Hybrid Cars Mileage: ఇండియాలో బెస్ట్ మైలేజ్ హైబ్రిడ్ కార్ ఏది? రియల్ వరల్డ్ మైలేజ్‌ను బట్టి ఇచ్చిన ర్యాంకింగ్స్
భారత్‌లో అమ్ముడవుతున్న ఆరు హైబ్రిడ్ కార్లలో నాలుగింటిని రియల్ వరల్డ్ మైలేజ్ కోసం టెస్ట్ చేశారు. ఏ కారు సిటీ, హైవేలో బెస్ట్ ఫ్యూయల్ ఎఫిషియెన్సీ ఇచ్చిందో వివరాలు ఇక్కడ చదవండి.

Hybrid Cars Mileage 2025 India: భారత మార్కెట్లో హైబ్రిడ్ కార్ల డిమాండ్ ఇటీవల పెరుగుతోంది. పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్, దీర్ఘకాల వినియోగం కోరుకునే వారికి హైబ్రిడ్లు బాగా నచ్చుతున్నాయి. అయితే కంపెనీలు చెప్పే ARAI (Automotive Research Association of India) మైలేజ్ & నిజ జీవితంలో వచ్చే మైలేజ్ మధ్య సాధారణంగా పెద్ద వ్యత్యాసం కనిపిస్తుంది. ఆ గ్యాప్‌ను కచ్చితంగా అంచనా వేసేందుకు, ఎక్స్‌పర్ట్స్‌లు 4 పాపులర్ హైబ్రిడ్ కార్లను రోడ్‌పై నడిపి రియల్-వరల్డ్ టెస్టులు చేశారు. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ యూజర్లను దృష్టిలో పెట్టుకుని, ఇక్కడ ప్రతి కారు ఇచ్చిన నిజమైన మైలేజ్ వివరాలు, డ్రైవింగ్ పరిస్థితులు, ప్రధాన ఫీచర్లు క్లియర్‌గా చెబుతున్నాం.
4. Toyota Innova Hycross - సగటు మైలేజ్: 14.60 kmpl
టయోటా ఇన్నోవా హైక్రాస్ 184hp శక్తిమంతమైన 2.0 లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్‌తో వస్తుంది. పవర్ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ వాహనం పరిమాణం పెద్దది కాబట్టి మైలేజ్‌పై ప్రభావం పడుతుంది. ఎక్స్‌పర్ట్స్‌లు చేసిన టెస్టుల్లో, ఈ వెహికల్ నగరంలో లీటరుకు 13.10 km, హైవే మీద 16.10 km మైలేజ్ ఇచ్చింది. కంపెనీ క్లెయిమ్ చేసిన 22.16 km మైలేజ్‌తో పోలిస్తే ఇది 7.56 km తక్కువ. అయినా కూడా, 7-8 మందిని తీసుకెళ్లగలిగే పెద్ద MPV లతో పోలిస్తే, టయోటా ఇన్నోవా హైక్రాస్ మంచి ఫ్యూయల్ ఎఫిషియెన్సీ ఉన్న మోడల్‌గానే నిలుస్తుంది.
3. Honda City Hybrid - సగటు మైలేజ్: 21.15 kmpl
మాస్ మార్కెట్లో దొరికే ఏకైక హైబ్రిడ్ సెడాన్ హోండా సిటీ e:HEV. 126hp 1.5 లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ సెటప్, e-CVTతో వస్తుంది. ఇది నగరంలో లీటరుకు 19.80 km, హైవేపై 22.50 km మైలేజ్ ఇచ్చింది. యావరేజ్ మైలేజ్ 21.15 km కాగా, కంపెనీ క్లెయిమ్డ్ 27.26 km తో పోలిస్తే 6.11 km తక్కువ. హోండా క్వాలిటీ, స్మూత్ డ్రైవ్ అనుభవం కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. అయితే ఒక్క వేరియంట్‌లో మాత్రమే లభించడం వల్ల ధర కొంచెం ఎక్కువగానే ఉంటుంది.
2. Toyota Urban Cruiser Hyryder - సగటు మైలేజ్: 21.57 kmpl
అర్బన్ క్రూయిజర్ హైరైడర్ హైబ్రిడ్ మోడళ్ళు 116hp 1.5 లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్‌తో వస్తాయి. నిజ జీవిత టెస్టుల్లో నగరంలో లీటరుకు 20.28 km, హైవే మీద 22.85 km మైలేజ్ ఇచ్చింది. ముఖ్యంగా హైవే మైలేజ్‌లో ఇది ఈ లిస్ట్‌లోనే అత్యుత్తమం. యావరేజ్ మైలేజ్ 21.57 km. క్లెయిమ్డ్ మైలేజ్ 27.97 kmతో పోలిస్తే ఇది 6.4 km తక్కువ. SUV స్పూర్తితో రూపొందించిన డిజైన్, గ్రౌండ్ క్లియరెన్స్, ప్రాక్టికల్ కేబిన్ ఈ కారుకు అదనపు ప్లస్ పాయింట్స్.
1. Maruti Suzuki Grand Vitara - సగటు మైలేజ్: 22.08 kmpl
హైరైడర్‌కి కవల సోదరుడిలా వచ్చిన గ్రాండ్ విటారా, నగర మైలేజ్‌లో స్పష్టమైన ఆధిక్యం చూపించింది. సిటీ టెస్టుల్లో అద్భుతంగా లీటరుకు 23.77 km మైలేజ్ వచ్చింది. అయితే హైవేలో ఇది 20.39 km మాత్రమే ఇచ్చింది. సగటు 22.08 km కాగా, క్లెయిమ్డ్ మైలేజ్ 27.97 km తో పోలిస్తే 5.89 km మాత్రమే తక్కువ. అంటే, ఈ లిస్ట్‌లో క్లెయిమ్డ్‌తో పోలిస్తే తక్కువ వ్యత్యాసం ఉన్న హైబ్రిడ్ కారు ఇదే. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ప్రాంతాల్లో రోజూ ఎక్కువ ట్రాఫిక్‌లో నడిపేవారికి ఈ కార్ బెస్ట్ ఆప్షన్.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















