ZPTC MPTC Results In AP: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇలాకాలో ఎగిరిన టీడీపీ జెండా.. బాణాసంచా కాల్చి తెలుగు తమ్ముళ్ల సంబరాలు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతోంది. టీడీపీ అక్కడక్కడా తన ఉనికి చాటుకుంది.
ఏపీలో నేడు జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతోంది. అయితే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అక్కడక్కడా తన ఉనికి చాటుకుంది. వాస్తవానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ ఎన్నికలను బహిష్కరించినా చాలా చోట్ల ఆ పార్టీ అభిమానులు, నాయకులు, మద్దతుదారులు నామినేషన్లు వేశారు. ఈ ఎన్నికలను టీడీపీ బహిష్కరించినట్లు పార్టీ అధిష్టానం సైతం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా కొనసాగగా.. అక్కడక్కడా టీడీపీ అభ్యర్థులను విజయం వరించింది. కొన్నిచోట్ల టీడీపీ సంబరాల్లో మునిగిపోయింది.
నెల్లూరు జిల్లాకు చెందిన ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సొంత నియోజకవర్గం ఆత్మకూరులో మొత్తం ఆరు జడ్పీటీసీ స్థానాలకుగానూ అన్ని చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఇక ఎంపీటీసీ స్థానాల్లోనూ వైసీపీ సత్తా చాటింది. ఆత్మకూరు నియోజకవర్గంలో మొత్తం 67 ఎంపీటీసీ స్థానాలుండగా.. ఏకగ్రీవాలతో కలిపి మొత్తం 61 స్థానాల్లో వైసీపీ గెలుపొందింది. మిగిలిన ఆరు స్థానాల్లో టీడీపీ గెలిచింది.
Also Read: వైసీపీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది.. ఈ ఫలితాలే నిదర్శనం: పెద్దిరెడ్డి
మంత్రి మేకపాటి ఇలాకాలో ఎగిరిన టీడీపీ జెండా
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సొంత మండలం మర్రిపాడులో కూడా టీడీపీ జెండా ఎగరడం విశేషం. మర్రిపాడు మండలంలో మొత్తం 7 ఎంపీటీసీ స్థానాలుండగా చిన మాచనూరులో మాత్రం టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. అది కూడా మంత్రి సొంత మండలం మర్రిపాడులో టీడీపీ అక్కడ ఒక ఎంపీటీసీ స్థానాన్ని గెలుచుకున్నట్లయింది. ఇతర చోట్ల ఓడిపోయామన్న బాధ కంటే ఇలాంటి చోట్ల గెలుపు టీడీపీ శ్రేణులలో ఉత్సాహాన్ని నింపింది. కాగా, కొన్ని జిల్లాల్లో ఫలితాలలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.
Also Read: AP Elections: టీడీపీ తప్పుకోవడం పెద్ద డ్రామా.. దుష్ట ప్రయత్నాలు ఫలించలేదు: సజ్జల, అంబటి ఫైర్
టీడీపీ శ్రేణుల సంబరాలు..
చిన మాచనూరు పంచాయతీలో టీడీపీ మద్దతుదారు తమటం బాల గురవమ్మ ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. నేటి ఓట్ల లెక్కింపులో 477 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థిపై ఆమె గెలుపొందారు. ఈ సందర్భంగా చినమాచనూరులో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. మంత్రి గౌతమ్ రెడ్డి సొంత మండలంలో టీడీపీ అభ్యర్థి గెలవడంతో పార్టీ నేతలు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. టీడీపీ తరపున గెలిచిన బాల గురవమ్మను జిల్లా నేతలు అభినందించారు. పార్టీ అధిష్టానం ఎన్నికలను బహిష్కరించకపోతే టీడీపీ మరిన్ని స్థానాల్లో విజయం సాధించేదని పార్టీ స్థానిక నేతలు అంటున్నారు.