YS Jagan: 'సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి' - పోలీసులపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం, ఏపీ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు ప్రాంగణం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సహా ఆ పార్టీ నేతలు నల్ల కండువాలతో సమావేశాలకు హాజరు కాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.
YS Jagan Anger On Police At Assembly Premises: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assmebly Session) సోమవారం ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కాగా, వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా నల్ల కండువాలు ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభంతోనే వైసీపీ నేతలు అసెంబ్లీ ప్రాంగణం వద్ద ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. 'సేవ్ డెమొక్రసీ' అని నినాదాలు చేస్తూ జగన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ వైపు వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో గేటు వద్ద వారిని అడ్డుకున్న పోలీసులు నేతల చేతుల్లోంచి ఫ్లకార్డులను లాక్కొని చించేశారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్.. పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల దగ్గర నుంచి పేపర్లు తీసుకుని చించే అధికారం మీకు ఎవరిచ్చారంటూ నిలదీశారు. 'మధుసూదన్ రావు గుర్తు పెట్టుకో.. ఎల్లకాలం ఇలా ఉండదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏంటో తెలుసా.?. అధికారంలోకి ఉన్న వారికి సెల్యూట్ కొట్టడం కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మీరు ఉన్నారు. గుర్తు పెట్టుకోండి' అంటూ ఓ పోలీస్ అధికారిపై ధ్వజమెత్తారు.
వైసీపీ ఎమ్మెల్యేల వాకౌట్
అనంతరం, అక్కడే బైఠాయించిన జగన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని.. పోలీసుల వైఖరి అత్యంత దారుణంగా ఉందంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వైసీపీ సభ్యులు అసెంబ్లీలో నిరసన తెలిపారు. వారి నిరసన మధ్య గవర్నర్ ప్రసంగం సాగింది. అయితే, హత్యా రాజకీయాలు నశించాలని.. సెవ్ డెమొక్రసీ అంటూ వైసీపీ నేతలు నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని అందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం, వైసీపీ ఎమ్మెల్యేలంతా సభ నుంచి బయటకు వచ్చేశారు.