Subsidy On EV: పాత వాహనాన్ని EVగా మార్చుకుంటే 50 వేల వరకు సబ్సిడీ! స్కీమ్ పూర్తి వివరాలు ఇవే !
Subsidy On EV: ఢిల్లీ ప్రభుత్వం పాత పెట్రోల్ డీజిల్ కార్లను EVగా మార్చడానికి 50,000 సబ్సిడీ ఇవ్వనుంది. కాలుష్యం తగ్గించడమే లక్ష్యంగా ఈ స్కీమ్ తీసుకొచ్చింది.

Subsidy For Converting Old Cars Into EVs: ఢిల్లీ ప్రభుత్వం తన కొత్త ఎలక్ట్రిక్ వాహన పాలసీ 2.0 కింద ఒక కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైంది. ప్రభుత్వం ఇప్పుడు తమ పాత పెట్రోల్ లేదా డీజిల్ కారును స్క్రాప్ చేయడానికి బదులుగా ఎలక్ట్రిక్ వాహనంగా మార్చాలనుకునే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరుకుంటోంది. ఈ పథకం కింద మొదటి 1,000 వాహనాలను EVగా మార్చడానికి రూ. 50,000 వరకు సబ్సిడీ ఇవ్వాలని ప్రతిపాదించారు. రాజధానిలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించడం, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడమే ఈ ప్లాన్ ప్రధాన లక్ష్యం.
ప్రస్తుతం ప్రతిపాదన దశలో ఉన్న పథకం
నిజానికి, ఈ పథకం ప్రస్తుతం ప్రతిపాదన రూపంలో ఉంది. క్యాబినెట్ ఆమోదం పొందాల్సి ఉంది. ఆమోదం పొందిన తర్వాత, ఇది పబ్లిక్ డొమైన్‌లో ఉంచబోతున్నారు. తద్వారా సాధారణ ప్రజలు, ఇతర వాటాదారులు దీనిపై తమ అభిప్రాయాలను తెలియజేసే అవకాశం లభిస్తుంది. ఈ విధానం ద్వారా ఎక్కువ మంది ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు అడుగులు వేయాలని, పాత వాహనాల వల్ల కలిగే కాలుష్యం తగ్గించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
రెట్రోఫిట్టింగ్ అంటే ఏమిటి?
రెట్రోఫిట్టింగ్ అంటే పాత పెట్రోల్ లేదా డీజిల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చడం. ఈ ప్రక్రియలో కారు ఇంజిన్, ఫ్యూయల్ ట్యాంక్, ఇతర భాగాలను తొలగించి, వాటి స్థానంలో ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ, కంట్రోల్ సిస్టమ్‌లను అమర్చుతారు. దీనితో కారు పూర్తిగా ఎలక్ట్రిక్‌గా మారుతుంది. పొగను విడుదల చేయకుండా నడుస్తుంది. దీని ప్రయోజనం ఏమిటంటే, ప్రజలు తమ పాత కారును వాడుకలో ఉంచుకోవచ్చు. కొత్త కారు కొనుగోలు ఖర్చును కూడా ఆదా చేసుకోవచ్చు.
రెట్రోఫిట్టింగ్‌పై ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు?
కొత్త కారు కొనకుండానే కాలుష్యాన్ని తగ్గించవచ్చని, కాబట్టి రెట్రోఫిట్టింగ్ ఒక మంచి ప్రత్యామ్నాయమని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఇప్పటివరకు ఈ ప్రక్రియ చాలా ఖరీదైనది కావడంతో అంతగా ప్రాచుర్యం పొందలేదు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, ఢిల్లీ ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలని ఆలోచిస్తోంది, తద్వారా సాధారణ ప్రజలకు ఈ మార్పు సులభంగా, చౌకగా మారుతుంది.
ముందుకు ఉన్న పథకం ఏమిటి?
రాబోయే కాలంలో ప్రభుత్వం ఈ రంగంలో పరిశోధన, అభివృద్ధిపై పెట్టుబడులను కూడా పెంచవచ్చు. అలాగే, రెట్రోఫిట్టింగ్‌కు సంబంధించిన నిపుణులను సంప్రదించే అవకాశం ఉంది. దానిని సురక్షితంగా, ప్రమాణాలకు అనుగుణంగా కారులను ఈవీలుగా మార్చేందుకు వీలు కలుగుతుందని భావిస్తోంది ప్రభుత్వం. ఈ పథకం అమలు అయితే, ఢిల్లీ EVని స్వీకరించడంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించే అవకాశం ఉంది. దేశంలోని మిగతా దేశాలకు ఆదర్శంగా మారబోతోంది.





















