World Cup 2023 Final: క్రికెట్ అభిమానులకు పండగే, 13 జిల్లాల్లో భారీ స్క్రీన్లు, హోటళ్లు, పబ్బుల్లో స్పెషల్ ఆఫర్లు
Ind vs Aus Final 2023: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసింది. ఉచితంగా మ్యాచ్‌ను వీక్షించే ఏర్పాట్లు చేపట్టింది.
ACA Arrangements For World Cup Final: దేశంలో ఎక్కడ చూసిన ఒకటే చర్చ నడుస్తోంది. ప్రతి భారతీయుడు మాట్లాడే మాట ప్రపంచకప్ ఫైనల్ (World Cup 2023 Final) గురించే. ఇండియా ముచ్చటగా మూడో సారి ప్రపంచకప్ గెలవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు భారత్ ప్రపంచ కప్ సాధించాలని ప్రార్థనలు చేస్తున్నారు.
సొంతగడ్డపై ఆస్ట్రేలియా (Australia)తో జరిగే పోరులో టీమిండియా (Team India) ట్రోఫీ (World Cup 2023) గెలిస్తే చూడాలనే ఆకాంక్షతో రోహిత్ సేన (Rohit Sharma)కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. క్రికెట్ అభిమానుల కోసం ప్రభుత్వాలు ప్రత్యేకంగా చర్యలు చేపడతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (Andhra Cricket Association) భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసింది. ఉమ్మడి 13 జిల్లాల్లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి ఉచితంగా మ్యాచ్‌ను వీక్షించే ఏర్పాట్లు చేపట్టింది.
భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసిన ప్రాంతాలు
- విశాఖపట్నం: ఆర్కీ బీచ్ , కాళీ మాత ఆలయం ఎదురుగా
- అనంతపురం: పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ (పీటీసీ)
- ఏలూరు: ఇండోర్ స్టేడియం గ్రౌండ్, కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా
- గుంటూరు: మాజేటి గురవయ్య హై స్కూల్ గ్రౌండ్
- కడప: ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్
- కాకినాడ: రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్
- కర్నూలు: DSA స్టేడియం
- నెల్లూరు: VR హైస్కూల్ గ్రౌండ్
- ఒంగోలు: జెడ్పీ మినీ స్టేడియం
- శ్రీకాకుళం: MH స్కూల్ గ్రౌండ్, 7 రోడ్ జంక్షన్
- తిరుపతి: KVS స్పోర్ట్స్ పార్క్, తుమ్మలకుంట గ్రౌండ్
- విజయనగరం: ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, భాష్యం స్కూల్ వెనుక
- విజయవాడ: MG రోడ్, ఇందిర గాంధీ మున్సిపల్ స్టేడియం
షెడ్యూల్ మార్చుకున్న రాజకీయ నేతలు
భారత్-ఆసీస్ మధ్య జరిగే ప్రపంచకప్ ఫైనల్ పోటీలను చూసేందుకు తెలంగాణలో ఏర్పాట్లు చేస్తున్నారు. నేతలు సైతం తమ ఎన్నికల ప్రచారాన్ని పక్కన పెట్టేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలు, యువత సభలు, ప్రచారానికి వచ్చే అవకాశం లేదు. దీంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని మ్యాచ్ సమయానికి ముగించేలా ప్రణాళికలు వేసుకున్నారు. యువతను ఆకట్టుకునేలా స్థానికంగగా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు.
హోటళ్లలో ఆఫర్లు
అలాగే హైదరాబాద్‌లోని పబ్బులు, క్లబ్బులు, హోటళ్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. వీక్షకుల కోసం భారీ తెరలను ఏర్పాట్లు చేస్తున్నాయి. అమ్నీషియా, ఫర్జీ కేఫ్, వయోలా, హార్ట్ కప్, హలో పబ్‌లు, పలు హోటళ్లలో ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ చూసేలా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అంతేకాదు కష్టమర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక ఆఫర్‌లను ప్రకటించాయి. మరోవైపు ఆతిథ్య కేంద్రాల్లో యువకులు పెద్దఎత్తున బుకింగ్ చేసుకున్నారు. ప్రపంచకప్‌ను భారత్ గెలిస్తే బిల్లులో రాయితీ ఇస్తామని ఓ పబ్ నిర్వాహకుడు తెలిపారు.
ముమ్మరంగా ఏర్పాట్లు
క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్, మహా సంగ్రామానికి మరి కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్లు కప్పు కోసం తలపడనున్నాయి. క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్-ఆస్ట్రేలియా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కోసం బీసీసీఐ, ఐసీసీ సంయుక్తంగా భారీస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాయి.
రోజు మొత్తం క్రికెట్ అభిమానులను అలరించేలా బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. మ్యాచ్‌కు ముందు భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం పది నిమిషాల పాటు ఎయిర్ షో ఉండనుంది. అలాగే కంపోజర్ ప్రీతమ్ ప్రదర్శనతో సహా అనేక ఈవెంట్లను బీసీసీఐ ప్లాన్ చేసింది. ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ కూడా హాజరవుతారని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కార్యాలయం తెలిపింది.