Xiaomi Electric Car: షియోమి ఎలక్ట్రిక్ కార్, 3 రోజుల్లో 3 లక్షల సేల్స్ - ఏంటంట దీని గొప్ప?
Xiaomi Electric Car Sales: చైనా కంపెనీ Xiaomi తన ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసింది, త్వరలో గ్లోబల్ మార్కెట్లలోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. SU7 & YU7 కోసం భారీ ఆర్డర్లు వస్తున్నాయి.

Xiaomi EV Price, Range And Features In Telugu: చైనాకు చెందిన టెక్ దిగ్గజం Xiaomi.. స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగంలోనూ అడుగు పెట్టింది. ఈ కంపెనీ, అద్భుతమైన ఫీచర్లతో SU7 EV & YU7 EV ని చైనా మార్కెట్‌లో లాంచ్ చేసింది. 2027 నుంచి చైనా వెలుపల కూడా తన కార్లను విక్రయించాలని యోచిస్తోంది.
భారతదేశంలో SU7 ఎలక్ట్రిక్ కార్ ప్రదర్శన
వాస్తవానికి, జులై 2024లో బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో Xiaomi భారతదేశంలో తొలిసారిగా SU7 ఎలక్ట్రిక్ కారును ప్రదర్శించింది. దీనిని చూసిన తర్వాత, భారతదేశంలో దాని లాంచ్ గురించి చర్చలు ప్రారంభమయ్యాయి. ఇది, ఈ కంపెనీ నుంచి వచ్చిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. ఈ కారు బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తే ఏకంగా 800 కి.మీ. వరకు డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది. షియోమీ, SU7 EVని అత్యాధునిక ఫీచర్లతో ప్యాక్ చేసింది. కారులో.. 16.1-అంగుళాల 3K టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, 56-అంగుళాల హెడ్-అప్ డిస్‌ప్లే (HUD), అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, పనోరమిక్ సన్‌రూఫ్ & బహుళ డ్రైవింగ్ మోడ్, ఇంకా ఇటువంటి చాలా స్మార్ట్ ఫీచర్‌లను ఈ కారులో ఉన్నాయి. సుదూర ప్రయాణాలకు ఈ కారు చాలా అద్భుతంగా ఉంటుంది.
మూడు నిమిషాల్లోనే రెండు లక్షల బుకింగ్స్
Xiaomi రెండో ఎలక్ట్రిక్ కారు YU7 కూడా చైనాలో లాంచ్ అయింది, లాంచ్ సమయంలో ఇది రికార్డులు తిరగరాసింది. లాంచింగ్ సమయంలో, కేవలం మూడంటే మూడే నిమిషాల్లో రెండు లక్షల యూనిట్లు బుక్ అయ్యాయి. 72 గంటల్లో 3 లక్షలకు పైగా యూనిట్ల కోసం బుకింగ్స్ జరిగాయి.
YU7 EV ప్రత్యేకతలు - ఇది సింగిల్ ఛార్జ్‌తో 835 కి.మీ. వరకు డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది. ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్‌తో లాంచ్ అయింది. LED హెడ్‌లైట్లు & ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అమర్చారు. కారులో మూడు మినీ స్క్రీన్‌లు, డ్యూయల్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, 25-స్పీకర్ ఆడియో సిస్టమ్ & 678 లీటర్ల బూట్ స్పేస్ సహా అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు కూడా సుదూర ప్రయాణాలకు గ్రేట్ ఆప్షన్ అవుతుంది.
Xiaomi EVలు భారతదేశంలో లాంచ్ అవుతాయా?
భారతదేశంలో SU7 & YU7 లాంచ్ గురించి Xiaomi ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ కంపెనీ CEO లీ జున్ (Lei Jun), 2027 నుంచి చైనా వెలుపల EVల అమ్మకాలు ప్రారంభించడానికి Xiaomi సన్నాహాలు చేస్తున్నట్లు ఇటీవల చెప్పారు. SU7 EV ని ఇప్పటికే భారతదేశంలో ప్రదర్శించిన నేపథ్యంలో, YU7 EV ని కూడా ఎగ్జిబిట్ చేస్తారని భావిస్తున్నారు.
భారతదేశంలో ఏ కార్లతో పోటీ?
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విభాగం వేగంగా అభివృద్ధి చెందుతోంది & కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, భారత మార్కెట్ షియోమికి పెద్ద & లాభదాయకమైన అవకాశంగా మారవచ్చు. షియోమి భారతదేశంలో SU7 EV లేదా YU7 EV ని లాంచ్ చేస్తే... టాటా మోటార్స్, మహీంద్రా, హ్యుందాయ్, MG మోటార్స్, BYD, VinFast & టెస్లా వంటి కంపెనీలకు గట్టి పోటీ అవుతుంది.





















