Mahindra XUV 7XO vs XEV 9S: బయటి డిజైన్ నుంచి ఫీచర్ల వరకు అసలు తేడా ఏంటి? కొనే ముందు కచ్చితంగా తెలియాల్సిన విషయాలు
Mahindra XUV 7XO & XEV 9S మధ్య డిజైన్, ఇంటీరియర్, ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధరల్లో ఉన్న ప్రధాన తేడాలు, పోలికలు ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.

Mahindra Electric SUVs India: మహీంద్రా తన ఫ్లాగ్‌షిప్ ICE SUV అయిన XUV 7XOను తాజాగా అప్‌డేట్ చేసింది. అదే సమయంలో కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఫ్లాగ్‌షిప్ వెహికల్‌గా ఉన్న XEV 9S కూడా మార్కెట్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బయట నుంచి చూస్తే ఈ రెండు SUVలు చాలా వరకు ఒకేలా కనిపిస్తాయి. కానీ లోతుగా చూస్తే డిజైన్, ఫీచర్లు, పవర్‌ట్రెయిన్‌లో స్పష్టమైన తేడాలు ఉన్నాయి. మరి ఈ రెండింటి మధ్య అసలు పోలిక ఏంటి? ఏది మీకు సరైన ఎంపిక అవుతుంది?.
ఎక్స్‌టీరియర్ డిజైన్
Mahindra XUV 7XO ముందు భాగం పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. ఇందులో స్కార్పియో N తరహాలో డ్యూయల్-పాడ్ LED హెడ్‌ల్యాంప్స్, C ఆకారంలో LED DRLs ఉన్నాయి. గ్లోస్ బ్లాక్ గ్రిల్, సిల్వర్ స్లాట్స్‌తో ఈ SUVకి అగ్రెసివ్ లుక్ వచ్చింది. బంపర్‌లో ఫంక్షనల్ ఎయిర్ ఇంటేక్స్, ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి.
ఇక XEV 9S విషయానికి వస్తే, ఇది బోర్న్-ఎలక్ట్రిక్ డిజైన్ ఫిలాసఫీతో రూపొందింది. ఇందులో గ్రిల్ అసలు ఉండదు. కనెక్టెడ్ LED DRLs, నిలువుగా అమర్చిన ప్రొజెక్టర్ LED లైట్లు త్రిభుజాకార హౌసింగ్‌లో ఉంటాయి. ఈ లుక్ పూర్తిగా ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది.
సైడ్ ప్రొఫైల్‌లో మాత్రం రెండు SUVలు దాదాపు ఒకేలా కనిపిస్తాయి. ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్, గ్లోస్ బ్లాక్ క్లాడింగ్, విండో లైన్ వెంట క్రోమ్ స్ట్రిప్ రెండింటిలోనూ ఒకేలా ఉన్నాయి. తేడా అనేది 19 అంగుళాల అల్లాయ్ వీల్స్ డిజైన్‌లో మాత్రమే.
రియర్ డిజైన్‌లో కూడా చాలా పోలికలు కనిపిస్తాయి. యారో షేప్ ర్యాప్‌రౌండ్ LED టెయిల్ లైట్స్, హనీకోంబ్ డిజైన్ ఎలిమెంట్స్, టెయిల్‌లైట్స్ మధ్య గ్లోస్ బ్లాక్ స్ట్రిప్ రెండింటిలోనూ ఉన్నాయి. అయితే XUV 7XO బంపర్‌పై ప్యాటర్న్ ఎలిమెంట్స్ ఉండగా, XEV 9S క్లీనర్ లుక్‌తో వస్తుంది.
ఇంటీరియర్ డిజైన్
ఇంటీరియర్‌లోకి వస్తే, రెండు మోడళ్ల డాష్‌బోర్డ్ డిజైన్ దాదాపు ఒకేలా ఉంటుంది. ట్రిపుల్ 12.3 అంగుళాల స్క్రీన్ సెటప్, రెండు స్పోక్ స్టీరింగ్ వీల్ ఇందులో ప్రధాన ఆకర్షణ. అయితే XUV 7XOలో క్రోమ్ ‘ట్విన్ పీక్స్’ లోగో ఉండగా, XEV 9Sలో లైటింగ్‌తో కూడిన ఇన్ఫినిటీ లోగో ఉంటుంది.
కేబిన్ కలర్ థీమ్‌లో మాత్రం తేడా ఉంది. XUV 7XOలో బ్లాక్, టాన్, బేజ్ కలయిక కనిపిస్తే, XEV 9Sలో ఆఫ్ వైట్, గ్రే షేడ్స్ ఉంటాయి. సీట్ల డిజైన్ ఒకేలా ఉన్నా, రంగుల ఎంపిక భిన్నంగా ఉంటుంది.
ఫీచర్లు
ఫీచర్ల విషయంలో రెండు SUVలు చాలా రిచ్‌గా ఉన్నాయి. బేస్ వేరియంట్ నుంచే మూడు స్క్రీన్లు, పవర్డ్ డ్రైవర్ సీటు మెమరీ ఫంక్షన్‌తో, కో-డ్రైవర్ సీటుకు బాస్ మోడ్, 16 స్పీకర్ల Harman Kardon సౌండ్ సిస్టమ్, పానోరమిక్ సన్‌రూఫ్, ముందు & రెండో వరుస సీట్లకు వెంటిలేషన్, ముందు-వెనుక వైర్‌లెస్ ఛార్జర్లు అందుబాటులో ఉన్నాయి.
అయితే XEV 9S కొన్ని అదనపు ఫీచర్లతో ముందంజలో ఉంటుంది. ఇందులో AR ఆధారిత HUD, ఆటోమేటిక్ పార్కింగ్ అసిస్ట్, పెట్ మోడ్, NFC కీ, అలాగే ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేకమైన V2L ఫీచర్ ఉన్నాయి. ఇవి XUV 7XOలో లేవు.
పవర్‌ట్రెయిన్ & ధరలు
XUV 7XOలో 2.0 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ (203hp) లేదా 2.2 లీటర్ల డీజిల్ ఇంజిన్ (185hp) ఆప్షన్లు ఉన్నాయి. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు లభిస్తాయి. డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్‌లో AWD ఆప్షన్ కూడా ఉంది.
XEV 9Sలో 59kWh, 70kWh, 79kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. ఇది పూర్తిగా RWD సెటప్‌తోనే వస్తుంది.
ధరల విషయానికి వస్తే, Mahindra XUV 7XO ఎక్స్-షోరూమ్ ధర ₹13.66 లక్షల నుంచి ₹24.92 లక్షల వరకు ఉంటుంది. Mahindra XEV 9S ఎక్స్-షోరూమ్ ధర ₹19.95 లక్షల నుంచి ₹30.50 లక్షల వరకు ఉంటుంది.
మొత్తానికి, టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రిక్ SUV కావాలంటే XEV 9S సరైన ఎంపిక. శక్తిమంతమైన ఇంజిన్, AWD అవసరం అనుకునేవారికి XUV 7XO మెరుగైన ఆప్షన్‌గా నిలుస్తుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















