(Source: ECI/ABP News/ABP Majha)
Ys Jagan: 'ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వరా?' - స్పీకర్‌కు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ లేఖ
Andhrapradesh News: ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. పలు విషయాలు ప్రస్తావించారు.
YS Jagan Letter To AP Assembly Speaker Ayyannapatrudu: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుకి (Ayyannapatrudu) లేఖ రాశారు. శాసనసభలో మంత్రుల తర్వాత ఎమ్మెల్యేగా తనతో ప్రమాణం చేయించడం పద్ధతులకు విరుద్ధమని అన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లుగా ఉందని.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని.. పార్లమెంటులో కానీ ఉమ్మడి ఏపీలో కానీ ఈ నిబంధన పాటించలేదన్నారు. ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన పలు అంశాలను ఆయన లేఖలో ప్రస్తావించారు.
లేఖలో ఏం చెప్పారంటే.?
విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్ జగన్ లేఖలో చెప్పారు. 'అధికార కూటమి, స్పీకర్ ఇప్పటికే నాపై శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. చచ్చేవరకూ కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయి. ఇలాంటి పరిణామాల మధ్య అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదు. సభలో ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే ఛాన్స్ ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలించాలి' అని లేఖలో జగన్ కోరారు.