Peddireddy Ramachandra Reddy: సీఎం ఇలాకాలో మంత్రి పెద్దిరెడ్డి మీటింగ్, వై ఏపీ నీడ్స్ జగన్ నిర్వహణపై సమీక్ష
Peddireddy Ramachandra Reddy: కడప జిల్లాలో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం పర్యటించారు.
Peddireddy Ramachandra Reddy: కడప జిల్లాలో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా కడప, అన్నమయ్య జిల్లాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంచార్జ్‌లు, నియోజకవర్గ పరిశీలకులు, కార్పొరేషన్ చైర్ పర్సన్లతో ఆయన సమవేశం అయ్యారు. త్వరలో చేపట్టనున్న సామాజిక న్యాయ బస్సు యాత్ర - వై ఏపీ నీడ్స్ జగన్ నిర్వహణపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మట్లాడుతూ.. సామాజిక న్యాయ బస్సు యాత్ర - వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం మొదటి విడతలో ఏడు రాయలసీమ జిల్లాల్లో ఏడు చోట్ల బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు. కడప జిల్లాలో ప్రొద్దుటూరు, అన్నమయ్య జిల్లాలె తంబళ్లపల్లె నియోజకవర్గంలో మొదట విడుతలో బస్సు యాత్ర జరుగుతుందన్నారు. ఈ బస్సు యాత్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం ఉద్దేశించినదని, వక్తలు అందరూ ఆయా సామాజికవర్గానికి చెందిన నాయకులే ఉంటారని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అన్ని వర్గాలకు ఏ స్థాయిలో మేలు జరిగిందో చెప్పడమే యాత్ర ఉద్దేశం అన్నారు. యాత్ర విజయవంతం అవడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ బస్సు యాత్ర ఈ నెల 26 ప్రారంభమవుతుందని, అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో యాత్ర జరుగుతుందని చెప్పారు. బస్సు యాత్రలో భాగంగా ఆయా నియోజకర్గాల్లోని ఆయా సామజిక వర్గాలకు చెందిన స్థానిక నేతలను కలుస్తామని, వారి కష్టాలు, సమస్యలు తెలుకుంటామన్నారు. అలాగే ప్రభుత్వం ఆయా వర్గాల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించనున్నట్లు చెప్పారు. యాత్రలో భాగంగా 10 వేల మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమ నిర్వహణ ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల చేతుల్లో ఉంటుందన్నారు. ఈ బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని, ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో యాత్ర సాగుతుందన్నారు.
రాష్ట్రంలో 175 నియోజకర్గాల్లో ఈ బస్సు యాత్ర నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. రాయలసీమలోని వైసీసీ ఎమ్మెల్యేలు బస్సు యాత్రను ప్రతిష్టాత్మంగా తీసుకోవాలని, యాత్రను విజయవంతం చేసేలా చర్యలు చేపట్టాలని, ఈ మేరకు అందరు ఎమ్మెల్యేలకు సూచనలు ఇచ్చినట్లు చెప్పారు. బస్సు యాత్ర విజయవంతంపై మంత్రి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలలోపు 175 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరుగుతుందని, ఆ తరువాతే ఎన్నికలకు వెళ్తామని మంత్రి తెలిపారు. బస్సు యాత్ర ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించినదని, కార్యక్రమంలో పాల్గొనే వారు సైతం ఆయా సామాజిక వర్గాలకు చెందిన వారే ఉంటారని మంత్రి స్పష్టం చేశారు.
రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా మైనారిటీలు ఉన్నారని, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సైతం ఇదే ప్రాంతానికి చెందిన వారని, బస్సు యాత్ర జరిగే నియోజకవర్గాల్లో దాదాపు 95 శాతం నియోజకవర్గాల్లో వారే ఉంటారని అన్నారు. మిగతా వారి పేర్లు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి వెలువడుతాయన్నారు. ఆ సూచనల మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు పాల్గొంటారని అన్నారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగే సభలకు ఎమ్మెల్యేలు సభ అధ్యక్షులుగా ఉంటారని చెప్పారు. సీఎం జగన్ నాలుగన్నర ఏళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్ద పీట వేశారని, పదవుల కేటాయింపు, రాజకీయంగా, ఆర్థికంగా మేలు చేశారని, ఆయా అంశాలను బస్సు యాత్రలో వివరిస్తామని మంత్రి వెల్లడించారు.