New Honda Amaze: సూపర్ ఫీచర్లతో రానున్న కొత్త హోండా అమేజ్ - ఈసారి ఆ టాప్ సేఫ్టీ ఫీచర్ కూడా!
New Honda Amaze: కొత్త హోండా అమేజ్ కారు ఏడీఏఎస్ ఫీచర్‌తో మార్కెట్లో లాంచ్ కానుంది.
2024 Honda Amaze: హోండా కార్స్ ఇండియా రాబోయే మూడేళ్లలో ఐదు కొత్త ఎస్‌యూవీలను లాంచ్ చేయడం ద్వారా తన భారతీయ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను విస్తరించే ప్రణాళికలను వెల్లడించింది. ఈ కార్యక్రమాన్ని హోండా ఎలివేట్ మిడ్ సైజ్ ఎస్‌యూవీతో ప్రారంభించింది. ఈ ప్లాన్‌లో కొత్త సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ, ఎలివేట్ ఎలక్ట్రిక్ మోడల్ కూడా ఉన్నాయి. అదనంగా కంపెనీ CBU (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్లు), CKD (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) మార్గాల ద్వారా తన గ్లోబల్ ప్రీమియం ఆఫర్‌ను మనదేశంలో లాంచ్ చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది. ప్రస్తుతం హోండా అమేజ్ సబ్ కాంపాక్ట్ సెడాన్, సిటీని పెట్రోల్, హైబ్రిడ్ ఇంజిన్లతో భారత మార్కెట్లో విక్రయిస్తోంది.
డిజైన్ ఇలా...
దాదాపు ఐదు సంవత్సరాలుగా హోండా లైనప్‌లో వెటరన్ మోడల్‌గా ఉన్న హోండా అమేజ్ ఈ సంవత్సరం తన మూడో తరం మోడల్‌ను పొందనుంది. భారతీయ మార్కెట్‌కు సంబంధించిన అధికారిక లాంచ్ టైమ్ లైన్ వెల్లడి కానప్పటికీ ఈ సెడాన్ సరికొత్త మోడల్ 2024లో వస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. కొత్త 2024 హోండా అమేజ్‌లో అతిపెద్ద మార్పు దాని డిజైన్. ఇది ఎలివేట్‌ను పోలి ఉంటుంది. హోండా గ్లోబల్ మోడల్ డిజైన్ కొత్త అకార్డ్ నుంచి ఇన్‌స్పిరేషన్ పొందవచ్చని భావిస్తున్నారు. ఇందులో సిటీ సెడాన్ అంశాలు కూడా చేర్చనున్నారు.
ఫీచర్లు ఎలా ఉన్నాయి?
కొత్త 2024 హోండా అమేజ్ ఇంటీరియర్ దాని మునుపటి మోడల్ కంటే మరింత అధునాతనంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే కనెక్టివిటీతో కూడిన ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కూడిన కొత్త ఇంటీరియర్ లేఅవుట్‌ను పొందుతుందని భావిస్తున్నారు. కొత్త మోడల్ హోండా సెన్సింగ్ సూట్, దాని ఏడీఏఎస్‌తో రానుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ అలర్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ హై బీమ్ అసిస్ట్, రోడ్ డిపార్చర్ అలర్ట్, కొలిషన్ మిటిగేషన్ సిస్టమ్ వంటి ఫీచర్లతో రావచ్చని భావిస్తున్నారు.
ఏ ఇంజిన్ ఉండనుంది?
కొత్త అమేజ్ ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్ 4 సిలిండర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో రానుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది 5 స్పీడ్ మాన్యువల్, సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పెయిర్ కానుంది. ఈ ఇంజన్ 90 బీహెచ్‌పీ పవర్, 110ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హోండా స్పష్టంగా ఎస్‌యూవీ, ఈవీ విభాగాలపై తన దృష్టిని కేంద్రీకరించింది. కంపెనీ ప్రస్తుతం డీజిల్ మార్కెట్లోకి మళ్లీ ప్రవేశించడానికి లేదా హైడ్రోజన్ ఇంధన ఆప్షన్లను ఎక్స్‌ప్లోర్ అవ్వడానికి ప్లాన్ చేయడం లేదు.
మరోవైపు మారుతి సుజుకి అరేనా, నెక్సా సిరీస్‌ల డీలర్‌షిప్‌లలో తన కార్ల ధరలను మార్చింది. అప్‌డేట్ చేసిన ధరల గురించిన సమాచారం ఇటీవలే బయటకు వచ్చింది. డెల్టా స్మార్ట్ హైబ్రిడ్ ఏటీ, జీటా స్మార్ట్ హైబ్రిడ్ ఏటీ, ఆల్ఫా స్మార్ట్ హైబ్రిడ్ ఏటీ, ఆల్ఫా డ్యూయల్ టోన్ స్మార్ట్ హైబ్రిడ్ ఏటీ సహా మారుతి గ్రాండ్ విటారా సెలెక్టెడ్ వేరియంట్ల ధరలలో ఎటువంటి మార్పు లేదు. అయితే మిగతా అన్ని ఇతర వేరియంట్‌లు అన్నీ రూ.10,000 వరకు పెరిగాయి.