Weather Updates: రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణలో పొడిగా మారిన వాతావరణం
Weather Updates in AP and Telangana: ఏపీ, తెలంగాణలో వాతావరణం పొడిగా మారడంతో ఓవైపు పగటి ఉష్ణోగ్రతలు దిగి రావడం లేదు. రాత్రివేళ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
Rains in Telangana AP: నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు పడే అవకాశం చాలా తక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పొడిగా మారిపోయింది. దాంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. నవంబర్ 8 న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది తుఫానుగా మారుతుందా, లేదా సాధారణంగానే అల్పపీడనంగానే ఉంటుందా అనే అంశంపై గురించి ఇంకా క్లారిటీ లేదని ఏపీ వెదర్ మ్యాన్ చెప్పారు. కానీ అల్పపీడనం ఏర్పడ్డాక తప్పకుండా తమిళనాడు వైపు అయినా, లేదా దక్షిణ కోస్తాంధ్ర వైపుగా అయినా రానుందని అంచనా వేశారు. ఒకవేళ ఇది వాయుగుండంగా ఏర్పడితే తమిళనాడుకి, అలాగే బలమైన తుఫానుగా ఏర్పడితే దక్షిణ కోస్తాంధ్రపై పెను ప్రభావం చూపనుంది.
నవంబర్ 8 ఏర్పడే అల్పపీడనం, మొదటగా వాయుగుండంగా మారనుంది. అయితే ఇది శ్రీలంక వైపుగా వెళ్తుందా, లేదా తమిళనాడు వైపుగా వస్తుందా, తుఫానుగా మారి ఆంధ్రప్రదేశ్ వైపుగా వస్తుందా అనే అంశం పై వాతావరణ కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉపరితల ఆవర్తనం కదలిక వల్ల గాలులు మార్చుకుంటున్నాయి. తెలంగాణకు ఎలాంటి వర్ష సూచన, హెచ్చరికలు లేవు. ఏపీతో పాటు యానాం, తమిళనాడులోనూ తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. ఈశాన్య రుతుపవనాలు ఏపీలో పూర్తి స్థాయిలో విస్తరిస్తుండగా, మరోవైపు అల్పపీడనం ప్రభావంతో పలుచోట్ల తేలికపటి వర్షం కురవనుంది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) November 6, 2022
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
రాష్ట్రంలో వర్షాలు లేకపోవడంతో పగటి ఉష్ణోగ్రతలు ఇంకా భారీగా నమోదవుతుండగా.. రాత్రివేళ చలి తీవ్రత అధికంగా ఉంది. పలు జిల్లాల్లో వాతావరణం పూర్తిగా పొడిగా మారిపోయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజులపాటు వాతావరణంలో ఏ మార్పులు ఉండవని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ లో పగటి ఉష్ణోగ్రత అత్యధికంగా 33.8 డిగ్రీలు నమోదు కాగా, మెదక్ లో అత్యల్పంగా 13 డిగ్రీల రాత్రిపూట ఉష్ణోగ్రత నమోదైంది. నవంబర్ రెండో వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. నవంబర్ 8న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రెండు, మూడు వర్షాలు కురవనున్నాయి.
హైదరాబాద్ లో చలి తీవ్రత పెరుగుతోంది. నగరంలో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 30.5 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 16.1 డిగ్రీలుగా నమోదైంది. ఈశాన్య, తూర్పు దిశ నుంచి గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
నేడు ఉత్తర కోస్తాంధ్రలో, యానాంలో ఎలాంటి వర్ష హెచ్చరికలు లేవు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో వాతావరణం పొడిగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం గాలుల కోస్తాంధ్ర వైపుగా కదలడంతో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
Impact based forecast for Andhra Pradesh dated 06.11.2022 pic.twitter.com/5Lq8XgSNEN
— MC Amaravati (@AmaravatiMc) November 6, 2022
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
నిన్న దక్షిణ కోస్తాంధ్రలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల వర్షాలు కురిశాయి. రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. నేడు ఇక్కడ సైతం వాతావరణం పొడిగా మారనుంది. అల్పపీడనం ఏర్పడ్డాక మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర తెలిపింది. చెన్నైకి దగ్గరగా ఉన్నతమిళనాడు సరిహద్దు భాగాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఈశాన్య రుతుపవనాలతో ఈ సీజన్ లో అత్యధికంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలున్నాయి. ఏడేళ్ల తరువాత ఆ స్థాయిలో భారీ వర్షపాతం నమోదు కానుందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.