అన్వేషించండి
Electric Bike Buy Vs Subscription: రోజూ అప్ అండ్ డౌన్ చేసే వాళ్లకు ఏది సరైన ఎంపిక?
EV Bike Subscription: ఎలక్ట్రిక్ బైక్/స్కూటర్ కొనడం మంచిదా?, లేక నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ద్వారా వాడుకోవడం మంచిదా?. ఏ ఆప్షన్ మీకు ఎక్కువ లాభం ఇస్తుందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.

ఉద్యోగులకు ఏది బెస్ట్ ఆప్షన్?
Source : https://x.com/
Best Way To Get A Electric Bike In 2025: గత సంవత్సరం (2024)తో పోలిస్తే ఈ ఏడాది చాలా కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లు, స్కూటర్లు మార్కెట్‌లోకి వచ్చాయి, కొనుగోలుదార్ల సంఖ్య కూడా పెరిగింది. సామాన్య ప్రజలు పెరిగిన పెట్రోల్ ధరల వాతలు తట్టుకోలేకపోవడం, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వడం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై అవగాహన పెరగడం వల్ల చాలామంది ప్రజలు పెట్రోల్ బండ్లను వదిలి ఎలక్ట్రిక్ బైక్‌లు, స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల, కొన్ని కంపెనీలు, ఎలక్ట్రిక్ బైక్ స్కూటర్‌లను సబ్‌స్క్రిప్షన్ అద్దెకు ఇస్తున్నాయి. ఇది, ఏదైనా OTT ఫ్లాట్‌ఫామ్‌ను సబ్‌స్క్రిప్షన్ చేసుకున్నట్లుగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో, ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సొంతంగా కొనాలా? లేక సబ్‌స్క్రిప్షన్ (Subscription)లో తీసుకుని తిరగాలా? అనేది చాలామందిలో ఉన్న ప్రశ్న. ఈ రెండు ఆప్షన్లలో, ఎవరికి ఏది మంచిదో తెలుసుకుందాం.
కొనుగోలు (Buying): స్కూటర్‌పై పూర్తి హక్కు
ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సొంతంగా కొనడానికి కాస్త ఎక్కువ పెట్టుబడి అవసరం. సగటున ఒక్కో స్కూటర్ ధర ₹90,000 నుంచి ₹1.50 లక్షల వరకు ఉంటుంది. అయితే FAME II సబ్సిడీ, రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు వంటివి లభించడంతో ఈ ధర కొంత తగ్గుతుంది. కొనుగోలు చేసిన తరువాత, మీరు దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వినియోగించుకోవచ్చు. రిజిస్ట్రేషన్, బీమా, బాటరీ మెయింటెనెన్స్ మొత్తం మీ ఆధీనంలో ఉంటుంది.
ప్రయోజనాలు:
- స్కూటర్ పూర్తిగా మీదే – సొంత హక్కుతో వినియోగం.
- మీరు కావాలనుకున్నప్పుడు తిరిగి అమ్ముకునే స్వేచ్ఛ.
- లాంగ్‌టర్మ్‌లో రెంటల్ ఖర్చులతో పోలిస్తే డబ్బు ఆదా.
- రెగ్యులర్ ప్రయాణాలు చేసే వారికీ ఇది లాభదాయకం.
సబ్‌స్క్రిప్షన్ (Subscription): తక్కువ ఖర్చుతో తాత్కాలిక పరిష్కారం
ఇప్పుడు మార్కెట్లో Bounce Infinity, Yulu Wynn, eBikeGo, Zypp వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను సబ్‌స్క్రిప్షన్ మోడల్‌లో (అద్దెకు) అందిస్తున్నాయి. నెలకు ₹3,000 నుంచి ₹6,000 మధ్య చెల్లించి మీరు స్కూటర్‌ను అద్దెకు తీసుకోవచ్చు. ఇందులో బాటరీ ఛార్జింగ్, బీమా, సర్వీసింగ్ అన్ని బాధ్యతలూ కంపెనీదే. మీరు ఒక్క రూపాయి కూడా డౌన్ పేమెంట్ లేకుండా మీ ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు.
ప్రయోజనాలు:
- పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు.
- బైక్ మెయింటెనెన్స్‌పై మీరు ఖర్చు చేయాల్సిన పని లేదు.
- తాత్కాలిక అవసరాలకు ఉపయోగపడుతుంది.
- కొత్త బైక్ కొనబోయే వాళ్లకు మొదటి మెట్టు.
ఎవరికి ఏది సరైన ఎంపిక?
- అద్దె ఇళ్లలో నివసించే వ్యక్తులు, విద్యార్థులు లేదా తాత్కాలిక ఉద్యోగులకు 'EV సబ్‌స్క్రిప్షన్' అనేది బెస్ట్ ఆప్షన్.
- స్థిర ఉద్యోగం, స్థిర నివాసం కలవారికి & ప్రయాణంలో ఎక్కువ సమయం గడిపే వాళ్లు సొంతంగా కొనుగోలు చేయడం ఉత్తమం.
- ట్రై చేద్దామనుకునే వాళ్లు — మొదటగా కొన్ని నెలల సబ్‌స్క్రిప్షన్ తీసుకుని, తర్వాత కొనుగోలు చేయొచ్చు.
ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయాలా లేదా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలా అనేది పూర్తిగా మీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ప్రయాణాలు చేయాలంటే కొనుగోలు చేయడం ఉత్తమం. తాత్కాలికంగా అవసరం ఉంటే సబ్‌స్క్రిప్షన్ సరైన ఎంపిక. ముఖ్యంగా, నెలవారీ ఖర్చులపై దృష్టి పెట్టే మధ్య తరగతి ప్రజలు ఈ రెండింటినీ బాగా ఆలోచించి సరైనది ఎంచుకోవాలి.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
పర్సనల్ ఫైనాన్స్
క్రైమ్
రాజమండ్రి
హైదరాబాద్



















