Car Loan Interest Rates: వివిధ బ్యాంకుల్లో కార్ లోన్ వడ్డీ రేట్లు ఇవే - 8% నుంచి స్టార్ట్ - కొత్త కారు కొనేవాళ్లకు గోల్డెన్ ఛాన్స్!
Bank Car Loan Schemes: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ బ్యాంకులు తమ కస్టమర్లకు పోటీ వడ్డీ రేట్లు, సౌకర్యాలు, ఎప్పటికప్పుడు కొన్ని ప్రత్యేక ఆఫర్లు కూడా అందిస్తున్నాయి.

Car Loan Offers Interest Rates August 2025: రెపో రేటు తగ్గిన నేపథ్యంలో, వివిధ పెద్ద బ్యాంకులు కార్ లోన్‌లపై తక్కువ వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. ఈ పండుగ సీజన్‌లో కొత్త కారును ఇంటికి తెచ్చుకోవాలనుకునే తెలుగు ప్రజలకు ఇది మంచి అవకాశం. ప్రస్తుతం, కార్ లోన్ వడ్డీ రేట్లు 8% నుంచి 16% వరకు ఉన్నాయి.
ప్రస్తుతం, తెలంగాణ & ఆంధ్రప్రదేశ్‌లో ఆటోమొబైల్ మార్కెట్ కళకళలాడుతోంది. దసరా నాటికి కొత్త కారు లేదా బైకు లేదా స్కూటర్ వంటివి కొనేవాళ్లతో షోరూమ్‌ల్లో రష్ పెరుగుతోంది. ఈ రెండు తెలుగు ప్రాంతాలకు అనుగుణంగా బ్యాంకులు ప్రత్యేక ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. ముఖ్యంగా, కస్టమర్ క్రెడిట్ హిస్టరీ బాగుంటే కనీస వడ్డీ రేటుకే లోన్ అందజేస్తున్నాయి. కొత్త & రీ-యూజ్డ్ (సెకండ్ హ్యాండ్) కార్ల విషయంలో వడ్డీ రేట్లు వేరుగా ఉండవచ్చు. సాధారణంగా, కొత్త కార్లపై తక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి, 'వడ్డీ రేటు మరీ ఎక్కువేం కాదు' అని కస్టమర్ భావించేలా ఉంటాయి.
2025 ఆగస్టు నెలలో, కార్ లోన్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీ రేట్లు ఇవి:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): కొత్త కార్లకు వడ్డీ రేట్లు 8.65% నుంచి 9.45% వరకు ఉంటాయి. గ్రీన్ కార్ల (విద్యుత్ కార్ల) కోసం 8.60% నుంచి 9.30% వరకు వడ్డీ ఉంటుంది.
HDFC బ్యాంక్: కొత్త కార్లపై వడ్డీ రేట్లు సుమారు 9.40% నుంచి ప్రారంభమవుతాయి. ప్రాసెసింగ్ ఛార్జీలు 0.5% వరకు ఉంటాయి.
ICICI బ్యాంక్: కస్టమర్ క్రెడిట్ స్కోర్ & కార్ మోడల్ ఆధారంగా వడ్డీ రేట్లు 9.15% నుంచి 10.25% మధ్య ఉంటాయి. యూజ్డ్ కార్లు (సెకండ్ హ్యాండ్) విషయంలో వడ్డీ రేట్లు 11.25% నుంచి ప్రారంభవుతాయి.
Axis బ్యాంక్: కొత్త కార్ల కోసం వడ్డీ రేట్లు 8.80% నుంచి 11.80% మధ్య ఉంటాయి. యూజ్డ్ కార్ల కోసం వడ్డీ రేట్లు 13.55% నుంచి 15.80% వరకు ఉంటాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB): కొత్త కార్ల కోసం 8.90% నుంచి 9.70% మధ్య వడ్డీ రేట్లు అందిస్తోంది.
కెనరా బ్యాంక్: వడ్డీ రేట్లు సుమారు 8.05% నుంచి ప్రారంభమవుతాయి.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI): వడ్డీ రేట్లు 7.70% నుంచి ప్రారంభమవుతాయి.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BoM): వడ్డీ రేట్లు 7.70% నుంచి 12% మధ్య ఉంటాయి.
వడ్డీ రేట్లు వినియోగదారుల క్రెడిట్ స్కోర్, ఆదాయం, రుణ వ్యవధి, ఇతర వ్యక్తిగత పరిస్థితులు, బ్యాంక్ పాలసీ ఆధారంగా మారవచ్చు. కనీస వడ్డీ రేటుకు అర్హత సాధించడానికి బ్యాంక్ ఆశించిన మంచి క్రెడిట్ స్కోర్ అవసరం.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ బ్యాంకులే కాదు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు (NBFCs) కూడా పోటీ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. గత కొన్ని నెలల్లో డిజిటల్ లోన్ అప్లికేషన్ ఫెసిలిటీలు (ఆన్‌లైన్), తక్కువ డాక్యుమెంటేషన్ అవసరం వంటి ఆఫర్లను కూడా ప్రవేశపెట్టాయి. ఈ పండుగ సమయంలో కొన్ని ఆటోమొబైల్ కంపెనీలు మంచి డిస్కౌంట్లు, ఆఫర్లను కూడా అందిస్తున్నాయి. తక్కువ వడ్డీ రేట్లు, కంపెనీలు అందించే ఆఫర్‌లు కలుపుకుంటే.. కార్ లేదా టూవీలర్ లోన్ తీసుకోవడానికి ఇదే సరైన సమయం అవుతుంది.




















