినిధి, "భవిష్యత్ ఉత్పత్తులపై వ్యాఖ్యానించలేమని అన్నారు. అయితే మల్టీ పాత్‌వే అప్రోచ్, అంటే పెట్రోల్, హైబ్రిడ్, ఇతర శక్తి వనరులపై ఆధారపడి స్థిరమైన మొబిలిటీని అందించడమే తమ వ్యూహమని వెల్లడించారు".
ఇన్నోవా క్రిస్టా కాలం ఎందుకు ముగుస్తోంది?
ఇందుకు ప్రధాన కారణం రాబోయే కఠినమైన కేఫ్ 3 (CAFE 3) నిబంధనలు. ఈ నిబంధనల ప్రకారం, కంపెనీల మొత్తం వాహనాల కార్బన్ ఉద్గారాల సగటును మరింత తగ్గించాల్సి ఉంటుంది. బరువైన లాడర్ ఫ్రేమ్, డీజిల్ ఇంజిన్‌తో ఉన్న ఇన్నోవా క్రిస్టా లాంటి MPVలు ఈ నిబంధనల్లో ఇమడలేని పరిస్థితి ఏర్పడింది.
దీంతో టయోటా తన వ్యూహాన్ని స్పష్టంగా మార్చింది. ప్రైవేట్ యూజర్ల కోసం మోనోకాక్ బాడీ, స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్‌తో వచ్చే ఇన్నోవా హైక్రాస్‌ను ముందుకు నెడుతోంది. ఫ్లీట్ అవసరాలకే పరిమితమైన క్రిస్టా పాత్ర ఇక ముగియనుంది.
హైబ్రిడ్‌లకు ‘సూపర్ క్రెడిట్స్’ లాభం
CAFE నిబంధనల్లో హైబ్రిడ్ వాహనాలకు ఇచ్చే ‘సూపర్ క్రెడిట్స్’ టయోటాకు పెద్ద ప్లస్. ఒక్క హైబ్రిడ్ వాహనాన్ని రెండు వాహనాలుగా లెక్కిస్తారు. అంటే టయోటా అమ్మే ప్రతి ఇన్నోవా హైక్రాస్... కంపెనీ కార్బన్ సగటును రెండింతలు తగ్గించినట్లు లెక్క. ఇదే కారణంగా భవిష్యత్తులో టయోటా తన హైబ్రిడ్ పోర్ట్‌ఫోలియోను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లనుంది. Fortuner డీజిల్ భవితవ్యంపై ఇంకా స్పష్టత లేకపోయినా... 2029లో వచ్చే Toyota Land Cruiser FJ కు డీజిల్ ఆప్షన్ ఉండదన్నది మాత్రం దాదాపు ఖాయమైంది.
క్రిస్టా స్థానాన్ని ఏది భర్తీ చేస్తుంది?
ఇన్నోవా క్రిస్టా నిష్క్రమణతో డీజిల్ MPV సెగ్మెంట్‌లో పెద్ద ఖాళీ ఏర్పడనుంది. ప్రస్తుతం మహీంద్రా, టాటా వద్ద శక్తిమంతమైన డీజిల్ ఇంజిన్లు ఉన్నా... ఇన్నోవా తరహా బాడీ ఆన్ ఫ్రేమ్ MPV లేదు. హ్యుందాయ్ ఇప్పటి వరకు మూడు వరుసల క్రాస్‌ఓవర్లకే పరిమితమైంది.
అయితే, భవిష్యత్తులో 'హ్యుందాయ్ స్టారియా' (Hyundai Staria) భారీ లోకలైజేషన్‌తో భారత మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. అది క్రిస్టా ఖాళీని పూరిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.
మొత్తానికి, ఇన్నోవా క్రిస్టా నిష్క్రమణ ఒక మోడల్ ముగింపు మాత్రమే కాదు... డీజిల్ MPV యుగానికి ముగింపు సంకేతమని చెప్పుకోవచ్చు. SUVల హవా మధ్యలో, ఈ నిర్ణయం భారత ఆటో మార్కెట్‌ను మరో మలుపు తిప్పడం ఖాయం.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















