AP PCC Chief Sharmila : వైఎస్, రాజారెడ్డి మహానుభావులు - చనిపోయిన వారిపై నిందలేస్తారా? - టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం
Andhra Pradesh Politics 2026: వైఎస్, రాజారెడ్డిలు ఫ్యాక్షన్ నేతలంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై షర్మిల ఘాటుగా స్పందించారు. సంజాయిషీ ఇచ్చుకోలేని వారిపై దుష్ప్రచారం చేయడం మంచిది కాదన్నారు.

YS Sharmila on Rajareddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ రాజారెడ్డిల చుట్టూ సాగుతున్న రాజకీయంపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ లోకంలో లేని వ్యక్తులపై, సంజాయిషీ ఇచ్చుకోలేని వారిపై టీడీపీ దుష్ప్రచారం చేయడం వారి రాజకీయ అక్కసును బయటపెడుతోందని ఆమె విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె ఒక సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేశారు.
అప్పుడు ఎందుకు శిక్షించలేదు?
నిజంగా వైఎస్ రాజారెడ్డి, వైఎస్సార్ అంత దుర్మార్గులే అయితే.. ఆనాడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు విచారణ జరపలేదు? ఎందుకు శిక్షించలేదు? మీకు చేతకాలేదా? అంటూ షర్మిల నేరుగా టీడీపీని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా, చెప్పుకోదగ్గ విజయాలు లేకనే పాత విషయాలను లాగి రాజకీయం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ నీచ రాజకీయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజారెడ్డి చరిత్రను వక్రీకరిస్తే సీమ ప్రజలు సహించరు
వైఎస్ రాజారెడ్డి సీమలో అరాచకాలను ఎదురించి పేదల పక్షాన నిలబడ్డ వ్యక్తి అని షర్మిల గుర్తు చేశారు. 1973లోనే కడప ప్రజల కోసం 70 పడకల ఆసుపత్రి కట్టించి ఉచిత వైద్యం అందించారని, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలు కట్టించి పేదలకు విద్యను అందించిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. ఇలాంటి మహానుభావుడి చరిత్రను వక్రీకరిస్తే రాయలసీమ ప్రజలు హర్షించరని హెచ్చరించారు.
అపర భగీరథుడిపై మచ్చ వేయలేరు
సంక్షేమం, అభివృద్ధి అనే పదాలకు చిరునామా వైఎస్సార్ అని షర్మిల కొనియాడారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, రుణమాఫీ వంటి పథకాలు వైఎస్సార్‌కే సాధ్యమయ్యాయని, ఆయనను సూర్యుడితో పోల్చారు. బురద జల్లాలని చూసినంత మాత్రాన సూర్యుడి కాంతి తగ్గదు. పోలవరం పనులను 33 శాతం పూర్తి చేసిన అపర భగీరథుడు వైఎస్సార్. కానీ చంద్రబాబుకు రుణమాఫీ గానీ, నిరుద్యోగ భృతి గానీ, మహిళలకు 15 వందలు ఇవ్వడం గానీ చేతకావడం లేదు అని ఎద్దేవా చేశారు.
నాన్న YSR, తాత రాజారెడ్డి ఈ లోకంలో లేరు. సంజాయిషీ ఇచ్చుకోలేని వారిపై TDP @JaiTDP చేస్తున్న దుష్ప్రచారం వారి రాజకీయ అక్కసును బయట పెట్టింది. నిజంగా వారు అంత దుర్మార్గులే అయితే ఆనాడే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు విచారణ జరపలేదు ? ఎందుకు శిక్షించలేదు ? మీకు చేతకాలేదా?…
— YS Sharmila (@realyssharmila) May 26, 2026
ప్రజల గుండెల్లో వైఎస్సార్ స్థానం శాశ్వతం
వైఎస్సార్ మరణ వార్త విని 700 మంది గుండెలు పగిలి చనిపోయారని, నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటా పూజ గదిలో ఆయనకు స్థానం ఉందని షర్మిల అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లో ఆయన స్థానాన్ని చెరపలేరని స్పష్టం చేశారు. ఇకనైనా ఒట్టి మాటలు కట్టిపెట్టి, ఓట్లేసిన ప్రజలకు మేలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆమె హితవు పలికారు.
Before You Go
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















