Tesla Car Booking: టెస్లా మోడల్ Y అడ్వాన్స్ బుకింగ్ కోసం రూ.22 వేలు చెల్లిస్తే చాలు - ఈ కారు మీ చేతికి ఎప్పుడు వస్తుంది?
Tesla Model Y Booking: టెస్లా మోడల్ Y కారుకు ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, వెనుక సీటుకు ప్రత్యేక టచ్‌స్క్రీన్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ రియర్ సీట్లు అందించారు.

Tesla Model Y Price And Advance Booking Process In India: టెస్లా, భారతీయులు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ SUV "మోడల్ Y" కారును జులై 15, 2025న లాంచ్ చేసింది. మోడల్ Y ప్రారంభ ధర రూ. 59.89 లక్షలు, ఇది రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్. దీనిలో మరో వేరియంట్ Long Range RWD, దీని ధర రూ. 67.89 లక్షలు. ఈ ప్రీమియం కార్లు భారత్‌లో తయారు కావడం లేదు, టెస్లా ఈ రెండు వేరియంట్‌లను చైనాలోని షాంఘై ప్లాంట్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU)గా, అంటే "పూర్తిగా తయారైన వాహనాలుగా" ఈ కార్లు చైనా నుంచి భారత్‌లోకి వస్తున్నాయి.
టెస్లా మోడల్ Y కోసం అడ్వాన్స్ బుకింగ్
టెస్లా మోడల్ Y ఎలక్ట్రిక్ SUVని కొనడానికి మీ దగ్గర పూర్తి డబ్బు ఉన్నప్పటికీ ఈ కారును కొనలేరు. కారణం - ఈ కారును ముందస్తుగా బుక్ చేసుకోవాలి. అడ్వాన్స్ బుకింగ్ కోసం మీరు కేవలం రూ. 22,000 చెల్లిస్తే చాలు, మీ పేరిట మోడల్ Yని బుక్ చేస్తారు. ముంబయిలోని టెస్లా షోరూమ్‌కు వెళ్లిగానీ, టెస్లా వెబ్‌సైట్‌లోగానీ మీరు కారును బుక్ చేసుకోవాలి. అడ్వాన్స్ బుకింగ్ కోసం మీరు చెల్లించే రూ. 22,000 నాన్-రిఫండబుల్ అమౌంట్. అంటే, ఒకవేళ మీరు టెస్లా కారును డెలివెరీకి ముందే వద్దనుకుంటే, కంపెనీ ఈ డబ్బును మీకు తిరిగి ఇవ్వదు. కంపెనీ, టెస్లా కారును బుక్ చేసుకున్నవాళ్లకు 2025 మూడవ త్రైమాసికం (Q3 2025) నుంచి టెస్లా ఈ కార్ల డెలివరీని ప్రారంభిస్తుంది. ప్రస్తుతం ఈ డెలివెరీలు ముంబై, దిల్లీ & గురుగావ్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
టెస్లా మోడల్ Y రెండు వేరియంట్లలో (Standard RWD & Long Range RWD)... స్టాండర్డ్ RWD వేరియంట్‌కు 60kWh LFP బ్యాటరీ ఇస్తున్నారు, ఇది ఫుల్ ఛార్జ్‌తో 500 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది. ఈ కారు దాదాపు 5.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు.
Tesla Model Y Long Range RWD వేరియంట్‌లో 75kWh NMC బ్యాటరీ అందిస్తున్నారు, ఇది ఫుల్ ఛార్జ్‌తో 622 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ ఇవ్వగలదని కంపెనీ వెల్లడించింది. ఈ SUV 5 సెకన్ల కంటే తక్కువ సమయంలో 0 నుంచి 100 kmph వరకు వేగవంతం చేయగలదు.
ఎన్ని రంగులలో లాంచ్ అవుతుంది?
భారతదేశంలో, టెస్లా మోడల్ Y ఆరు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. అవి - స్టెల్త్ గ్రే, పెర్ల్ వైట్ మల్టీ-కోట్, డైమండ్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ, క్విక్‌సిల్వర్ & అల్ట్రా రెడ్.
Stealth Grey కలర్ కారు కోసం అదనపు ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు.
Pearl White Multi-Coat & Diamond Black రంగుల కోసం అదనంగా రూ. 95,000 చెల్లించాలి.
Glacier Blue కోసం అదనంగా రూ. 1,25,000 చెల్లించాలి.
Quicksilver & Ultra Red వంటి ప్రీమియం కలర్స్ కోసం అదనంగా రూ. 1,85,000 చెల్లించాలి.
ఈ రంగులకు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా మంచి ప్రజాదరణ ఉంది, ఇవి భారతీయ వినియోగదారులకు ప్రీమియం అనుభూతిని ఇవ్వగలవు.





















