Andhra News in Telugu: ప్రకాశం జిల్లా సిద్ధం సభ వాయిదా - సీఎం జగన్ ఢిల్లీ వెళ్లే అవకాశం !
YSRCP Siddham News: ప్రకాశం జిల్లా సిద్ధం సభను మార్చి పదో తేదీకి వైసీపీ వాయిదా వేసుకుంది. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి మరోసారి ప్రధాని మోదీతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.
YCP has postponed the Prakasam district Siddham meeting to March 10th : ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ నిర్వహించాలనుకున్న ఆఖరి సిద్ధం సభను ఆ పార్టీ వాయిదా వేసుకుంది. మార్చి రెండో తేదీన నిర్వహించాలనుకున్నారు. కానీ పదో తేదీకి వాయిదా వేస్తూ తాజా నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్ కోసం సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. అపాయింట్‌మెంట్ లభించే అవకాశం ఉండటంతో సభను వాయిదా వేసుకున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోసం సీఎం జగన్ ప్రయత్నం
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ సారి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. అప్పట్లో చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. తర్వాత బీజేపీతో పొత్తుల అంశంపై ఏపీలో విస్తృత ప్రచారం జరిగింది. అయితే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. టీడీపీ ఎన్డీఏలో చేరుతుందన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఏ విషయం ఖరారు కావడం లేదు. మొదటి జాబితాను టీడీపీ,జనసేన కలిసి ప్రకటించాయి. కానీ ఎంపీ అభ్యర్థుల ను మాత్రం ఖరారు చేయలేదు. టీడీపీని ఎన్డీఏలో చేర్చుకోవద్దని సీఎం జగన్ లాబీయింగ్ చేస్తున్నారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
టీడీపీని ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవద్దని కోరుతున్నట్లు ప్రచారం
తాము బీజేపీకి బయట నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారని అంటున్నారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరితే తాము మద్దతివ్వలేని పరిస్థితులు వస్తాయని వైసీపీ వర్గాలు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. లోక్‌సభ సీట్లు ఎన్ని అన్న సంగతిని పక్కన పెడితే.. వైసీపీకి రాజ్యసభలో పదకొండు మంది సభ్యులుఉన్నారు. ఈ సంఖ్య బీజేపీకి మద్దతుగా ఉండటం చాలా అవసరం. రాజ్యసభల ఎన్డీఏకు పూర్తి మెజార్టీ రాదు. అందుకే.. వైసీపీని దూరం చేసుకునే ఆలోచనలో బీజేపీ లేదని అంటున్నారు. అయితే వైసీపీ ఎన్డీఏలో చేరే అవకాశం లేదు. కానీ బయట నుంచి గత ఐదేళ్లుగా పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచారు.
అదనపు రుణాల కోసం ప్రయత్నిస్తున్న ప్రభుత్వం
అయితే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లడానికి రాజకీయాలకు పెద్దగా సంబంంధం లేదని.. రాష్ట్ర అంశాలపైనే వెళ్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే రెండు నెలలు అత్యంత కీలకమైన సమయం.. అనేక పథకాలకు డబ్బులు ప్రజల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. మరో వైపు ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి. అప్పుల పరిమితి ముగిసింది. ఈ క్రమంలో..త అదనపు రుణాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ అవబోతున్నారని అంటున్నారు. మొత్తంగా ఎన్నికల షెడ్యూల్.. వచ్చే నెల పదో తేదీ తర్వాత రానుంది. ఈ లోపే ఏపీ రాజకీయాల్లో బీజేపీ పాత్రపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.