Employess Strike : సమ్మె చేస్తారు సరే తర్వాతేంటి ? ఏపీ ఉద్యోగ సంఘాలకు ప్లాన్ బీ ఉందా ?
ఏపీ ఉద్యోగ సంఘాలు ఇప్పుడు క్రాస్‌రోడ్‌లో ఉన్నాయి. సమ్మె చేసినా ఉద్యోగులకు చర్చలు తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వం అంటోంది. ఉద్యోగులు మాత్రం డిమాండ్లపై పట్టుబడుతున్నారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల్లా అయిపోతుందా ? వారికి ప్లాన్ బీ ఉందా?
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు అన్నీ ఏకతాటిపైకి వచ్చి సమ్మె చేస్తున్నట్లుగా ప్రకటించాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చినట్లుగా పోలీసులు, అఖిలభారత సర్వీసు అధికారులు మినహా అందరూ సమ్మెలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారికి వచ్చిన సమస్య అలాంటిది. ఇప్పుడు పీఆర్సీకి అంగీకరిస్తే భవిష్యత్ కోల్పోతామని అందరూ నమ్ముతున్నారు. అందుకే సమ్మెకు వెళ్లడం ఖాయం. ప్రభుత్వం కూడా దిగి వచ్చే ప్రశ్నే లేనంటోంది. అయితే సమ్మె చేస్తారు సరే తర్వాతేంటి? చేసినన్ని రోజులు చేసిమళ్లీ ప్రభుత్వం దగ్గరకే వెళ్లాలా ? చర్చలు జరపాలని బతిమాలుకోవాలా ? గత సమ్మెల నుంచి పాఠాలు నేర్చుకున్నారా ? ఉద్యోగ సంఘాల వద్ద ప్లాన్ బీ ఉందా ?
ఎప్పుడైనా ప్రభుత్వం వద్దకు వెళ్లాల్సిందే కదా !
ఉద్యోగుల ఉద్యమం విషయంలో ఏపీ ప్రభుత్వ పెద్దలు చాలా నింపాదిగా ఉన్నారు. సమ్మె నోటీసుల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. పీఆర్సీపై ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ పోతున్నారు. అపోహలు తీర్చేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. కానీ ఆ కమిటీలో నియమించిన సగం మంది సభ్యులు పట్టించుకోలేదు. సీఎస్‌తో పాటు ఆర్థిక మంత్రి రావడం లేదు. సభ్యులయిన సజ్జల, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ రోజూ వస్తున్నారు. ఎదురు చూస్తున్నారు. వెళ్తునారు. చర్చలకు రావాలంటే ఉద్యోగులు షరతులు పెడుతున్నారు. వాటి గురించి అసలు పట్టించుకునే ప్రశ్నే లేదని ప్రభుత్వం చెప్పింది.దీంతో వారు రావడం లేదు. సమ్మెకు వెళ్తారని తెలిసినా ఎందుకు ప్రభుత్వం ఇంత తేలిగ్గా వ్యవహరిస్తోందన్న విషయంకమిటీ సభ్యులు చేస్తున్న వ్యాఖ్యలను విశ్లేషిస్తే అర్థమైపోతుంది. ఉద్యోగులు జీవితాంతం సమ్మె చేయలేరుగా... ఎప్పుడైనా ప్రభుత్వం వద్దకు రావాల్సిందేగా అని అటు మంత్రి పేర్ని నాని.. వారికి మరో ప్రత్యామ్నాయం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో నేరుగానే చెబుతున్నారు. ఉద్యోగులు ఎంత కాలం కావాలంటే అంత కాలం సమ్మె చేసుకుని విసుగు పుట్టి తామే ఉద్యోగాల్లో చేరతామని వస్తారని అప్పటి వరకూ తాము సీరియస్‌గా కాకుండా సాధారణంగా పట్టించుకుంటే చాలని భావిస్తున్నారు.
ఉమ్మడి ఏపీలో చేసిన ఉద్యోగుల సమ్మెల్లో కొన్ని సక్సెస్.. కొన్ని ఫెయిల్ !
