Lamborghini Sales: కార్ల సేల్స్ లో దూసుకుపోతున్న లాంబోర్గిని
Lamborghini Cars: ఇటలీకి చెందిన సూపర్ స్పోర్ట్స్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ లాంబోర్గిని కార్ల అమ్మకాల్లో దూసుకుపోతోంది. 2021 ఫస్ట్ హాఫ్‌లో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఆర్డర్లను సొంతం చేసుకుంది.
లగ్జరీ కార్లకు కేరాఫ్ అయిన లాంబోర్గిని (Lamborghini) సంస్థ కార్ల అమ్మకాల్లో దూసుకుపోతోంది. ఇటలీకి చెందిన లాంబోర్గిని 2021 సంవత్సరంలో మొదటి ఆరునెలలకు (ఫస్ట్ హాఫ్) సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అమ్మిన కార్ల సంఖ్యను (global sales numbers) విడుదల చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 4852 కార్లను అమ్మినట్లు తెలిపింది. 2020లో ఇదే సమయంలో ఉన్న కార్ల అమ్మకాలతో పోలిస్తే దాదాపు 37 శాతం, 2019తో పోలిస్తే 6.6 శాతం ఎక్కువని చెప్పింది. ఆరు నెలల వ్యవధిలో ఇంత సంఖ్యలో కార్ల అమ్మకాలు జరగడం రికార్డని వెల్లడించింది. తర్వాత 10 నెలలకు సరిపడా అంటే 2022 ఏప్రిల్ వరకు సేల్స్ ఇప్పటికే ఆర్డర్ల రూపంలో వచ్చాయని పేర్కొంది.
భారతదేశంలోనూ లాంబోర్గిని కార్ల అమ్మకాలు డబుల్ అయ్యాయని సంస్థ ఇండియా హెడ్ శరత్ అగర్వాల్ వెల్లడించారు. అక్టోబర్-మార్చి 2019-20తో పోలిస్తే అక్టోబర్-మార్చి 2020-21లో ఆర్డర్ల సంఖ్య 20 శాతం పెరిగిందని చెప్పారు.
లాంబోర్గినీ హురకాన్ ఎస్టీఓ (Lamborghini Huracan STO)..
లాంబోర్గిని నుంచి ఇటీవల సరికొత్త కారు భారత మార్కెట్లో లాంచ్ అయింది.లాంబోర్గినీ హురకాన్ ఎస్టీఓ (సూపర్ ట్రోఫియో ఓమోలోగాటా) పేరున్న ఈ కారు ధర రూ.4.99 కోట్లుగా ఉంది. ఈ రేసింగ్ కారు కేవలం మూడు సెకన్లలతో 100 కిలోమీటర్ల వేగాన్ని, 9 సెకన్లలో 100 నుంచి 200 కి.మీ వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 310 కిలోమీటర్లుగా ఉంది. ఈ మోడల్ కారును ప్రపంచవ్యాప్తంగా 2020 నవంబర్లోనే విడుదల చేయగా.. తాజాగా భారత మార్కెట్లోకి లాంచ్ చేశారు. దీని ఫీచర్లు ఇలా ఉన్నాయి..
- అన్ని హురకాన్ల మాదిరిగానే లాంబోర్గిని హురకాన్ ఎస్‌టీవోలో వీ10 ఇంజన్ ఏర్పాటు చేశారు. అయితే హురకాన్ పెర్ఫార్మంటే (Lamborghini Huracan Performante) వెర్షన్‌తో పోలిస్తే ఇందులో పవర్ బంప్ లేదు.
- ఇందులో ది రోడ్ ఓరియంటెడ్ ఎస్‌టీవో, ట్రాక్ ఫోకస్డ్ ట్రోఫీ, రెయిన్ మోడ్ అనే మూడు రకాల డ్రైవింగ్ మోడ్స్‌ను అమర్చారు.
- ఈ కారు బాడీ ప్యానెల్స్ దాదాపు 75 శాతం కార్బన్ ఫైబర్‌తో తయారు చేయబడ్డాయి. కారు బరువును తగ్గించేందుకు ఎక్కువ కార్బన్ ఫైబర్ భాగాలను ఉపయోగించారు.
- ఇంతకు ముందు రిలీజ్ అయిన మోడల్‌తో పోలిస్తే లాంబోర్గినీ హురకాన్ ఎస్టీఓ 43 కిలోల తక్కువ బరువును కలిగి ఉంది.
- ఇందులో క్లైమేట్ కంట్రోల్, అల్యూమినియం స్విచెస్, లార్జ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, ప్యాడిల్ షిఫ్టర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.
- ఇంజన్ 7 స్పీడ్ డ్యూయల్ క్లాచ్ LDF (లింబోర్ఘిని డోపియో ఫ్రిజియోన్) గేర్‌బాక్స్‌తో పనిచేస్తుంది.
- ఈ కారు ఇంజన్ 8,000 ఆర్పీఎమ్ వద్ద 630 BHP (బ్రేక్ హార్స్ పవర్).. 6500 ఆర్పీఎమ్ వద్ద సామర్థ్యంతో 565 NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.