Pendurti Bandaru : బండారు సత్యనారాయణ మూర్తితో వైసీపీ చర్చలు - అనకాపల్లి ఎంపీ టిక్కెట్ ఆఫర్ ?
Andhra News : పెందుర్తి టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తితో వైసీపీ చర్చలు జరుపుతోంది. పెందుర్తి స్థానం జనసేన ఖాతాలోకి వెళ్లడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు.
YCP is holding talks with TDP leader Bandaru Satyanarayana Murthy : పెందుర్తి నియోజకవర్గ టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి పార్టీ మారుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పొత్తుల్లో భాగంగా పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీకి కేటాయించారు. ఈ కారణంగా ఆయన తీవ్ర అసంతృప్తికి గుర్యయారు. పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. నేను పార్టీ వీడుతున్నానని వస్తున్న వార్తలను మీడియాలో చూస్తున్నాను. ఈ వార్తలపై నా సమాధానం ‘నో’ కామెంట్స్ అంతే అని బండారు సత్యనారాయణ మూర్తి చెబుతున్నారు. కార్యకర్తలు, నా శ్రేయోభిలాషులతో చర్చలు జరుపుతున్నాను. వారి అభిప్రాయాలను తీసుకుంటాను. ఆపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.
రెండు, మూడు రోజుల్లో మీడియా మీట్ పెట్టి అన్ని విషయాలు చెబుతానని ప్రకటించారు. వైసీపీ నుంచి బండారుకు పిలుపు వచ్చిందని.. ముఖ్యనేతలు కొందరు టచ్‌లోకి వెళ్లగా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారనే తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని.. ఈయనతో పాటు మరికొందరు టీడీపీ నేతలు కూడా సైకిల్ దిగుతారని టాక్ నడుస్తోంది. బండారుకు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని విశాఖలో ప్రచారం జరుగుతోంది. అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థిని ప్రకటించినా అనకాపల్లికి మాత్రం ప్రకటించలేదు. బీసీ అభ్యర్థికి ఇస్తామని చెప్పారు.
ఈ ఉత్కంఠ సమయంలో మా స్వగృహానికి వచ్చి శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారికి మీ మద్దతును సంఘీభావాన్ని తెలియ చేస్తున్న ప్రతి ఒక్క నాయకులకి కార్యకర్తకు నా పాదాభివందనాలు!! pic.twitter.com/QJaLpPJOsW
— Bandaru Appala Naidu (@BandaruTDP) March 17, 2024
ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ నుంచి టికెట్ దక్కని వాళ్లతో బండారు సత్యనారాయణ మంతనాలు చేస్తున్నారు. వారందరినీ కూడా వైసీపీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ నేతలు, కార్యకర్తలు మాత్రం బండారును వైసీపీలోకి వెళ్లొద్దని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని.. అధినేత చంద్రబాబు తప్పకుండా న్యాయం చేస్తారని చెబుతున్నారు. బండారు సత్యనారాయణ మూర్తి.. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు మామ. బండారు కుమారుడు అప్పలనాయుడు పార్టీ కార్యక్రమాల కోసం విస్తృతంగా శ్రమించారు. తమకు టిక్కెట్ లభిస్తుందని ఆశపడ్డారు. అందుకే టిక్కెట్లు ప్రకటించిన రోజున.. సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యకం చేస్తూ.. అన్ని గుడ్లు ఒకే బుట్టలో పెట్టకూడదని.. పార్టీ మారే అవకాశాలను ఉంచుకోవాలన్నట్లుగా పెట్టారు.
Never put all your eggs in single basket!!
— Bandaru Appala Naidu (@BandaruTDP) March 14, 2024
పెందుర్తి ప్రస్తుత ఎమ్మెల్యేగా అన్నంరెడ్డి అదీప్ రాజు ఉన్నారు. వైసీపీ తరపున ఆయనకే టిక్కెట్ ఖరారు చేశారు. అదీప్ రాజ్ కు.. బండారు కుటుంబానికి మధ్య తీవ్ర వివాదాలున్నాయి. ఈ కారణంగా వైసీపీలోకి వెళ్లినా బండారు అదీప్ రాజ్‌కు సహకరిస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.