ఉద్యోగులపై కఠిన వైఖరికి నిరసనగా కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో 1971లో 56 రోజుల పాటు సమ్మె నడిచింది. కానీ ప్రత్యేకమైన హామీలేమీ లేకుండానే విరమించాల్సి వచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన సమ్మె మినహా తమ సమస్యల కోసం గత 35 ఏళ్లలో ఉద్యోగులు సమ్మె చేయలేదు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు986లో ఉద్యోగుల పదవీవిరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 55 ఏళ్లకు కుదించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న ఉద్యోగుల కుటుంబాలకు ప్రోత్సాహకంగా అందుతున్న ఒక ఇంక్రిమెంట్‌నూ, ఎర్న్‌డ్ లీవ్‌లను క్యాష్ చేసుకునే వెసులుబాటునూ రద్దుచేశారు. వీటిలోపాటు పీఆర్సీ అమలు కూడా ఆలస్యమైంది. దీంతో ఉద్యోగుల ఐక్య సంఘం పిలుపు మేరకు 1986 అక్టోబరులో సుమారు 19 రోజులపాటు సమ్మె చేశారు. పీఆర్సీ అమలుచేయడంతోపాటు తొలగించిన అన్ని ప్రయోజనాలను కల్పించేందుకు ఎన్టీఆర్ ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మె విజయవంతమైంది. .
కోర్టుల్లో సమ్మెను సమర్థించుకునే పరిస్థితి లేదని గతంలో తీర్పులు !
ఇటీవల తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేశారు. సుమారు యాభైవేలమంది ఆర్టీసీ కార్మికులు రెండు నెలలపాటు సమ్మె చేసినపుడు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒక దశలో ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. 0ఆర్టీసీ కార్మికులు హైకోర్టుకు వెళ్లారు. లేబర్ కోర్టుకు వెళ్లండని హైకోర్టు స్పష్టం చెయ్యడంతో కార్మికులు ఏం చేయలేక ప్రభుత్వాన్నే ప్రాథేయపడాల్సి వచ్చింది. కొన్నేళ్ల కిందట తమిళనాడు ఉద్యోగులు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెకు దిగారు. జయలలిత ఆగ్రహించి లక్షా డెబ్భైవేల మంది ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగించారు. దీంతో ఉద్యోగులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కానీ అత్యున్నత న్యాయస్థానం సమ్మె అనేది ఉద్యోగుల హక్కు కాదని, ఉద్యోగులను డిస్మిస్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని, అయితే మానవీయ కోణంలో చూసి డిస్మిస్ చేసిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని జయలలితకు సూచించింది. ఇదే విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. సమ్మెకు వెళ్లడం కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు గుర్తు చేసిందని ఆయన మీడియాతో చెప్పారు.
ఇప్పటి ప్రభుత్వం కఠినంగా ఉండటం ఖాయం.. ఉద్యోగులకు దారేది!?
ఉద్యోగుల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం ఏ మాత్రం తగ్గేది లేదని.. వారి డిమాండ్లను అంగీకరించే ప్రశ్నే లేదని ఇప్పటికే తేట తెల్లమయింది. ఉద్యోగులు సమ్మెకు వెళ్లినా చివరికి తమంతటకు తాము వచ్చి విధుల్లో చేరేలా పరిస్థితి మారుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే లైట్ తీసుకుంటోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ఉద్యోగులు ఎన్నాళ్లు సమ్మె చేద్దామనుకుంటున్నారు..? రెండునెలల పాటు సమ్మె చేసినా.. ప్రభుత్వంలో స్పందన లేకపోతే...వచ్చే జీతాలు కూడా రాకపోతే ఏం చేస్తారు ? తెలంగాణ ఆర్టీసీ కార్మికుల్లా ప్రభుత్వం వద్దకెళ్లి బతిమాలుకుంటారా ? లేకపోతే.. ప్రభుత్వాన్ని సైతం మెట్టు దిగేలా చేసేలా ప్లాన్ బీ ఉందా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఈ విషయంలో ఉద్యోగ సంఘాల వ్యూహమే వారి ఉద్యమాన్ని ఏ తీరానికి చేరుస్తుందన్నది నిర్ణయిస్తుంది.