MP Mithun Reddy: ఏపీ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది... కేంద్రం సాయం అందించాలి... లోక్ సభలో ఎంపీ మిథున్ రెడ్డి
పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, కేంద్రం తక్షణమే సహకారం అందించాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. లోక్ సభలో మాట్లాడిన ఆయన... ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం లోటు బడ్జెట్ పూడ్చాలని కోరారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పార్లమెంట్ ఇచ్చిన ప్రత్యేక హోదా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఏపీని ఆర్థిక కష్టాల నుంచి కేంద్రమే బయటపడేయాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయాలని ఆయన కోరారు. పోలవరంతో సహా విభజన హామీలన్నీ వెంటనే నెరవేర్చాలన్నారు. పదేళ్ల కాల పరిమితితో ఇచ్చిన విభజన హామీలకు ఇప్పటికే 8 ఏళ్లు గడిచిపోయాయని గుర్తుచేశారు. మిగిలింది ఇక రెండేళ్లేనని ఇప్పటికైనా హామీలు నెరవేర్చాలని ఎంపీ మిథున్ రెడ్డి కేంద్రాన్ని కోరారు.
Also Read: పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్... వ్యద్ధాప్య పింఛన్లు పెంచుతూ కీలక నిర్ణయం
ఏపీ ఆర్థిక లోటును పుడ్చాలి : ఎంపీ అనురాధ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఏర్పడిన ఆర్థిక లోటును కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి భర్తీ చేస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని అమలాపురం ఎంపీ చింతా అనురాధ అన్నారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఆమె కోరారు. లోక్ సభలో జీరో అవర్ ఎంపీ మాట్లాడుతూ 2014 ఫిబ్రవరి 20వ తేదీన నాటి భారతదేశ ప్రధాన మంత్రి పార్లమెంట్ లో ప్రకటన చేశారని గుర్తుచేశారు. కాగ్ నివేదిక ప్రకారం 2014-15వ ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు 16 వేల 78 కోట్ల రూపాయలు అన్నారు. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన సౌత్ జోన్ కౌన్సిల్ సమావేశంలో సీఎం జగన్ ఈ అంశాన్ని ప్రస్తావించి, వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారని ఎంపీ గుర్తు చేశారు. కాబట్టి నాటి ప్రధాని ప్రకటనను దృష్టిలో ఉంచుకుని, కాగ్ నివేదిక ప్రకారం అంచనా వేసిన 16 వేల 78 కోట్ల రూపాయల రెవెన్యూ లోటుకు సంబంధించిన నిధులను వెంటనే రాష్ట్రానికి మంజూరు చేయాలని ఎంపీ అనురాధ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఉచిత పథకాల వల్లే రెవెన్యూ లోటు : నిర్మలా సీతారామన్
ఏపీలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ రెవెన్యూ లోటు ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఊహించిన దానికంటే ఎక్కువ లోటు ఉందని తెలిపారు. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న అమ్మ ఒడి, ఉచిత విద్యుత్ లాంటి ఉచిత పథకాల వల్ల రెవెన్యూ లోటు ఎక్కువగా ఉందన్నారు. ఏపీలో ఆర్థిక క్రమశిక్షణ లోపంతో లోటు పెరిగిందని కాగ్ నివేదిక చెబుతోందని నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి