Parliament Special Session: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో 5 డిమాండ్లు చేయనున్న వైసీపీ
Parliament Special Session: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రధానమైన డిమాండ్లను ముఖ్యంగా ప్రస్తావిస్తామని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు.
Parliament Special Session:
రాజమండ్రి/ఢిల్లీ: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రధానమైన డిమాండ్లను ముఖ్యంగా ప్రస్తావిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి 23 వ తేదీ వరకూ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయని తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో కేంద్రం సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఈ సమావేశం అనంతరం వైసీపీ ఎంపీ మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతూ సోమవారం నుంచి అయిదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు కొత్తగా నిర్మించిన లోక్‌సభ భవనంలో కొనసాగనున్నాయని తెలిపారు. డెబ్బై అయిదేళ్ళ భారత పార్లమెంటు ప్రయాణంపై ప్రత్యేక చర్చే అజెండా అని కేంద్రం చెబుతున్నా, మా వైసీపీకి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక అంశాలను కేంద్రం దృష్టికి తీసుకు రావడం అజెండాగా పెట్టుకున్నామని చెప్పారు.
ఇందులో మహిళా రిజర్వేషన్ బిల్లు, బీసీ బిల్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో ప్రస్తావించిన అంశాలను అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేబోతున్నట్టు ఎంపీ భరత్ తెలిపారు. ఈ సర్వసభ్య సమావేశంలో లోక్‌సభ ఉపనేత, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రాజ్యసభలో సభా నాయకుడు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ప్రభుత్వం తరపున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, అలాగే వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి, పార్టీ పార్లమెంటరీ చీఫ్ గా తాను, కాంగ్రెస్, డీఎంకే, జేడీ (ఎస్), టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, జేడీ (యూ), ఎస్పీలకు చెందిన ప్రతిపక్ష నేతలు పాల్గిన్నట్టు ఎంపీ భరత్ తెలిపారు.