YSRCP 6th List: వైసీపీ 6వ జాబితా విడుదల, ఇంఛార్జ్‌లుగా 10 మందికి అవకాశం
YSRCP Cadidates 6th List: వైఎస్సార్ సీపీ ఇంఛార్జ్‌ల 6వ జాబితా విడుదల చేసింది. 6 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జ్‌లను ప్రకటించింది.
YSRCP 6th List: అమరావతి: వైనాట్ 175 అంటున్న అధికార పార్టీ వైఎస్సార్ సీపీ (YSRCP) ఇదివరకే 5 జాబితాలు విడుదల చేయగా.. తాజాగా 6వ జాబితా విడుదల చేసింది. 6 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జ్‌ల పేర్లతో శుక్రవారం మరో జాబితా (YSRCP new incharges) విడుదల చేసింది వైసీపీ.
లోక్‌సభ స్థానాలకు ఇంఛార్జీలు..
- రాజమహేంద్రవరం - గూడూరి శ్రీనివాస్
- నర్సాపురం - అడ్వకేట్ గూడూరి ఉమాబాల
- గుంటూరు - ఉమ్మారెడ్డి వెంకటరమణ
- చిత్తూరు (ఎస్సీ) - ఎన్.రెడ్డప్ప
అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జీలు
- మైలవరం - సర్నాల తిరుపతిరావు యాదవ్
- మార్కాపురం - అన్నా రాంబాబు
- గిద్దలూరు - కె. నాగార్జున రెడ్డి
- నెల్లూరు సిటీ - ఎండీ. ఖలీల్ (డిప్యూటీ మేయర్)
- జీడీ. నెల్లూరు - కె.నారాయణస్వామి
- ఎమ్మిగనూరు - బుట్టా రేణుక
సీఎం జగన్‌ను కలిసిన మైలవరం నూతన ఇంఛార్జ్..
మైలవరం నూతన వైసీపీ అభ్యర్థిగా స్వర్ణాల తిరుపతిరావు పేరు ప్రకటించారు. అనంతరం స్వర్ణాల తిరుపతిరావు సీఎం జగన్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. మైలవరంలో జోగి రమేష్ వ్యూహం ఫలించింది. ఈ స్థానంలో ఇప్పటిదాకా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే టికెట్ ఇస్తున్న పార్టీలు.. కానీ మొదటి సారిగా యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికి వైసీపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. అందులోనూ ఆర్థిక స్తోమత లేని వ్యక్తికి వైసీపీ అధినేత జగన్ టికెట్ ఇచ్చారు.
జగన్ నినాదం వైనాట్ 175..
అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ విజయం సాధించి ప్రభంజనం సృష్టించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఆ విధంగా ప్రయత్నిస్తేనే భారీ స్థానాల్లో ఫ్యాన్ పార్టీ విజయం సాధిస్తుందని వ్యూహాలు రచిస్తున్నారు. వైనాట్ 175 అంటూ వీలున్నచోటల్లా రాష్ట్ర మంత్రులు, వైసీపీ నేతలు చెబుతూనే ఉన్నారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే సిద్ధంగా ఉన్న వైసీపీ అధినేత జగన్ సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఇంఛార్జ్‌లను ప్రకటిస్తున్నారు. ఇదివరకే 5 జాబితాలు ప్రకటించగా, శుక్రవారం రాత్రి 6వ జాబితా విడుదల చేశారు.
జాబితాల వారీగా ఎంత మందికి ఛాన్స్ ఇచ్చారంటే...
ఇంఛార్జ్‌ల తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇంఛార్జిలను జగన్ నిర్ణయించారు. రెండో జాబితాలో మరో 27 స్థానాలకు (మూడు ఎంపీ, 24 అసెంబ్లీ), మూడో జాబితాలో 21 స్థానాలకు (ఆరు ఎంపీ, 15 అసెంబ్లీ), నాలుగో లిస్టులో ఎనిమిది స్థానాలకు (ఒక ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ) ఇంఛార్జీలను ప్రకటించారు. ఇటీవల విడుదల చేసిన ఐదో జాబితాలో ఏడు స్థానాలకు (3 అసెంబ్లీ, 4 ఎంపీ) కొత్త ఇంఛార్జిలను నియమించారు. 6వ జాబితాలో నాలుగు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జిలను ప్రకటిస్తూ వైసీపీ జాబితా విడుదల చేసింది.