YS Jagan: స్టైల్ మార్చిన జగన్ - పార్టీ నేతలతో భేటీకి బొట్టుతో దర్శనం - వైసీపీలో విస్తృత చర్చ
YSRCP: వైఎస్ జగన్ బొట్టుతో పార్టీ నేతల సమావేశానికి హాజయ్యారు. ఆయన ఆహార్యంలో వచ్చిన మార్పుతో పార్టీ నేతలు కూడా ఆశ్చర్యపోయారు.

YS Jagan Meeting With Leaders: వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ నేతలతో సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన నుదుటన బొట్టుతో రావడం చాలా మందిని ఆశ్చర్య పరిచింది. పూజల్లాంటివి ఏమైనా చేసిన తర్వాత పురుషులు ఇలా బొట్లు పెట్టుకుంటారు. లేకపోతే ఆలయానికి వెళ్లినప్పుడు పెట్టుకుంటారు. ఇతర సందర్భాల్లో పెట్టుకోవడం తక్కువ. కానీ అలా ఆలయానికి లేదా పూజలు చేసి రావడం ఉండదు. అందుకే ఆయన బొట్టు ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
పార్టీ తరపున యాప్
పీఏసీ భేటీలో జగన్ కీలక ప్రకటనలు చేశారు. పార్టీ తరఫున త్వరలో యాప్ విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ వేధింపులు, అన్యాయం జరిగినా వెంటనే యాప్‍లో నమోదు చేయొచ్చునని తెలిపారు. తగిన ఆధారాలను కూడా యాప్‍లో అప్‍లోడ్ చేయొచ్చునని కంప్లైంట్ ఆటోమేటిగ్గా మన డిజిటల్ సర్వర్‍లోకి వస్తుందన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫిర్యాదులను పరిశీలిస్తామని.. ఫిర్యాదులను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయమని భరోసా ఇచ్చారు.
చంద్రబాబు నాటిందే చెట్టవుతుంది !
చంద్రబాబు ఏదైతే నాటారో అదే చెట్టవుతుందని.. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు. పార్టీ సీనియర్ నేతలను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారన్నారు. ఇదే సాంప్రదాయం కొనసాగితే టీడీపీలో అందరూ జైలుకెళ్లాల్సిందేనని హెచ్చరించారు. మిథున్‍రెడ్డి అరెస్ట్ బాధాకరమని.. రాష్ట్రంలోని అంశాలకు మిథున్‍రెడ్డికి ఏం సంబంధం ఉందన్నారు. మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి ఆ శాఖను చూడలేదని.. కేవలం వేధించాలన్న ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు కంట్లో చెవిరెడ్డి నలుసులా మారాడని.. అందుకే తప్పుడు కేసు పెట్టి చెవిరెడ్డిని అరెస్ట్ చేశారన్నారు. చెవిరెడ్డి కొడుకును కూడా జైల్లో పెట్టాలని కుట్ర పన్నారన్నారు. నందిగం సురేష్ సాధారణ స్థాయి నుంచి ఎంపీగా ఎదిగారు -గట్టిగా ప్రశ్నిస్తున్నాడని 191 రోజులు జైల్లో పెట్టారు. కాకాణిపై కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఇప్పుడు మళ్లీ మాజీ మంత్రి అనిల్‍పై తప్పుడు కేసు పెట్టారన్నారు.
లేని అక్రమాలు చూపి కేసులు
లేని అక్రమాలు చూపి తప్పుడు కేసులు పెడుతున్నారు - పార్టీలో క్రియాశీలకంగా ఉన్నవారిపై కేసులు పెడుతున్నారని ప్రజల తరపున ప్రశ్నించకుండా చేయాలనేదే బాబు ఉద్దేశమని జగన్ అన్నారు. రాష్ట్రంలో అసలు పరిపాలనే కనిపించడం లేదన్నారు. సూపర్ సిక్స్ సహా ఏ హామీ అమలు చేయలేదని.. పాలనలో ఘోర వైఫల్యం చెందారు కాబట్టే ఈ తప్పుడు కేసులు అని ఆరోపించారు. మాజీ మంత్రి రోజాపై తీవ్రంగా దుర్భాషలాడారు.. బీసీ మహిళ, జడ్పీ ఛైర్ పర్సన్ హారికపై నేరుగా దాడులు చేశారన్నారు. వైసీపీలో ఉన్న మహిళలకు ఆత్మగౌరవం ఉండదా అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. నల్లపరెడ్డిపై హత్యాయత్నమే లక్ష్యంగా దాడులు చేశారు. మాజీ MLA పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లలేకపోతున్నారు - ఏకంగా సీఐ గన్ చూపి భయపెట్టే ప్రయత్నం చేశారు- కొంతమంది పోలీస్ అధికారులు అవినీతిలో భాగస్వామ్యం అయ్యారని ఆరోపించారు.





















