Honda CB125 Hornet కొనడానికి 3 కారణాలు, వదిలేయడానికి 2 కారణాలు - ఇక నిర్ణయం మీదే
Honda CB125 Hornet 125cc సెగ్మెంట్‌లో స్పోర్టీ లుక్ & పంచింగ్ పెర్ఫార్మెన్స్‌తో యువతను ఆకట్టుకుంటోంది. అయితే, కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి.

Honda CB125 Hornet Review October 2025: 125cc సెగ్మెంట్‌లో యువతను ఆకట్టుకోవడానికి బైక్ కంపెనీల మధ్య పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. TVS Raider, Hero Xtreme 125R, Bajaj Pulsar N125 తర్వాత ఇప్పుడు హోండా కూడా తన కొత్త బైక్ CB125 Hornet తో ఎంట్రీ ఇచ్చింది. ఇది కేవలం మైలేజ్ బైక్ మాత్రమే కాదు - స్పోర్టీ లుక్స్, ప్రీమియం ఫీల్ ఇచ్చే కమ్యూటర్. అయితే దీనిని కొనడం సబబేనా, కాదా?. కొనడానికి 3 కారణాలు, వదిలేయడానికి 2 కారణాలు కనిపిస్తున్నాయి.
Honda CB125 కొనడానికి 3 కారణాలు
ప్రీమియం లుక్ & బిల్డ్ క్వాలిటీ
హోండా CB125 హార్నెట్ రూపాన్ని చూస్తేనే ఇది పెద్ద స్టోర్ట్స్ బైక్‌ల మాదిరిగా కనిపిస్తుంది. అగ్రెసివ్ డిజైన్, మస్క్యులర్ ట్యాంక్, స్ట్రీట్‌ఫైటర్ లుక్ ఈ బైక్‌కు యూత్ టచ్ ఇచ్చాయి. ఫిట్ అండ్ ఫినిష్ విషయానికి వస్తే హోండా స్టాండర్డ్ స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కడా ప్యానెల్ గ్యాప్‌లు, సడలింపులు లేకుండా బలమైన నిర్మాణం ఉంది. ఎగ్జాస్ట్ సైజ్ పెద్దగానే ఉన్నా డిజైన్ బలంగా కనిపించేలా ఉంది.
పంచీ మిడ్ రేంజ్ పెర్ఫార్మెన్స్
ఈ బైక్‌లో 124cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 11hp పవర్, 11Nm టార్క్ ఇస్తుంది. సిటీలో తిరిగేటప్పుడు చాలా తేలికగా నడుస్తుంది. మిడ్ రేంజ్‌లో పంచీ టార్క్ ఉన్నందున ఓవర్‌టేక్ చేయడం సులభం. పెద్ద ట్రాఫిక్‌లో తిప్పుకోవడం కూడా సూపర్ ఈజీ. 4వ గియర్‌లోనూ 30kmph వద్ద సాఫ్ట్‌గా సాగిపోతుంది. గేర్ షిఫ్టింగ్ స్మూత్‌గా ఉండటంతో రైడింగ్ అనుభవం చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది.
సెగ్మెంట్‌లో ఫస్ట్ USD సస్పెన్షన్
ఈ బైక్ యునిక్ సెల్లింగ్ పాయింట్ (USP) ఏంటంటే - 37mm USD (Upside Down) ఫోర్క్ సస్పెన్షన్. ఇది 125cc సెగ్మెంట్‌లో ఫస్ట్. వెనుక వైపు ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఉంది. సిటీ రోడ్లలో గుంతలు, చిన్న కుదుపులను బాగా హ్యాండిల్ చేస్తుంది. దీనివల్ల బైక్ పెద్ద డిస్‌ప్లేస్‌మెంట్ మోడల్‌లా ఫీల్ ఇస్తుంది.
Honda CB125 కొనకుండా వదిలేయడానికి 2 కారణాలు
కంఫర్ట్ కొంచెం తక్కువ
USD ఫోర్క్ చూడటానికి బాగున్నా, పనితీరులో కొంచెం హార్డ్‌గా ఉంటుంది. పెద్ద స్పీడ్ బ్రేకర్లు లేదా లోతైన గుంతల్లో ముందు భాగం ట్రావెల్ పూర్తిగా దిగిపోయి బాటమ్ అవుతుంది. దీంతో హ్యాండిల్ బార్ మీదకు చిన్న కుదుపు వస్తుంది. కాబట్టి రఫ్ రోడ్లపై కొంచెం జాగ్రత్తగా నడపాలి.
వర్షంలో టైర్ గ్రిప్ బలహీనం
ఈ బైక్‌లో ఉన్న MRF టైర్లు డ్రై రోడ్లపై బాగానే పట్టు దొరకబుచ్చుకుంటాయి, మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తాయి. కానీ వర్షంలో మాత్రం వాటి గ్రిప్ తగ్గుతుంది. సిటీ రైడ్‌లో తేలికైన హ్యాండ్లింగ్ ఉన్నా, తడిచిన రోడ్ల మీద జాగ్రత్తగా రైడ్ చేయడం మంచిది, అజాగ్రత్తగా ఉంటే స్కిడ్ అవుతుంది.
హోండా CB125 హార్నెట్ రూపం, పనితీరు, నాణ్యంత అన్నీ ఇప్రెసివ్‌గా ఉన్నాయి. కానీ కంఫర్ట్ & టైర్ గ్రిప్ విషయంలో కొన్ని చిన్న లోపాలు ఉన్నాయి. స్పోర్టీ లుక్ & ప్రీమియం ఫీల్ కోరుకునే యువతకు ఇది మంచి ఆప్షన్. రఫ్ రోడ్లలో తరచూ రైడ్ చేసే వారికి కొంచెం సవాలుగా ఉంటుంది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే... "యూత్ స్పిరిట్ ఉన్నవారికి హోండా CB125 హార్నెట్ సరైన బైక్, కానీ కచ్చితంగా కంఫర్ట్ ఉండాలని కోరుకుంటే ఇంకో బైక్ గురించి ఆలోచించాలి. ఇక నిర్ణయం మీదే!".





















