జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీ తిట్టిస్తోంది అందుకోసమే : కొడాలి నాని
అమరావతిలో టిడిపి వాళ్ళు చేసిన రియల్ ఎస్టేట్ మఫియా, విశాఖలో కూడా జరుగుతునట్లు ప్రచారం చేస్తున్నారని నాని ఆరోపించారు. టీడీపీ ఆఫీస్ ఉన్న స్థలాన్ని ఎలా కబ్జా చేస్తారని ప్రశ్నించారు.
అస్తమించిన టిడిపిని లోకేష్‌కు అప్పజెప్పడానికే పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్‌ను రైతులతో తిట్టిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కొడాలి నాని. ఆఖరికి విశాఖ నగరంపై కూడా టిడిపి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు విషం కక్కుతున్నారని మండిపడ్డారు. కృష్ణాజిల్లా గుడివాడ 33 వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెలుగుదేశం, జనసేనపై విరుచుకుపడ్డారు.
అమరావతిలో టిడిపి వాళ్ళు చేసిన రియల్ ఎస్టేట్ మఫియా, విశాఖలో కూడా జరుగుతునట్లు ప్రచారం చేస్తున్నారని 29 గ్రామాల అమరావతి ఎక్కడ, 25 లక్షల జనాభా గల విశాఖ ఎక్కడని కొడాలి నాని ప్రశ్నించారు. విశాఖ దసపల్లా భూముల్లో టిడిపి ఆఫీసు, చంద్రబాబు అనుయాయుల కార్యాలయాలు ఉంటే విజయసాయి రెడ్డి ఎలా కబ్జా చేస్తారని ప్రశ్నించారు. అలాంటి ఆరోపణలు చేయడం దుర్మార్గమని కొడాలి నాని ఖండించారు. ఒక అబద్ధాన్ని చంద్రబాబు, పవన్ కల్యాణ్ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ప్రజలేం అమాయకులు కాదని వారు అన్ని గమనిస్తున్నారని కొడాలి నాని తెలిపారు.
హైదరాబాద్‌లో నివాసం ఉండే ఆ ముగ్గురికీ.. అమరావతి రాజధాని కావాలా అని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. అమరావతిలో చంద్రబాబు అండ్ కో రియల్ ఎస్టేట్ దందాలు చేశారని ఆరోపించారు. దత్తపుత్రుడి అజ్ఞానం బయటపడిందని విమర్శించారు. బాబు నుంచి ప్యాకేజీ అందగానే దత్తపుత్రుడి ట్వీట్లు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
30వేల మంది పాదయాత్ర చేస్తే వారికి బస ఎక్కడ, ఎలా..!?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బినామీలు, బడా బాబులు రైతుల పేరుతో చేస్తున్న యాత్ర అది అని విమర్శించారు మార్గాని భరత్. 30 వేల మంది రైతులు యాత్ర చేస్తున్నారని కల్లబొలి కబుర్లు చెబుతూ ఎల్లో మీడియాలో తాటికాయంత అక్షరాలతో రోజూ ఓహో.. ఆహో.. అని వారికి వారే జబ్బలు చరుచుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారన్నారు. 30 వేల మంది రైతులు పాల్గొంటే వారంతా రాత్రిళ్ళు ఎక్కడ బస చేస్తున్నారు.?. ముగ్గురికి ఒక రూము చొప్పున ఇచ్చినా 10 వేల రూములు కావాలి కదా అని ప్రశ్నించారు. గ్రామాల్లో పది వేల రూములు ఉంటాయా..? కేవలం వారి మనుగడ కోసం, వారికి వత్తాసు పలికే ఎల్లో మీడియాలో వేల మంది రైతులు యాత్ర అంటూ డప్పాలు కొట్టుకుంటున్నారన్నారు. వాస్తవానికి అది రైతుల యాత్ర కాదని అది కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న యాత్రగా అభివర్ణించారు.
రాష్ట్ర విభజన సమయంలో రాజధాని నిర్ణయానికి, కేంద్రం శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు భరత్. సెక్షన్ 6 ప్రకారం వికేంద్రీకరణ జరగాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలని పేర్కొందని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఆ కమిటీని తుంగలో తొక్కి, తన మనుషులతో, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ఒక కమిటీని వేసుకుని, అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ దందాలు చేసింది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూస్తే, తొలుత మద్రాసు ప్రెసిడెన్సీలో ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కూడా, తెలుగు మాట్లాడే వ్యక్తులు మద్రాసులో సెటిల్ అయ్యి కొంతమంది వ్యక్తులు అభివృద్ధి చెందారే తప్పితే.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదన్నారు భరత్. ఆ తర్వాత 65-70 ఏళ్ళపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో అంతా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేశారన్నారు. ఉదాహరణకు ఏపీ పేపర్ మిల్స్ సంస్థలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను సైతం అమ్మి అప్పట్లో హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టినట్టు వివరించారు. ఇలా వేల, లక్షల కోట్ల పెట్టుబడులు హైదారాబాద్‌కు తరలి వెళ్ళాయన్నారు. ఇవన్నీ మన కంటిముందు కనిపిస్తున్న వాస్తవాలేనన్నారు.
హైదారాబాద్‌లో నివాసం ఉంటూ.. అమరావతి రాజధాని కావాలా..!?
చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, సొంత పుత్రుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ట్వీట్లు పెడుతున్నారని.. ఆ ట్వీట్లల్లో పస లేకపోయినా, పేలకపోయినా, వాటిని ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తోందన్నారు భరత్. ఏదో జరిగిపోతుందన్నట్టుగా బురదజల్లుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన దత్తపుత్రుడు.. ఈ ముగ్గురూ హైదరాబాద్‌లో నివాసం ఉంటూ అమరావతి రాజధాని కావాలంటారా అని ప్రశ్నించారు. ఇదెక్కడి న్యాయమని నిలదీశారు.
చంద్రబాబు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి, అమరావతిలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు భరత్. బాహుబలి, ఇతర సినిమాల దర్శకులను తీసుకొచ్చి గ్రాఫిక్స్ గీయించి.. వాటిని ఎల్లో మీడియాలో ప్రచారం చేయించి.. ఆహో అమరావతి.. ఓహో అమరావతి అని చూపించడం మినహా చేసిందేమీ లేదన్నారు.
అదే జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో భోగాపురం విమానాశ్రయానికి కేంద్రం క్లియరెన్స్ ఇచ్చిందన్నారు. 36 నెలల్లో అంతర్జాతీయ విమానాశ్రయం తయారవబోతుందని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రించేందుకు కేంద్రం 12 ఫ్లైఓవర్లు మంజూరు చేసిందన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం వల్ల ఒక మహా వృక్షంలా విశాఖపట్నం అభివృద్ధి కనిపిస్తుందని... ఇప్పుడిప్పుడే ఆ మహావృక్షం నుంచి కాయలు వస్తున్నాయన్నారు.