2024 March Cars: మార్చిలో మార్కెట్లోకి వచ్చిన కార్లు ఇవే - హ్యుందాయ్, బీవైడీ, టాటా కార్లు కూడా!
Auto News: 2024 మార్చిలో ఎన్నో కార్లు లాంచ్ అయ్యాయి.
2024 March Launched Cars: మార్చిలో హ్యుందాయ్, బీవైడీ, లెక్సస్ వంటి బ్రాండ్ల నుంచి అనేక పెద్ద లాంచ్‌లు జరిగాయి. టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. ఇది కాకుండా గత నెలలో ఫోక్స్‌వ్యాగన్, సిట్రోయెన్, ఆడి కూడా కొత్త మోడళ్లను ఆవిష్కరించాయి. 2024 మార్చిలో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన కార్లు ఇవే.
1. హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్
హ్యుందాయ్ తన క్రెటా ఎన్ లైన్‌ను గత నెలలో ప్రవేశపెట్టింది. ఇది అప్‌డేట్ చేసిన ఫాసియా, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌పై రెడ్ కలర్ హైలైట్స్, ఎన్ లైన్ స్పెసిఫిక్ అల్లాయ్ వీల్స్, స్టీరింగ్ వీల్‌ను పొందుతుంది. ఇది 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ (160 పీఎస్/253 ఎన్ఎం), 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పెయిర్ అయింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 16.82 లక్షల నుంచి రూ. 20.45 లక్షల మధ్య ఉంది.
2. బీవైడీ సీల్
రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ మార్కెట్లోకి వచ్చింది. 61.44 కేడబ్ల్యూహెచ్, 82.56 కేడబ్ల్యూహెచ్ రియర్ వీల్ డ్రైవ్ (ఆర్‌డబ్ల్యూడీ), ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్‌లతో సహా మూడు పవర్‌ట్రైన్ ఆప్షన్లతో లాంచ్ అయింది. ఇది 650 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది. అయితే టాప్ ఆఫ్ లైన్ వేరియంట్ నాలుగు సెకన్లలోపు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని పేర్కొంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 41 లక్షల నుంచి రూ. 53 లక్షల మధ్య ఉంది.
3. టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్
టాటా నెక్సాన్ మిడ్ స్పెక్ క్రియేటివ్ వేరియంట్‌తో ప్రారంభించి పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లతో డార్క్ ట్రీట్‌మెంట్‌ను కూడా పొందింది. అయితే నెక్సాన్ ఈవీ డార్క్ ఎడిషన్ టాప్ స్పెక్ ఎంపవర్డ్ ప్లస్ లాంగ్ రేంజ్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. నెక్సాన్ డార్క్ ఎడిషన్ ధర రూ. 11.45 లక్షల నుంచి రూ. 15.80 లక్షల వరకు ఉంది. ఇక నెక్సాన్ ఈవీ డార్క్ ఎడిషన్ ధర రూ. 19.49 లక్షల వరకు ఉంది.
4. లెక్సస్ ఎల్ఎం
లెక్సస్ ఎల్ఎం అనేది టయోటా వెల్‌ఫైర్ ఆధారిత లగ్జరీ ఎంపీవీ. ఇది 2024 మార్చిలో భారతదేశంలో లాంచ్ అయింది. ఇది రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఎల్ఎం 350హెచ్ (7 సీటర్), ఎల్ఎం 350హెచ్ (4 సీటర్). దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల మధ్య ఉంది.
5. ఫోక్స్‌వ్యాగన్ ఐడీ.4
ఫోక్స్‌వ్యాగన్ ఐడీ.4 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను పొందుతుంది. 52 కేడబ్ల్యూహెచ్, 77 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్లతో ఈ కారు మార్కెట్లో లాంచ్ అయింది. ఇది 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను అందించనుంది. ప్రస్తుతం గ్లోబల్ లాంచ్ అయిన ఈ కారు 2024 చివరి నాటికి భారతదేశంలో లాంచ్ అవుతుందని అంచనా.
6. ఫోక్స్‌వ్యాగన్ వర్ట్యూస్ జీటీ ప్లస్
ఫోక్స్‌వ్యాగన్ వర్ట్యూస్ కొత్త జీటీ ప్లస్ స్పోర్ట్ వేరియంట్‌ను కూడా పొందుతుంది. 2024లో దీన్ని రివీల్ చేశారు. ప్రస్తుతానికి దీన్ని ఒక ఈవెంట్‌లో కాన్సెప్ట్‌గా మాత్రమే ప్రదర్శించారు. ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌లో అదే బ్లాక్, రెడ్ హైలైట్స్ ఉన్నాయి.
7. సిట్రోయెన్ బసాల్ట్
సిట్రోయెన్ ఇంకా బసాల్ట్ ఇంటీరియర్, పవర్‌ట్రెయిన్ వివరాలను వెల్లడించలేదు. కానీ కారును మాత్రం రివీల్ చేసింది. అయితే ఇది సీ3 ఎయిర్‌క్రాస్ లాగా అదే 110 పీఎస్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. బసాల్ట్ భారతదేశంలో 2024 ద్వితీయార్థంలో లాంచ్ కానుంది.
8. ఆడీ క్యూ6 ఈ-ట్రాన్
గ్లోబల్ స్పెక్ క్యూ6 ఈ-ట్రాన్‌లో 94.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ అందించారు. ఇది 625 కిలోమీటర్ల రేంజ్‌ను అందించగలదు. ఇందులో ఆల్ వీల్ డ్రైవ్ (AWD) డ్రైవ్‌ట్రెయిన్‌ను ప్రామాణికంగా అందిస్తున్నారు. ఆడీ క్యూ6 ఈ-ట్రాన్ భారతదేశంలో 2025లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.