ఫెస్టివ్ సీజన్‌కు ముందే షాకివ్వనున్న Mahindra, ఈ ఏడాది 4వ సారి పెరగనున్న SUV ధరలు
ఫెస్టివల్ సీజన్‌లో మహీంద్రా SUV కొనాలని ప్లాన్ చేస్తున్న కస్టమర్లకు కంపెనీ షాకివ్వనుంది. పెరుగుతున్న కమోడిటీ వ్యయాల మధ్య మరొకసారి ధరల పెంపుపై ఆలోచిస్తోంది.

ఈ ఫెస్టివల్ సీజన్‌లో మీరు కొత్త మహీంద్రా SUV కొనాలని భావిస్తున్నారా.. అయితే మీకు ధరల షాక్ తగలవచ్చు. మహీంద్రా కంపెనీ తన SUV రేంజ్ ధరలను మరోసారి పెంచేందుకు ఆలోచిస్తోంది. అయితే, ఇంకా ధరల పెంపుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ పరిస్థితిని గమనిస్తే రాబోయే కొన్ని వారాల్లో కంపెనీ ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
పెరుగుతున్న కమోడిటీ ధరలపై కంపెనీ నిఘా ఉంచిందని మహీంద్రా ఆటోమోటివ్ ప్రెసిడెంట్, CEO నళినీకాంత్ గొల్లగుంట ఇటీవల తెలిపారు. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని వారాల్లో ధరల పెంపు అవసరమా, ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోవచ్చని సంకేతాలు ఇచ్చారు.
ఈ ఏడాది 3 సార్లు పెరిగిన ధరలు
మహీంద్రా SUVs ధరలు 2026 సంవత్సరంలో పెరగడం ఇదే తొలిసారి కాదు. కంపెనీ జనవరి, ఏప్రిల్, జులై నెలల్లో గత మూడు త్రైమాసిక సమయంలో ధరలు పెంచింది. అంటే ఈ ఏడాది ఇప్పటికే మూడుసార్లు ధరలను పెంచింది. వీటిలో జులైలో చేసిన పెంపు అత్యంత కీలకం. SUVs ధరలలో సగటున 2.7 శాతం పెంపు నమోదైంది. జులై 10 నుంచి SUVs ధరలపై సగటున 2.7 శాతం, కమర్షియల్ వాహనాల ధరలపై 2 శాతం పెంపు అమల్లోకి వచ్చిందని మహీంద్రా ఓ ప్రకటనలో తెలిపింది. కమోడిటీ వ్యయాలు పెరగడమే ధరల పెంపునకు ముఖ్య కారణమని కంపెనీ వెల్లడించింది. అలాగే మహీంద్రా కంపెంనీ వేర్వేరు మోడళ్లు, వేరియంట్లపై ఈ పెంపు మొత్తం వేర్వేరుగా ఉండవచ్చని స్పష్టం చేసింది.
ఏ ఏ SUVsపై ప్రభావం పడవచ్చు?
ఒకవేళ మహీంద్రా కొత్త ధరల పెంపును అమలు చేస్తే, కంపెనీకి చెందిన SUV లపై భారీ ప్రభావం చూపుతుంది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో Thar, Thar ROXX, Scorpio-N, Scorpio Classic, XUV 3XO, XUV700 లతో పాటు మహీంద్రా Bolero వంటి మోడళ్లు ఉన్నాయి. వాహనాలపై ప్రతిపాదిత కొత్త పెంపు ఎంత శాతం ఉంటుంది, ఏ మోడల్ పై ధర ఎంత పెంచుతారు అనేది ప్రస్తుతానికి తెలియదు.
ఫెస్టివల్ సీజన్ చాలా కీలకం
ఆటోమొబైల్ కంపెనీలకు ఫెస్టివల్ సీజన్ ఎంతో కీలకం. గతంలో ధరల పెంపు చేసినప్పటికీ, కస్టమర్ల విచారణలు (Inquiries), బుకింగ్‌లపై పెద్దగా ప్రభావం పడలేదని మహీంద్రా కంపెనీ తెలిపింది. గత జిఎస్‌టి మార్పుల తర్వాత ధరలు ఇప్పటికీ ప్రీ-జీఎస్టీ స్థాయిల కంటే తక్కువగానే ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అందుబాటులో ఉన్న తక్కువ ధరలు, మహీంద్రా కంపెనీకి చెందిన అప్‌డేటెడ్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో వల్ల ఈ పండుగల సీజన్‌లో మంచి డిమాండ్ ఉంటుందని నళినీకాంత్ గొల్లగుంట ఆశాభావం వ్యక్తం చేశారు.
ట్రెండింగ్ వార్తలు























