Weather Updates: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం - నేడు ఆ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు: IMD
Rains In Andhra Pradesh: అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం నేడు పుదుచ్చేరి - చెన్నై మధ్యలో తీరాన్ని తాకనుంది. ఏపీ, తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురనున్నాయి.
Rains in Telangana AP: నైరుతి బంగాళాఖాతంలో నవంబర్ 9న ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం నేడు పుదుచ్చేరి - చెన్నై మధ్యలో తీరాన్ని తాకనుంది. రెగ్యూలర్ వెదర్ అంచనాలకు భిన్నంగా ఉత్తర శ్రీలంక - ఉత్తర తమిళనాడు కాకుండా చెన్నై - పుదుచ్చేరిల మధ్య తీరాన్ని తాకడం విశేషం. నైరుతి బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలను ఆనుకొని ఏర్పడిన అల్పపీడనం ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇది క్రమంగా వాయువ్య దిశగా పయనించి నేడు తీరం తాకుతుంది. దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తమిళనాడు ప్రభుత్వం నేడు (12.11.2022) చెన్నై, తిరువళ్లూరు, కడలూరు, విల్లుపురం, వెల్లూరు మరియు కాంచీపురంలోని 6 జిల్లాల్లో పాఠశాలలు మరియు కళాశాలలకు సెలవుదినంగా ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ నేడు, రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో వాతావరణం పొడిగా మారిపోయింది. మరో రెండు నుంచి మూడు రోజులు వాతావరణంలో ఏ మార్పులు ఉండవని అధికారులు తెలిపారు. శ్రీలంక తీరం వెంట నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి నేడు వాయువ్య దిశగా తమిళనాడు, పుదుచ్చేరి తీరం తాకే అవకాశం ఉంది. భారీవర్షం వచ్చే అవకాశం ఉందని వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్ హెచ్చరించారు. మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, సహాయం కావాల్సిన వారు 9110564575, 08625-295015, 9849905894 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, పాత భవనాల్లో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు.
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
తెలంగాణలో వాతావరణం పొడిగా మారింది. మరో మూడు రోజులవరకు వాతావరణంలో ఎలాంటి మార్పులు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. వర్షాలు లేకపోవడంతో తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు ఇంకా భారీగా నమోదవుతుండగా.. రాత్రివేళ చలి తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత ఖమ్మంలో 33 డిగ్రీలు నమోదు కాగా, మెదక్ లో రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. మెదక్ లో అత్యల్పంగా రాత్రిపూట ఉష్ణోగ్రత 12.8 డిగ్రీలుగా నమోదైంది. నవంబర్ రెండో వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) November 11, 2022
హైదరాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘాలతో ఉంది. నగరంలో ఉదయం సమయంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంది, గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశల నుంచి గాలులు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. జిల్లాలతో పోల్చితే హైదరాబాద్‌లో చలి సాధారణంగా ఉంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నవంబర్ 12, 13 తేదీలల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వానలు కురవనున్నాయి. ముఖ్య నగరాలైన వైజాగ్, విజయవాడలో అల్పపీడనం అంతగా ప్రభావం చూపకపోవచ్చు. నవంబర్ 12 నుంచి 15 తేదీల్లో ఈ ప్రాంతాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. వాయుగుండం తమిళనాడులో ఉంది కాబట్టి కోస్తాంధ్ర, ఉత్తర రాయలసీమ జిల్లాలైన కర్నూలు, నంద్యాలలో వర్షాలు తక్కువగా ఉంటాయి. ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కొనసీమ, కాకినాడ, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మణ్యం జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురవనుంది. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గాలులు వీచడంతో చలి తీవ్రత పెరుగుతోంది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు ఏపీలో పూర్తి స్థాయిలో విస్తరిస్తున్నాయి.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర భాగాలైన ప్రకాశం పశ్చిమ భాగాల్లో, పల్నాడు, ఎన్.టీ.ఆర్, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలున్నాయి. నిన్న రాత్రి నుంచి చెన్నై, తమిళనాడు మీదుగా వాయుగుండం ప్రభావం ఉంది. బంగాళాఖాతంలో ఇప్పుడు రాడార్ చిత్రం చూస్తే భారీ మేఘాలు విస్తరించి ఉన్నాయి. రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప జిల్లాల్లో సాయంకాలం, రాత్రి వేళ కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. తిరుపతి జిల్లాలో పలుచోట్ల చినుకులు, మోస్తరు వర్షాలున్నాయి.