ఎలక్ట్రిక్ కార్ల వేగంతో వెలిగిపోయిన 2025: Harrier EV, VinFast, BYD, Cyberster దూకుడు
2025లో ఎలక్ట్రిక్ కార్లు ఒక కొత్త మైలురాయిని దాటి నవశకంలోకి అడుగుపెట్టాయి. Harrier EV, VinFast VF7, BYD Sealion 7, MG Cyberster లాంటి కార్లు వేగం, పనితీరు, లగ్జరీకి కొత్త అర్థం చెప్పాయి.

Best Electric Cars 2025: 2025 సంవత్సరం భారత ఆటోమొబైల్ రంగంలో, ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో, ఒక మైలురాయిగా నిలిచింది. ఇంతకాలం వరకు “పర్యావరణానికి మేలు చేసే వాహనం” అనే కోణంలో మాత్రమే చూసిన EVలను, ఈ ఏడాది పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లింది. వేగం, పనితీరు, లగ్జరీ, టెక్నాలజీ అన్నింటినీ ఒకే చోట చూపిస్తూ, 2025 సంవత్సరం, ఎలక్ట్రిక్ కార్లపై ప్రజలకున్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది.
వేగమే కొత్త గుర్తింపు
ఈ ఏడాది విడుదలైన ఎలక్ట్రిక్ కార్లను చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇవి ఇకపై కేవలం ఇంధన పొదుపు కోసం మాత్రమే కాదు. పెట్రోల్, డీజిల్ కార్లతో పోల్చి చూసినా వేగం విషయంలో వెనుకబడకుండా ముందుకు దూసుకెళ్తున్నాయి. కొన్ని మోడళ్లు అయితే సూపర్‌కార్ల స్థాయి పెర్ఫార్మెన్స్‌ను కూడా అందించాయి.
స్పోర్ట్స్ కార్లు, SUVల దూకుడు
ఈ ఏడాది EV ప్రపంచంలో ఎక్కువ చర్చకు వచ్చిన మోడల్ MG Cyberster. ఫ్యూచరిస్టిక్ డిజైన్, పైకి లేచే డోర్లు, అగ్రెసివ్ లుక్స్‌తో, రోడ్డు మీదకు రాగానే అందరి చూపూ తనపైనే పడేలా చేసిందిది. ధర పరంగా కూడా సూపర్ కార్లతో పోలిస్తే చాలా తక్కువలో లభించడం వల్ల, ఇది భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ కార్లలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పనితీరు పరంగానూ Cyberster నిరాశపరచలేదు.
Harrier EVతో Tata కొత్త అధ్యాయం
Tata Motors తీసుకొచ్చిన Harrier EV 2025లో మరో పెద్ద హైలైట్. డ్యూయల్ మోటార్ సెటప్‌తో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ SUV, ఈ ధర శ్రేణిలోనే అత్యంత వేగవంతమైన వాహనాల్లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా AWD సిస్టమ్‌తో Tata చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఆల్ వీల్ డ్రైవ్‌ను తీసుకురావడం ఆటోమొబైల్ ప్రియులను ఆకట్టుకుంది. ఆఫ్‌రోడ్ సామర్థ్యం కూడా పెరగడంతో Harrier EV ఒక పూర్తి స్థాయి పనితీరు SUVగా మారింది.
VinFast ఎంట్రీతో పోటీ పెరిగింది
భారత మార్కెట్లో కొత్తగా అడుగుపెట్టిన VinFast కూడా 2025లో EV వేడి పెంచింది. VF7 మోడల్‌తో ఈ బ్రాండ్ నేరుగా ప్రీమియం SUV విభాగంలోకి దూసుకువచ్చింది. డ్యూయల్ మోటార్ కాన్ఫిగరేషన్, శక్తిమంతమైన పనితీరు, ప్రత్యేకమైన డిజైన్ VF7ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ప్రీమియం SUV ధరలోనే డ్యూయల్ మోటార్ EV కావడం దీనికి పెద్ద ప్లస్ అయ్యింది.
BYD లగ్జరీ స్థాయి ప్రమాణాలు
BYD భారత్‌లో నిశ్శబ్దంగా ఉంటున్నా తన ఉనికిని బలంగానే పెంచుకుంటూ వచ్చింది. Sealion 7 లాంటి మోడల్‌తో లగ్జరీ ఎలక్ట్రిక్ SUVల స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. నాణ్యత, వేగం, డ్రైవింగ్ ఫీల్ విషయంలో ఇది చాలా ఖరీదైన లగ్జరీ SUVలకు గట్టి పోటీ ఇచ్చింది. డ్యూయల్ మోటార్ వేరియంట్ సైజ్, బరువు ఎక్కువగా ఉన్నప్పటికీ డ్రైవింగ్‌లో మజా తగ్గకుండా చూసింది.
EVల భవిష్యత్‌కు దిశానిర్దేశం
మొత్తానికి, 2025 సంవత్సరం, ఎలక్ట్రిక్ కార్లను “కాంప్రమైజ్ వెహికల్స్” అనే ముద్ర నుంచి బయటకు తీసుకువచ్చింది. వేగం, టెక్నాలజీ, లగ్జరీ, పెర్ఫార్మెన్స్ అన్నింటినీ కలిపి EVలు కూడా నిజమైన డ్రైవర్ కార్లే అని నిరూపించింది. రాబోయే సంవత్సరాల్లో భారత రోడ్లపై ఇంకా వేగవంతమైన, శక్తిమంతమైన ఎలక్ట్రిక్ కార్లు కనిపించబోతున్నాయన్న సంకేతాలను 2025 స్పష్టంగా ఇచ్చింది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















